టాలీవుడ్ కీర్తి, ఇండియన్ సినిమాకు స్ఫూర్తి.. ద వన్ అండ్ ఓన్లీ రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన పుట్టినరోజు నేడు (అక్టోబర్ 23). కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్ అంటే.. ఇండియన్ సినిమాను ఏకం చేసే కటౌట్ ఇదని ఎవరూ ఊహించలేదు. వీలైతే ప్రేమిద్దాం డూడ్ పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అనగానే గ్లోబల్ రేంజ్‌లో ప్రేమించేస్తారని ఎవరు మాత్రం ఊహిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచపటంలో నిలబెట్టిన ఛత్రపతి ఈ బాహుబలి. హీరోయిజంలో తిరుగులేని స్టార్‌డమ్‌తో ఇండియన్ సినిమాకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన ఈ సలార్‌కు సాహో చెబుతూ..
పాజిటివ్ యాటిట్యూడ్..
తెలుగు సినిమా ఇండస్ట్రీకి కిరీటం పెట్టుకున్న మహారాజుగా దాదాపు 30 సంవత్సరాలుగా మెగాస్టార్ చిరంజీవి ఉంటే.. కొంతకాలంగా మాత్రం కిరీటంలేని మహారాజుగా ప్రభాస్ రూల్ చేస్తున్నాడనేది కాదనలేని సత్యం. హిట్టు, సూపర్ హిట్టు వంటి పదాలు మరిచిపోయి.. బాహుబలి రేంజ్ సక్సెస్, నాన్ బాహుబలి వంటి పదాలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన మిస్టర్ పర్ఫెక్టే ఈ ప్రభాస్. చిరంజీవి, బాలకృష్ణలకు సెపరేట్‌గా ఫ్యాన్స్ ఉంటే.. నాగార్జున, వెంకటేష్‌లను మాత్రం ఇండస్ట్రీలోని అందరూ ఇష్టపడేవారు. ఇప్పుడలాంటి ఇమేజ్ ప్రభాస్ సొంతం. ఈ ఈశ్వర్‌ని ఇష్టపడని వారెవరు. అందుకు కారణం ప్రభాస్ పాజిటివ్ యాటిడ్యూడే. ఎప్పుడూ నవ్వుతూ ఉండటం, డార్లింగ్ అంటూ అందరినీ ఆప్యాయంగా పిలవడం.. ఇవన్నీ కూడా ప్రభాస్ ఆభరణాలు. అందుకే స్టార్స్ కూడా ఆయనని ప్రేమించేస్తారు. అజాతశత్రువు అనే పాత మాటకు డార్లింగ్ అనే కొత్త అర్థాన్నిచ్చాడు ప్రభాస్ అంటే అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ప్రభాస్ స్టార్ డమ్, ఛరిష్మా తో పాటు ఆయన మంచితనం టెక్కలి నుంచి టోక్యో వరకు ప్రభాస్‌కు అభిమానులను సంపాదించి పెట్టిందంటే అస్సలు అతిశయోక్తి కానే కాదు.
నిజంగా రాజే..
రాజులకే రాజు ప్రభాస్ రాజు అని ఆయన ఫ్యాన్స్ స్లోగన్స్ ఇస్తుంటారు. నిజంగా ప్రేమను పంచడంలోనూ, దానగుణంలోనూ ప్రభాస్ రాజులకే రాజు. ఆయన చెయ్యి ఎంత పెద్దదో.. ఆయన దానం కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఎప్పుడు ఏ ఉపద్రవం సంభవించినా.. డొనేషన్‌లో అగ్రస్థానం మాత్రం ఈ మహారాజుదే. అందులో పెదనాన్న కృష్ణంరాజునే మించిపోయాడు ప్రభాస్. ఆయనకు అసలుసిసలు వారసుడీ రాజా సాబ్.
ఫుడ్ లవర్
పెదనాన్న కృష్ణంరాజు మాదిరిగానే ప్రభాస్ కూడా ఫుడ్ లవర్. మాములుగా ఫుడ్ లవర్ అంటే ఇష్టమైన ఫుడ్ కడుపునిండా ఆరగించడమే అని అనుకుంటారు. కానీ ప్రభాస్ విషయంలో ఫుడ్ లవర్ అంటే.. ఎదుటి వ్యక్తి ఇష్టపడే ఫుడ్‌ని ఊహించని రేంజ్‌లో కడుపునిండా తినిపించడమే ప్రభాస్‌లో ఉన్న గొప్ప క్వాలిటీ. ఆ విషయం ఆయనతో కలిసి నటించిన ఎవరిని అడిగినా చెబుతారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే.. ఈ విషయంలో ప్రభాస్‌ని కొట్టేటోడే లేడనేలా సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు కూడా.
పాన్ ఇండియాకు నిర్వచనం ప్రభాస్
టాలీవుడ్ అంటే ఒకప్పుడు చిన్నచూపు ఉండేది. కానీ ఇప్పుడు టాలీవుడ్ గురించి ప్రపంచ మొత్తం మాట్లాడుకునేలా చేసింది, చేస్తుంది.. టాలీవుడ్ తలెత్తుకుని గర్వంగా నిలబడడానికి శ్రీకారం చుట్టింది మాత్రం ప్రభాసే. ప్రస్తుతం ప్రభాస్ అంటే చాలు పాన్ ఇండియా సబ్జెక్ట్ రెడీగా ఉంటోంది. ఒక్కమాటలో చెప్పాలంటే పాన్ ఇండియాకు నిర్వచనంగా ప్రభాస్ మారిపోయారు. ప్రస్తుతం ఆయన చేతిలో సలార్ 2, కల్కి 2, రాజా సాబ్, స్పిరిట్, ఫౌజీ వంటి పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి.
రికార్డుల రారాజు
ప్రభాస్ సినిమాల బాక్సాఫీస్ నెంబర్స్ ట్రేడ్ పరంగా ఒక స్కేలింగ్ అయితే ప్రభాస్ సినిమా వస్తుందంటే పిల్లల నుంచి పెద్దల వరకు థియేటర్స్‌కు వెళ్లడం ఒక ఫినామినా. ఎప్పుడో ఒకసారి సినిమా చూస్తాం అనే మలి వయసు పెద్దలు కూడా ప్రభాస్ సినిమాకు థియేటర్స్‌కు కదులుతారంటే.. అది ప్రభాస్ యూనివర్సల్ యాక్సెప్టెన్సీ. అందుకే బాక్సాఫీస్ దగ్గర డే 1 రికార్డ్స్, ఫస్ట్ వీక్ రికార్డ్స్, వరల్డ్ వైడ్ హయ్యెస్ట్ గ్రాస్, రికార్డ్ స్థాయి ఓవర్సీస్ కలెక్షన్స్ ప్రభాస్ పేరుపై లిఖించబడ్డాయి. ప్రభాస్ సినిమా అంటే మినిమమ్ వెయ్యి కోట్లు అనేలా హిస్టరీని క్రియేట్ చేసి.. ఈ విషయంలో ఇండియన్ సినిమానే తనని స్ఫూర్తిగా తీసుకునేలా చేసిన ఈ ఆదిపురుషుడికి సినీజోష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. హ్యాపీ బర్త్‌డే టు రెబల్ స్టార్ ప్రభాస్.