ఇదేంటి.. టైటిల్ చూడగానే కాస్త వింతగా అంతకు మించి విచిత్రంగా ఉందని అనుకుంటున్నారు కదూ.. అవును మీరు వింటున్నది నిజమే..! కొట్లాటలకు కేరాఫ్ అడ్రస్సుగా ఉండే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ పెద్దగా రచ్చలేమీ లేవు. ఐతే.. అదంతా శాశ్వతమా అంటే అస్సలు కానే కాదు. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీలో పెద్ద తలకాయల మధ్య రాద్దాంతం జరుగుతోందట. ఈ విషయం తిన్నగా బయటికి పొక్కింది.. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో కోడై కూస్తోంది. ఇంతకీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి - మంత్రి, బిగ్ షాట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిల మధ్య ఎందుకు వర్సెస్ నడుస్తోంది..? ఏమిటా హెలికాప్టర్ లొల్లి అనేది చూద్దాం వచ్చేయండి.
ఇదీ అసలు సంగతి..
కాంగ్రెస్ పార్టీలో హెలికాప్టర్ లొల్లి మొదలైందట. దీంతో రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి కన్నెర్రజేసి.. నేను త్యాగం చేస్తేనే రేవంత్ రెడ్డికి సీఎం పదవి వచ్చింది.. నాకే హెలికాప్టర్ లేదంటారా? అంటూ ఆగ్రహంతో ఊగిపోయారట. అవును.. నేను ఎప్పుడు అవసరమైతే అప్పుడు హెలికాప్టర్‌ను వాడుకుంటానంటూ అధికారులపై వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఐనా సరే.. మంత్రి కోమటిరెడ్డికి హెలికాప్టర్ ఇవ్వడానికి అధికారులు నిరాకరించారట. దీంతో వివాదం ఇంకాస్త చెలరేగిందట. ఇలా అధికారులు వర్సెస్ కోమటిరెడ్డిగా పరిస్థితులు నెలకొనడంతో మినిట్ టూ మినిట్ లైవ్ అప్డేట్స్ సీఎంకు చేరాయట. ఆయన చెప్పినట్టే అధికారులు ఆచరించారనే టాక్ కూడా నడుస్తోంది.
అసలేంటి మీ ఉద్దేశం..?
ముఖ్యమంత్రికి మాత్రమే హెలికాప్టర్ ఉపయోగించే వీలుంటుందని, మంత్రులు అత్యవసర సమయాల్లో మినహా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించే అవకాశం ఉండదని అధికారులు ఒకటి పది సార్లు చెప్పినా కోమటిరెడ్డి మాత్రం అస్సలు వినలేదట. దీనికి మంత్రి బదులిస్తూ.. నేను వెళ్లే పని అత్యవసరం కాదనేనా మీ ఉద్దేశం..? నేను త్యాగం చేస్తే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చిందని ఓ ఉన్నతాధికారిపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆఖరికి ఈ పంచాయితీ అసలు తెగలేదట. సమయం, సందర్భం వచ్చినప్పుడు తాను ఏంటో చూపిస్తానని కొందరు అధికారులకు గట్టిగానే ఇచ్చారట మంత్రి. అంతేకాదు తమరి పేర్లు చెప్పి పుణ్యం కట్టుకోండి అని నోట్ చేసుకున్నారట కోమటిరెడ్డి.
ఒకటి తర్వాత మరొకటి..!
కాంగ్రెస్ అంటేనే కొట్లాటలు ఉండే పార్టీ అని పెద్ద పేరే ఉంది. అలాంటిది అధికారంలోకి వచ్చిన నాలుగైదు, ఆరు నెలల పాటు ఎక్కడా వివాదాలు లేకుండా నడిచిందంటే గొప్పే. అలాంటిది హైడ్రా, వరద సాయం విషయంలో సర్కారుపై వ్యతిరేకత, కొండా సురేఖ మాటలు, మూసీ సుందరీకరణ, ఉద్యోగాలు.. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ చాలానే ఉన్నాయి. వీటి అన్నిటికంటే కొండా సురేఖ వివాదం మాత్రం పెద్ద రచ్చే అయ్యింది. ఇప్పుడిప్పుడే ఈ వివాదం సెట్ అవుతుందనే సమయంలో ఇలా కోమటిరెడ్డి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఇకపై సీరియల్ ఎపిసోడ్స్ లాగా ఒక్కక్కటిగా వివాదాలు బయటికి వస్తూనే ఉంటాయేమో. ఈ హెలికాప్టర్ వివాదంలో నిజానిజాలు ఎంతో క్లారిటీగా తెలియట్లేదు కానీ.. కోమటిరెడ్డి ఫ్యాన్స్ మాత్రం అస్సలు ఆగలేకపోతున్నారు.
గుర్తు లేదా..?
నల్గొండ, సూర్యాపేట, భువనగిరి మూడు జిల్లాల్లో మొత్తం ఎమ్మెల్యేలను గెలిపించుకున్నది కోమటిరెడ్డి.. దీనికి తోడు ఎంపీలు కూడా గెలిచారనే విషయాన్ని మంత్రి వీరాభిమానులు గుర్తు చేస్తున్నారు. ఆయన అడిగింది కేవలం హెలికాప్టర్ మాత్రమే కదా.. దీనికే ఇంత రాద్దాంతం అవసరమా..? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి కర్త.. కర్మ.. క్రియ కోమటిరెడ్డి మాత్రమే అని అనుచరులు, వీరాభిమానులు చెబుతున్న పరిస్థితి. చూశారుగా.. హెలికాప్టర్ లొల్లి.. ఇది ఎంతవరకూ వెళ్లి ఆగుతుందో.. ఆకరికి ఏమవుతుందో..? అనేది చూడాలి మరి.