Advertisement

చంద్రబాబూ.. ఇంకెన్నాళ్లీ నేరాలు.. ఘోరాలు!

Mon 21st Oct 2024 09:51 PM
chandrababu  చంద్రబాబూ.. ఇంకెన్నాళ్లీ నేరాలు.. ఘోరాలు!
Chandrababu.. Crimes again and again.. Heinous! చంద్రబాబూ.. ఇంకెన్నాళ్లీ నేరాలు.. ఘోరాలు!
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఘోరంగా విఫలం అయ్యాయి. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే.. పసికందు నుంచి పండు ముదుసలి వరకూ ఎవరికీ రక్షణ లేకుండా లేదు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన బిడ్డ, తల్లి, అమ్మమ్మ తిరిగి ఇంటికి ఎప్పుడెప్పుడు క్షేమంగా తిరిగి వస్తుందా..? అని ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నిద్రపోయే పరిస్థితి లేదు. పోనీ ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాకే ఇలా జరుగుతోందా అంటే.. వైసీపీ హయాంలో కొద్దో గొప్పో భద్రత విషయంలో బెటర్ అన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఎందుకంటే దిశ యాప్ అందుబాటులోకి తీసుకురావడంతో చాలా వరకూ నేరాలు, ఘోరాలు తగ్గాయి. ఇది ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా అక్షరాలా నిజమే. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తోంది..? ఎందుకు కళ్లు మూసుకుని నిద్రపోతోంది అన్నది..? ఎవరికీ అర్థం కాని మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఎన్నాళ్ళు.. ఇంకెన్నాళ్ళు..?

ఏపీలో శాంతి భద్రతలు ఘోరాతి ఘోరంగా విఫలం అయ్యాయి. ఆడ బిడ్డల రక్తపు మరకలు అంటుకున్న తల్లిదండ్రులు ఏడవడానికి కన్నీళ్లు ఇంకిపోతున్నాయి.. ఆ కడుపుకోతను మాటల్లో చెప్పలేం.. రాతల్లో రాయలేని పరిస్థితి. ఇందుకు కారణం రాష్ట్రంలో నేరాలు చేయాలి అనుకునే వాళ్లకు బొత్తిగా భయం అనేది అస్సలు ఉండడం లేదు. చట్టాలలోని ఏదో ఒక లొసుగు చూపించి తప్పించుకోవచ్చనే ధీమా గట్టిగా ఉందనే చెప్పొచ్చు. డబ్బులు ఉంటే చాలు ఎక్కడికక్కడ మేనేజ్ చేయొచ్చు అనే భావనలో కూడా నిందితులు ఉంటున్నారు. దీనికి తోడు ఎక్కడిక్కడ గ్యాంగులు, రౌడీయిజం వీటికి తోడు డ్రగ్స్, గంజాయి కూడా ఉండటంతో కొందరి యువకుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అవసరం ఎంతైనా ఉంది. తప్పు చేయాలంటే.. మరీ ముఖ్యంగా ఆడపిల్లల జోలికి పోవాలంటే బయపడిపోయేలే పరిస్థితిని తీసుకుని రావాలి.

ఇంత ఘోరమా..!

ఆంధ్రాలో ఆడపిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులకు మనశ్శాంతి ఉండడం లేదు అనేది వందకు వెయ్యి శాతం వాస్తవం. ఇందుకు ఒకటా రెండా ఈ మధ్య జరిగిన ఘటనలే ప్రత్యక్ష సాక్ష్యం.

మొన్న పుంగనూరు, నిన్న హిందూపూరం, ఇవాళ బద్వేలులో జరిగిన ఘోరాతి ఘోరాలే అని చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన కేవలం నాలుగు నెలల్లో ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమైనా ఉన్నాయా..? అంటే బూతద్దం పెట్టి వెతికినా ఏమీ కనిపించవు.. వినిపించవు.

ఇంతేనా..?

దారుణం జరిగిన తర్వాత అరెస్టు చేసి, జైల్లో పెట్టడం కంటే.. ఇదిగో ఇతను తప్పు చేశాడు కాబట్టి పలానా కఠిన చర్యలు తీసుకున్నామని ధీమాగా సర్కార్ ఒక్కసారైనా చెబుతుందా..? అని వేచి చూస్తోంది ఏపీ ప్రజానీకం. పోనీ ఇప్పటివరకూ జరిగిన ఘటనలలో.. ఆడపడుచుల జోలికి వెళ్ళాలంటే భయపడేలా కఠిన చర్యలు.. శిక్షలు లేదా చట్టాలు, యాక్షన్ ఏమున్నాయి..?? అంటే ఏమీ లేవు. ఎంతసేపూ.. ఘటనలు తర్వాత హోం మంత్రి

ఒక ప్రెస్ మీట్, ఒక వార్నింగ్, ఒక న్యూస్ కవరేజీ, ఒక సమీక్ష తప్ప ఇంకేమైనా ఉందా..? అబ్బే అస్సలే లేదు.. ఇక్కడే లోపం ఉంది. ఒక్కసారి ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై ఎన్నడూ లేని రీతిలో చర్యలు తీసుకుంటే రెండోవాడు ఇలా చేస్తాడా..? లేదు కదా..!

మునుపటిలా..!

వాస్తవానికి.. చీరాలలో దారుణం జరిగి నాలుగు నెలలు దాటింది. నిందితులకు ఇప్పటికీ శిక్ష ఖరారు కాలేదు. ఇక హిందూపురంలో దారుణం జరిగి పది రోజులు దాటింది.. నిందితులు రిమాండులో ఉన్నారు.. కానీ కఠిన చర్యలు దిశగా ఏమీ కదలికలు లేవు. ఈ రెండు ఘటనల్లో నిందితులను పోషించడం వల్ల ప్రయోజనం ఏమిటి..?.. ప్రభుత్వానికి గానీ.. పోలీసులకు కానీ ఏమైనా ప్రయోజనం ఉందా అంటే ఏమీ లేదు కదా. ఒకటి, రెండు ఘటనల్లో అలనాటి ఎస్పీ సజ్జనార్ తరహాలోనో.. లేదా సత్వర తీర్పులు వచ్చినట్టో చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతే కాదు బహిరంగంగా శిక్షలు అమలు చేయండి.. ఈ పరిస్థితి లేకపోతే ఆడపిల్లల తల్లిదండ్రులు మనశ్శాంతిగా ఉండరు.. ఉండలేరు.. వారికి దిన దిన గండమే..! అనే మాటలు ప్రజల నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి. చంద్రబాబు అంటేనే ఎన్నెన్నో గుర్తుకొస్తాయ్.. అలాంటిది ఆయన హయాంలో ఒక్క ఘటనలో కఠిన చర్యలు తీసుకుంటే యావత్ సమాజానికి ఒక సందేశం ఇచ్చినట్టు అవుతుంది. నేరాలు చేయాలంటే భయపడే రీతిలో ఉండాలి.. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు చరిత్ర పుటల్లో చిరస్థాయిగా ఉండేలా.. ఒక్క ఘటనలో చర్యలు తీసుకొని చూపించండి చంద్రబాబూ..!

Chandrababu.. Crimes again and again.. Heinous!:

Law and order in AP has failed miserably

Tags:   CHANDRABABU
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement