ఆస్తుల పంచాయితీతో వైఎస్ కుటుంబం మరోసారి రోడ్డెక్కింది. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తన తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిలపై పిటిషన్ దాఖలు చేశారు. సరస్వతి పవర్ కంపెనీ షేర్స్ విషయంలో ఈ వ్యవహారం నడుస్తోంది. ఈ కంపెనీ విషయంలో గత కొన్ని రోజులుగా జగన్- షర్మిళ మధ్య పెద్ద ఎత్తున వివాదం కొనసాగుతూనే ఉంది. వైఎస్ ఉన్నప్పుడే వారసత్వంగా వచ్చిన ఆస్తుల్లో జగన్‌కూ, షర్మిళకూ మధ్య పంపకాలు పూర్తయ్యాయి. ఈ రకంగానే షర్మిళకు ఆస్తులు వచ్చాయి. ఐతే ఈ మధ్య కాలంలో ఏం జరిగిందో తెలియదు కానీ మళ్ళీ మొదటికి వచ్చింది. షేర్స్ విషయంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)లో జగన్, భారతి ఇద్దరూ పిటిషన్ దాఖలు చేశారు.
చెల్లి చీటర్..!
ఇటు వైఎస్ జగన్, భారతి ఉంటే అటు షర్మిల, విజయమ్మ అన్నారు. అంటే ఇద్దరు వర్సెస్ ఇద్దరు అన్న మాట. ఈ పిటిషన్‌లో షర్మిలను చీటర్ అని పేర్కొనడం గమనార్హం. కంపెనీస్ ఆక్ట్ ప్రకారం సెప్టెంబర్ 10న షేర్స్ విషయంలో జగన్ తరపు లాయర్లు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కాగా.. సరస్వతీ పవర్ కంపెనీలో 99శాతం షేర్లు జగన్ రెడ్డికి.. ఒకే ఒక్క శాతం మాత్రమే విజయమ్మకు షేర్ ఉంది. సీబీఐ, ఈడీ కేసుల్లో భాగంగా ఈ ఆస్తి కూడా అటాచ్‌మెంట్‌లోకి వెళ్లిపోయింది. దీనిపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ఐతే జగన్ అరెస్ట్ సమయంలో స్వార్జిత ఆస్తుల్లో కొన్నింటిని చెల్లెలకు ఇస్తూ జగన్ ఎంఓయూ రాసిచ్చారు. ఐతే ఇక్కడే తేడా కొట్టడంతో జగన్ పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది.
ఏంటో ఏమో..!
ఇవన్నీ ఒక ఎత్తయితే.. తనకు తెలియకుండా, చట్ట విరుద్ధంగా జరిగిన షేర్ల బదిలీ వ్యవహారంపై జగన్ వెంటనే తన తల్లికి, చెల్లెలకు కూడా అభ్యంతరాలు కూడా తెలియజేశారట. తాను ప్రేమకొద్దీ నమ్మకంతో ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను వినియోగించుకుని, షేర్ల బదిలీ చేయడం సరికాదని కోపగించుకున్నారట. ఇది నమ్మకాన్ని వమ్ము చేయడమే అని చీవాట్లు పెట్టారట. రాజకీయ వైరుధ్యం, గత ఎన్నికల్లో వైసీపీని ఓడించడానికి టీడీపి, జనసేనలతో షర్మిళ చీకటి ఒప్పందం కారణంగానే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ నేతలు, కార్యకర్తలు చెబుతున్నారు. పూర్తి వ్యతిరేక పవనాలతో, వ్యక్తిగత, రాజకీయ సుడిగుండంలో చిక్కుకున్న జగన్ వీటి నుంచి క్యాడర్, పార్టీని ఏ మేరకు కాపాడుకోగలరు అని విమర్శలు, కొందరు రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.