వాసిరెడ్డి.. వైసీపీని ఉతికి ఆరేస్తారా?
నాడు అన్న చిరంజీవి ప్రజారాజ్యంలో కీలక పాత్ర పోషించిన మహిళా నేత వాసిరెడ్డి పద్మ.. నేడు తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీలోకి చేరబోతున్నారట. ప్రజారాజ్యం ద్వారా ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ గుండా వైసీపీలో చేరిన ఆమె.. ఇటీవలే రాజీనామా చేశారు. ఆమె టీడీపీ, బీజేపీలో చేరడానికి సుముఖంగా లేరు. దీంతో ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ జనసేన మాత్రమే. వైసీపీలో ఉన్నన్ని రోజులుగా నేటి డిప్యూటీ సీఎంపై ఎప్పుడూ వ్యక్తిగతంగా, అనుచితంగా మాట్లాడిన సందర్భాలు లేవు. ఎందుకంటే మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం అలాంటిది. అదే ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్లడానికి లైన్ క్లియర్ చేసిందనే చర్చ మొదలైంది.
రండి.. రారండి!
2024 ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన పద్మ.. జగన్ ఎందుకో సీటివ్వలేదు. వైసీపీ ఓడిపోయిన తర్వాత కనీసం ఆశించిన నియోజకవర్గానికి ఇంచార్జీగా అయినా నియమిస్తారని ఎంతో ఆశపడ్డారు కానీ అదేమీ జరగలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆమె.. వైసీపీ, జగన్‌పై నాలుగు విమర్శలు చేసేసి రాజీనామా చేసి బయటికొచ్చేశారు. వాస్తవానికి వాసిరెడ్డి ఏ పార్టీలో ఉన్నా చేతినిండా పని ఉంటుంది. ఎలాగంటే.. మంచి వాక్చాతుర్యం, అనుభవం ఉంది. రాజకీయాలు, సమాజంలో జరిగే ఇతర విషయాలపై అనర్గళంగా మాట్లాడగలరు. దీనికి తోడు 2019 నుంచి 2024 వరకూ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అందుకే అన్ని పార్టీల నుంచి ఆహ్వానం ఉంది. బీజేపీ వాళ్లయితే అటు రాజీనామా చేసిన వెంటనే సంప్రదించి ఆహ్వానం పలికారట.
జనసేనలోకి వెళితే..
జనసేనలో అనర్గళంగా మాట్లాడేవారు, సబ్జెక్ట్ పరంగా ప్రత్యర్థులకు చురకలు అంటించేవారు చాలా తక్కువే. పైగా భవిష్యత్తు కూడా ఉంటుందని భావించి పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో నేరుగా చిరు ద్వారా పవన్‌ను కలిసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీనికి తోడు ఆమె రాజకీయాల్లో ఉండగానే కావాల్సినంతగా సంపాదించుకున్నారని, వ్యాపారాలు కూడా గట్టిగానే ఉన్నాయని ప్రచారం కూడా జరుగుతోంది. ఒకవేళ జనసేనలో చేరితే మాత్రం పద్మకు మంచి సువర్ణావకాశమే. దీనికి తోడు ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో కనిపించి విశ్లేషకురాలుగా కూడా ప్రమోషన్ తీసుకోవచ్చని టాక్ నడుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకప్పుడు వైసీపీకి రెబల్‌గా మారిన రఘురామ ఎలా విమర్శలు గుప్పించారో, ఇప్పుడు పద్మ కూడా అలాగే అయ్యి పార్టీని ఉతికి ఆరేసే అవకాశాలు మాత్రం మెండుగానే కనిపిస్తున్నాయి. ఫైనల్‌గా ఏం జరుగుతుందో చూడాలి మరి.