అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే. జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీల సంగతి పక్కనపెడితే టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు రెచ్చిపోతున్నారు. ఎంతలా అంటే రేపు పొద్దున్న మళ్ళీ మనం ఎమ్మెల్యేగా, అధికారంలోకి టీడీపీ వస్తుందో రాదో అన్నట్టుగా బరి తెగిస్తున్నారు. మీకో దండం అయ్యా.. పలానా పనులు చేయకండని అధినేత, సీఎం చంద్రబాబు పదే పదే చెప్పినా లెక్క చేయకపోవడం గమనార్హం. ఆఖరికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను పిలిపించి ఒకసారి.. కొందరిని ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నా ప్రయోజనం లేకపోవడం చూస్తే అసలు కూటమి సర్కారులో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి.
ఎందుకిలా..?
చంద్రబాబు సీఎం అయ్యారంటే చాలు చిన్నపాటి అటెండర్ మొదలుకుని సెక్రటేరియట్ లో పనిచేసే పెద్ద పెద్ద అధికారులు.. ఇక ఎమ్మెల్యేలు, మంత్రుల గురుంచి ఐతే చెప్పనక్కర్లేదు. ఇలా ఈ కేడర్ లో ఉన్నోళ్ళు అయినా సరే ఎవరి పని.. వాళ్ళు చేసుకోవాల్సిందే.. తేడాలు వస్తే తాట తీసుడే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఎందుకో కనీసం సొంత పార్టీ ఎమ్మెల్యేలు.. సీఎంను అస్సలు లెక్కచేయకుండా ప్రవర్తిస్తున్నారు. ఏదైతే చంద్రబాబు చేయొద్దు.. వాటి జోలికి వెళ్లొద్దు అంటున్నారో.. వద్దన్నదే చేస్తూ సర్వ నాశనం చేస్తున్నారు. వీరి చర్యలతో అధికారంలోకి వచ్చిన కేవలం నాలుగంటే నాలుగు నెలలకే ఎక్కడలేని చెడ్డ పేరు వచ్చేసింది.. ఇక చంద్రబాబుకు కూడా మునుపు ఎన్నడూ లేని రీతిలో మార్క్ వచ్చి పడింది. ఇలా కొందరు ఎమ్మెల్యేల తెచ్చిన తలవంపులతో చంద్రబాబుకు పెద్ద తలనొప్పి వచ్చి పడింది.
అర్థం కాదేమో..!
వాస్తవానికి.. ఉచిత ఇసుక, మద్యం షాపుల టెండర్ల జోలికి వెళ్లొద్దని పదుల సార్లు ఎమ్మెల్యేలకు.. సీఎం చెప్పారు.. వార్నింగ్ కూడా ఇచ్చారు. ఐనా సరే.. తగ్గేదేలా అంటూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. పాలసీలో మార్పులు తెచ్చినా.. ఎమ్మెల్యేలు మాత్రం పద్ధతి మార్చుకోవడం లేదు. అదేంటి అంటే.. బరితెగించి మరీ ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికీ ఉచితంగా ఇసుక ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లలో తీసుకెల్లడానికి అవకాశం లేకుండా పోయిందంటే అర్థం చేసుకోవచ్చు. మరోవైపు.. ఒకపక్కేమో అధినేత చంద్రబాబు మద్యం జోలికి వెళ్లొద్దని చెప్పిన గంటలు గడవకముందే.. మద్యం షాపుల కోసం తమ్ముళ్ల సిగపట్లు పడుతుండటం ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. ఇసుక విషయంలో ఇదిగో ఇలా చేస్తున్నారని సోషల్ మీడియా లేదా.. మీడియాకు చెబితే ఇక ఆ ఎమ్మెల్యే మనుషులు ఉరికించి మరీ కొడుతుందటం ఎంత దారుణమో. ఎందుకంటే.. అటు మద్యం ఇటు ఇసుకతో సొమ్ము చేసుకోవాలన్నది తమ్ముళ్లు ఆరాటం. ఈ చెత్త పనులతోనే చంద్రబాబుకు తలవంపులు వస్తున్నాయి.
సొంత మీడియానే..!
రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యం రాజ్యమేలుతోందని.. ఏ నియోజకవర్గంలో చూసినా ఇసుక, మద్యం, పేకాట క్లబ్‌లు కనిపిస్తున్నాయి అంటూ చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న టీవీ ఛానెల్స్, దినపత్రికలలో తమ్ముళ్ళ బాగోతాలు అంటూ ప్రధాన శీర్షికలలో వార్తలు వస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రతిపక్షాల నుంచి ఐతే.. దోచుకో.. పంచుకో.. తినుకో అంటున్నటుగా సర్కారు తీరు ఉందని ఎండగడుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఇక సోషల్ మీడియాలో ఐతే బాబోయ్ మాటల్లో చెప్పలేం.. ఈ పరిస్థితులతో సీఎంకు కనీసం సభ్య సమాజానికి ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదట. అందుకే.. అధికారం అనే బలం చూసుకుని హద్దు మీరి ప్రవర్తించకండి.. అణిగిమణిగి రేపు పొద్దున్న మళ్ళీ ఎన్నికలు ఉంటాయ్ అనే విషయం తెలుసుకుని ప్రజలకు నాలుగు మంచి పనులు చేసి.. నాలుగు ఓట్లు సంపాదించుకునే పని చేస్తే మంచిది మరి.