చెన్నై లో వర్ష భీబత్సం అక్కడ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తుంది. తమిళనాడు వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు ఒక ఎత్తు, చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలు ఒక ఎత్తు అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. వరద నీటిలో చెన్నై ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే చెన్నై లోని సూల్స్, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. పలు ప్రాంతాలు భారీ వర్షాలకు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
చెన్నై లోని లోతట్టు ప్రాంతాలనే కాదు ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తుంది. చెన్నైలో సెలబ్రిటీస్, ప్రముఖ రాజకీయ నేతలు నివాసముండే పోయెస్ గార్డెన్‌ను వరదలు ముంచెత్తాయి. అదే ప్రాంతంలో నివసిస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ నివాసాన్ని కూడా వరద నీరు వదల్లేదు. రజనీకాంత్ ఇంటిలోకి నీళ్లు కూడా వచ్చాయని తెలుస్తోంది. రజనీకాంత్ మాత్రమే కాదు ఆ ఏరియా లో ఉన్న పలువురు ప్రముఖుల ఇళ్ళ లోకి నీళ్లు చేరిన విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
చెన్నై పరిసర ప్రాంతాల్లో 24 గంటలపాటు ఏకధాటిగా వర్షం పడటంతో డ్రైనేజీ వ్యవస్థ నిర్వీర్యం కావడంతో వరద నీరు చెన్నై ని ముంచెత్తింది. అయితే పోయెస్ గార్డెన్ హై సెక్యూరిటీ జోన్ కావడంతో వెంటనే అధికారులు, కార్పోరేషన్ సిబ్బంది వరద నీరు మళ్లింపు చర్యలను చేపట్టినట్లుగా సమాచారం.