హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సందడి చేశారు. సెలబ్రిటీలు ఆర్టీఓ ఆఫీస్‌కు వస్తే ఎలాంటి సందడి అయితే ఉంటుందో.. అంతకు మించి సందడి రామ్ చరణ్ రావడంతో మొదలైంది. గతంలో ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి వారు కూడా ఇలా ఆర్టీఓ ఆఫీస్‌కి వెళ్లడం, అక్కడి సిబ్బంది ఫొటోల కోసం ఎగబడటం వంటివి జరిగాయి. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అలాంటి వాతావరణమే కనిపించింది.
తను రీసెంట్‌గా కొన్న కొత్త రోల్స్ రాయిస్ కారు TG 09 2727 రిజిస్ట్రేషన్ నిమిత్తం ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్‌కు వచ్చిన రామ్ చరణ్‌తో ఫొటోలు దిగేందుకు అక్కడున్న మెయిన్ సిబ్బంది కూడా పోటీ పడటం విశేషం. ఆర్టీఓ సిబ్బంది అడిగిన వెంటనే రామ్ చరణ్ కూడా ఫొటోలకు ఓకే చెప్పారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ గ్లోబల్ రేంజ్ క్రేజ్‌తో దూసుకెళుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయన రేంజ్ అందుకోలేనంత స్థాయికి చేరింది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో చేసిన గేమ్ చేంజర్ చిత్రం రాబోయే సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ యమా జోరుగా నడుస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. త్వరలోనే మూడో సాంగ్‌ను కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాకు రామ్ చరణ్ ఓకే చేసి ఉన్నారు. ఇటీవల ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.