తెలంగాణ బీజేపీని ముందుకు నడిపే రథసారథి ఎవరు..? సీనియర్ నేత ఈటెల రాజేందర్ అవుతారా..? లేదంటే మళ్లీ బండి సంజయ్ సీటులో కూర్చుంటారా..? ఇప్పుడిదే రాష్ట్ర కమలనాథులు, కాషాయ పార్టీ కార్యకర్తల్లో మెదులుతున్న ప్రశ్న. ఎందుకంటే.. అటు అసెంబ్లీ.. ఇటు పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్తబ్ధుగా ఉన్న తెలంగాణ బీజేపీ నేతలు, క్యాడర్, ముత్యాలమ్మ గుడి దగ్గర జరిగిన ఆందోళనలతో మళ్ళీ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. దీంతో ఎన్నో ప్రశ్నలు జనాల్లో మెదులుతున్నాయి.
ఏం నడుస్తోంది..?
తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తర్వాత ఎక్కువ గొడవలు జరిగేది బీజేపీలోనే.. ఇది అందరికీ తెలిసిన విషయమే. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులు తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎలా ఉండేది..? కిషన్ రెడ్డికి అప్పగించాక ఎలా ఉంది అనే తేడా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో.. ఈ ఇద్దరూ గోల ఒకటి ఐతే తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అధ్యక్ష పదవి కావాలన్నది ఈటెల రాజేందర్ చిరకాల కోరిక. అందుకే.. సమయం సందర్భం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను బంతాట ఆడుకుంటూ ఉంటారు. ఎన్నికల తర్వాత మిన్నకుండిపోయిన నేతలు ఒక్కసారిగా యాక్టివ్ అవుతున్నారు. బల ప్రదర్శన చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
మొన్న.. నిన్న.. ఇవాళ..!
వరదలు, హైడ్రా విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గట్టిగానే తిరిగారు. ప్రభుత్వ పని తీరును తీవ్రంగా తప్పుబట్టి బాధితులకు న్యాయం చేయడానికి తన వంతు ప్రయత్నం చేసారు. ఇక మూసీ సుందరీకరణ చేస్తూ నిరుపేదలకు నిలువ నీడ లేకుండా ప్రభుత్వం చేస్తోందని ఎంపీ ఈటెల రాజేందర్ ఏకంగా ధర్నాలు, ర్యాలీలు చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. నేనేం తక్కువ తిన్నానా అంటూ మరో కేంద్రమంత్రి బండి సంజయ్ రంగంలోకి దిగిపోయారు. గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థుల కోసం రోడ్డు మీదికి వచ్చి రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా పోరు చేసి.. అరెస్ట్ కూడా అయ్యారు. దీని అంతటికీ ముందు తెలంగాణ బీజేపీ నేతలు, క్యాడర్, ముత్యాలమ్మ గుడి జరిగిన ఆందోళనలతో మళ్ళీ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. ఆఖరికి లాఠీచార్జి కూడా చేసిన పరిస్థితి.
పగ్గాలు ఎవరికి..?
ఇంతలా యాక్టివ్ అయిన బీజేపీ క్యాడర్ ను ఒక్క తాటి పైకి తెచ్చి ముందుకు నడిపే నేత ఎవరు..? రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ హైకమాండ్ తీసుకునే నిర్ణయం ఏంటి..? ఈ తరుణంలో మళ్ళీ బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ సారథి అవుతారా..? లేదంటే ఈటెల రాజేందర్ పగ్గాలు చేపడుతారా..? అంటూ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఐతే.. ఒకే ఒక్క రోజులో తెలంగాణ రాజకీయం మొత్తం బీజేపీ చుట్టూ బండి సంజయ్ తిప్పేసారని మాత్రం గట్టిగానే చర్చ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో పదవి ఎవరిని వరిస్తుందో..? మునుపటి పరిస్థితులు బీజేపీకి ఎప్పుడు వస్తాయో..? చూడాలి మరి.