ఆహా తెలుగు ఓటీటీలో తిరుగులేని షో గా దూసుకెళుతోన్న అన్ స్టాపబుల్ షో ఇప్పుడు సీజన్ 4కి చేరుకుంది. రీసెంట్‌గా ఈ సీజన్‌కి సంబంధించిన ట్రైలర్‌ని యానిమేషన్‌తో డిజైన్ చేసి మేకర్స్ వదలగా.. అద్భుతమైన స్పందనను రాబట్టుకుంది. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో మొదలెట్టబోతోన్న విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ చిత్రీకరణను ఇటీవలే పూర్తి చేశారు. అక్టోబర్ 25వ తేదీన స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ఈ ఎపిసోడ్ ప్రోమోని మంగళవారం ఆహా టీమ్ విడుదల చేసింది. దాదాపు ఐదున్నర నిమిషాల నిడివితో వచ్చిన ఈ ప్రోమో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ సీజన్ కూడా తిరుగులేదు అన్నట్లుగా ఈ ప్రోమో ప్రభంజనం సృష్టిస్తోంది.
ఈ ప్రోమోలో చంద్రబాబుతో బాలయ్య ప్రమాణ స్వీకారం, ఎన్నికలకు ముందు చంద్రబాబు జైలు జీవితం, జైలులో ఉన్న బాబుని పవన్ కళ్యాణ్ కలవడం, క్రికెట్, చంద్రబాబు ఫ్యామిలీ, స్టేట్ అండ్ సెంట్రల్ పాలిటిక్స్ విషయంలో చంద్రబాబు మైండ్ సెట్.. ఇలా ప్రతి విషయాన్ని బాలయ్య టచ్ చేస్తూ.. చంద్రబాబుని క్వశ్చన్ చేశారు. బాలయ్య అడిగిన ప్రతి ప్రశ్నకు ఎంతో సమయస్ఫూర్తిగా చంద్రబాబు సమాధానాలు ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే.. చాలా రోజుల తర్వాత చంద్రబాబు మోములో చిరు నవ్వుని తెప్పించారు బాలయ్య. అలాగే చూస్తున్న ఆడియెన్స్‌ను ఏడిపించేలా చంద్రబాబు జైలు జీవితం గురించి చెప్పడం.. ఈ షోకి హైలెట్ అవుతోంది.
అలాగే పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశిస్తూ.. ఆకాశంలో సూర్యచంద్రులు వలే ఆంధ్రాలో బాబుగారు, కల్యాణ్‌బాబు అంటున్నారు. జైలులో మీ ఇద్దరి భేటీ.. అక్కడ ఏం జరిగింది? అనేది జనాలు తెలుసుకోవాలనుకుంటున్నారని బాలయ్య క్వశ్చన్ చేయగానే.. చంద్రబాబు ఇచ్చిన సమాధానం.. ఎప్పుడెప్పుడు ఈ షో టెలికాస్ట్ అవుతుందా? అనేంతగా క్యూరియాసిటీని పెంచేసింది. ఓవరాల్‌గా అయితే.. చంద్రబాబు ఒకప్పుడు నా స్లోగన్ థింక్ గ్లోబల్లీ.. యాక్ట్ లోకల్లీ, కానీ ఇప్పుడు నా స్లోగన్.. థింక్ గ్లోబల్లీ.. యాక్ట్ గ్లోబల్లీ.. అని చెప్పడంతో పాటు ఎప్పటికైనా తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఉండాలని నా ఆకాంక్ష అని చెప్పడం ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకుల, ప్రజల మనస్సులను మరోసారి గెలుచుకున్నారనేలా అప్పుడే ఈ షో పై టాక్ మొదలైంది.