కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సత్యం సుందరం. సెప్టెంబర్ 28 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందడంతో పాటు, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. 96 వంటి కల్ట్ లవ్ స్టోరీని తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. విడుదలకు ముందు నుండే భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. థియేటర్లలోనూ మంచి విజయాన్నే అందుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను మెప్పించేందుకు విడుదలైన నెల రోజుల కంటే ముందుగానే అంటే 4 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది.
సత్యం సుందరం చిత్రం నేటి (అక్టోబర్ 25) నుండి ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ సినిమాను 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక గ్రాండ్‌గా నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. మరెందుకు ఆలస్యం.. ఓటీటీలో మంచి చిత్రాల కోసం వెతికే వారంతా ఈ సినిమాని కుటుంబంతో సహా కూర్చుని వీక్షించేయండి.
సత్యం సుందరం కథ విషయానికి వస్తే.. నా అనుకున్న వారి వల్లే ఇబ్బందులు తలెత్తడంతో సొంత ఊరు వదిలి వెళ్లిపోతాడు సత్యమూర్తి (అరవింద్ స్వామి). జన్మలో ఆ ఊరి ముఖం చూడకూడదని అనుకుంటాడు. సరిగ్గా పాతికేళ్ల తర్వాత ఆ ఊరిలో ఓ పెళ్లికి తప్పనిసరిగా సత్యం హాజరు కావాల్సి వస్తుంది. అప్పుడొక వ్యక్తి బావా అంటూ ఆప్యాయంగా పిలిచి సుందరంపై ఎక్కడాలేని ప్రేమను కురిపిస్తాడు. ఆ ప్రేమకు ఫిదా అవుతాడు సత్యం. అసలా వ్యక్తి ఎవరు? ఎందుకంత ప్రేమని కురిపిస్తాడు? వారి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? ఆ ఊరిపై మళ్లీ సత్యానికి ప్రేమ కలిగిందా? వంటి ప్రశ్నలకు సమాధానమే ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాతో నిండిన ఈ సినిమా.