ఏపీ సీఎంగా ఉన్నప్పుడు మీడియాకు ముఖం చాటేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అధికారం పోయేసరికి వారంలో ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఇదిగో టీడీపీ కూటమి అది చేయట్లేదు.. ఇది అమలు చేయలేదు.. అదే జగన్ ఉండి ఉంటే.. అంటూ ఆహా.. ఓహో అంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు వైసీపీ అధినేత. ఐతే.. జగన్ మాటలకు అధికార పక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఎందుకంటే.. ఎంతసేపూ వైసీపీ హయాంలో ఇచ్చిన హామీల కంటే ఎక్కువే అయ్యాయని.. 99 శాతం హామీలు అమలు చేశామని చెబుతుంటారు కదా.. మాట ఇచ్చి నిలుపుకోనివి.. హామీలు ఇచ్చి అమలు చేయలేనివి ఏమీ లేవా..? అంటే పెద్ద జాబితానే ఉంది.
ఇదిగో చేసింది..!
వైసీపీ హయాంలో సంక్షేమ పథకాలు ఎన్నో అమలు చేశాం.. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం అని చెప్పుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయ్. వాలంటీర్ వ్యవస్థ, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, నాడు నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు నిర్మాణం, మరమ్మతులు అంతే కాదు.. ఒక్క పథకాలే కాకుండా భోగాపురం ఎయిర్ పోర్టు, 4 పోర్టులు, 10 హార్బర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, 17 మెడికల్ కాలేజీలు, అదాని డేటా సెంటర్, గ్రీన్ కో, 13 లక్షల కోట్ల పెట్టుబడులు కోసం వైజాగ్ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్.. ఇవి అన్నీ జరిగింది 2019-24 మధ్యలోనే.. ఇవి చేయింది జగన్ మోహన్ రెడ్డే కదా అని వైసీపీ నేతలు, కార్యకర్తలు నాటి నుంచి నేటి వరకు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. వైసీపీ అధికారంలోకి వచ్చిన కేవలం 100 రోజుల్లోనే 87 శాతం హామీలు అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని స్వయంగా ఈ మధ్యనే పదుల సార్లు చెప్పారు.
నిజమా జగన్..?
వైఎస్ జగన్.. 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎన్ని..? ఏమేం అమలు చేశారు..? ఎగ్గొట్టినవి ఎన్ని..? అనేవి ఇప్పుడు చూద్దాం రండి. ప్రత్యేక హోదా తెచ్చారా..? మద్యపాన నిషేధం చేస్తాం అన్నారు.. చేశారా..?.. సీపీఎస్ రద్దు చేస్తామని మాటిచ్చారు.. అధికారంలోకి వచ్చాక మడమ ఎందుకు తిప్పారో..?. కరెంటు చార్జీలు తగ్గింపు అని.. 200 యూనిట్లు ఫ్రీ కరెంటు అని కూతలు కూసి చివరికి సామాన్యుల నడ్డి విరించింది తమరు కాదా..?. కడప స్టీల్ ప్లాంట్ అన్నారు.. ఏమైంది.. ఎక్కడికి వచ్చింది..? మూడు రాజధానులు అన్నారు.. మూడు సంగతి దేవుడెరుగు ఒక్కటైనా ఒక్క అడుగు ముందుకు పడిందా..?. అంతేకాదు అమరావతి రాజధాని అని అప్పుడు చెప్పి వైసీపీ హయాంలో మూడు అని ప్రస్తావన ఎందుకు తెచ్చారు..?. నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ ఉంటుంది అన్నారు.. ఈ లెక్కన ఎన్ని నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి..? అంటే ప్రశ్నార్థకమే.
ఇంకా చాలానే..!
పేదలందరికీ ఇల్లు అన్నారు.. జగనన్న కాలనీలు అంటూ పట్టాలు ఇచ్చారు.. ఎంత మందికి ఇల్లు కట్టించి ఇచ్చారు..? అదిగో.. ఇదిగో అని హడావుడి చేసి పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామన్నారు..? చివరికి చేసిందెంటి..? కాపు కార్పొరేషన్ కోసం 10 వేల కోట్లు ఇస్తామన్నారు..? ఇచ్చారా..? 13 లక్షల అగ్రిగోల్డ్ బాధితులకు మేలు చేస్తామని.. చేసుందేంటి..? మెగా డీఎస్సీ సంగతి ఏంటి.. పోనీ డీఎస్సీ నోటిఫికేషన్ ఐనా వచ్చిందా..? అవ్వ తాతలకు మూడు వేల పెన్షన్ ఇవ్వాల్సింది.. ఎంత వరకూ ఇచ్చారు..?. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయన్నది టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు.. నేతల నుంచి వస్తున్న ప్రశ్నలు.. వీటికి వైసీపీ నుంచి సమాధానం వస్తుందా అంటే అబ్బే అది అయ్యే పని కానే కాదు.
ఆ మాత్రం తెలియదా..!
ఎంతసేపూ ఇప్పుడున్న టీడీపీ కూటమి అది చేయలేదు.. ఇది చేయలేదు జగన్ ఉండుంటే అన్నీ అమలు అయ్యేవి.. అని వేలు ఎత్తి చూపించే ముందు ఒక్కసారి గతానికి వెళ్లి ఆలోచిస్తే మంచిది. ఐనా నాలుగు, ఐదు నెలల్లోనే అద్భుతాలు, అభివృద్ధి జరగాలంటే సాధ్యమేనా..? అన్నది కూడా తెలుసుకోకపోతే ఎలా..?. అందుకే.. ఏడాది, ఏడాదిన్నర ప్రభుత్వాన్ని వదిలేయండి అప్పటికి సూపర్ సిక్స్, ఇంకా హామీలు అమలు చేయకపోతే ప్రజల పక్షాన నిలబడి.. ప్రభుత్వం మెడలు వంచి అమలు అయ్యేలా చేయండి. ఇందుకు ధర్నాలు, దీక్షలు, నిరసనలు అప్పుడు చేపడితే ఎవరేం అనరు కదా జగన్. అందుకే.. ఇకపై చెప్పిన దానికంటే ఎక్కువగా 99% హామీలు పూర్తి చేసిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డిదే అని వైసీపీ నేతలు.. అవును నేనే.. మా పార్టీనే చేసింది అని జగన్ ఇకనైనా దయచేసి చెప్పుకోకుండా ఉంటే అదే పదివేలు సుమీ..!