గుంటూరు కారం సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడు. ఇంతకు ముందు మహాభారతం నేపథ్యంలో అల్లు అర్జున్‌తో పాన్ వరల్డ్ సినిమాగా ప్రకటించిన సినిమాయేనా? అనే అనుమానాలతో ఉన్నవారికి క్లారిటీ ఇచ్చేశారు నిర్మాత నాగవంశీ. ఈ సినిమాపై హైప్స్ పెంచేలా అప్పుడే నిర్మాత నాగవంశీ ప్రమోషన్స్ మొదలెట్టారు.
ప్రస్తుతం బన్నీ చేస్తున్న పుష్ప2 సినిమా విడుదలైన తర్వాత త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్ చేసే ప్రాజెక్ట్‌ని ప్రారంభిస్తామని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్-అల్లు అర్జున్‌గారి సినిమాను ఒక స్పెషల్ ప్రోమోతో జనవరిలో (సంక్రాంతి స్పెషల్) అనౌన్స్ చేస్తాం. మార్చి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. అల్లు అర్జున్‌గారు కూడా మార్చి నుండే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని చెప్పిన నాగవంశీ ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని విషయాలు కూడా పంచుకున్నారు.
ఇప్పటి వరకు దేశంలో ఎవరూ చూడని, టచ్ చేయని సబ్జెక్ట్‌ని త్రివిక్రమ్‌గారు రెడీ చేశారు. ప్రేక్షకులు ఒక కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారు. నిర్మాణం విషయంలో మేము కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ని తీసుకున్నామని నాగవంశీ తెలిపారు. నాగవంశీ ఇచ్చిన ఈ అప్డేట్‌తో ఈ సినిమాపై వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీగా ఉన్నట్లుగా పోస్ట్‌లు పెడుతున్నారు.