డిసెంబర్‌లో విడుదల కావాల్సిన గేమ్ చేంజర్ చిత్రాన్ని సంక్రాంతికి, అదీ కూడా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రం విడుదల కావాల్సిన తేదీన విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు విశ్వంభర చిత్రానికి సంబంధించి అన్ని పనులు దాదాపు పూర్తయినట్లుగా దర్శకుడు వశిష్ఠ చెబుతున్నారు. మరి అలాంటప్పుడు గేమ్ చేంజర్ చిత్రాన్ని ఎందుకు సడెన్‌గా విశ్వంభరను ఆపి.. ఆ స్థానంలో విడుదల చేస్తున్నారనే దానిపై సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలలో ప్రధానంగా ఓ వార్త బాగా హైలెట్ అవుతోంది.
గేమ్ చేంజర్ వాయిదాకి కారణం మెయిన్‌గా నిర్మాత దిల్ రాజు అని తెలుస్తోంది. దిల్ రాజు కావాలనే ఈ సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేయించారనేలా టాక్ వినబడుతోంది. అందుకు కారణం.. ఈ యేడాది అనగా 2024లో ఆయన నుండి వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఫ్యామిలీ స్టార్, లవ్ మీ, జనక అయితే గనక వంటి చిత్రాలు ఈ సంవత్సరం దిల్ రాజు నేతృత్వంలో వచ్చిన సినిమాలు. ఈ సినిమాలు ఎలాంటి రిజల్ట్‌ని పొందాయో తెలిసిందే. అందుకే ఈ ఏడాది తనకు అచ్చిరాలేదని, అందుకే గేమ్ చేంజర్‌ని 2025లో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చాడనేలా కొందరు పనిగట్టుకుని రాసుకొస్తున్నారు.
ఏమో.. దిల్ రాజు మనసులో ఏముందో. అసలే భారీ బడ్జెట్ సినిమా. ఈ ఇయర్ సెంటిమెంట్ ప్రకారం ఏదైనా తేడా కొడితే.. లిస్ట్‌లో ఇంకో చిత్రం చేరడం సంగతి అటుంచితే.. దివాళా తీయాల్సిన పరిస్థితి వచ్చినా రావచ్చు. అంత భారీ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్. అందుకే గేమ్ చేంజర్‌ని నెక్ట్స్ ఏడాదికి వాయిదా వేయించి ఉండొచ్చు. అందునా ఆయనకు సంక్రాంతి సెంటిమెంట్ ఉండనే ఉంది.