Advertisementt

మళ్ళీ.. మళ్ళీ వివాదాలేనా మంత్రిగారు

Tue 22nd Oct 2024 11:56 AM
konda surekha,controversy  మళ్ళీ.. మళ్ళీ వివాదాలేనా మంత్రిగారు
Konda Surekha in One More Controversy మళ్ళీ.. మళ్ళీ వివాదాలేనా మంత్రిగారు
Advertisement

ప్రజాప్రతినిధి.. అందులోనూ మంత్రి పదవి ఉన్నవారు ఎలా ఉండాలి. మీడియా ముందుకు వచ్చినా, నలుగురిలో మాట్లాడాలన్నా ఆచి తూచి మాట్లాడాలి. ఇక ఏదైనా ఒక పని చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందుకు అడుగులు వేయాలి.. ప్రజలకు పనికొచ్చే నాలుగు పనులు చేస్తూ.. నలుగురి నోట మంచి అనిపించుకోవాలి.. నియోజకవర్గం అభివృద్ధి చేయడమే కాకుండా.. తన దగ్గరున్న శాఖకు న్యాయం చేయాలి. అప్పుడే ప్రజలు రేపు పొద్దున్న ఓటు వేసేప్పుడు గుర్తు తెచ్చుకుంటారు.. అంతేకానీ నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిస్తే ఎవరైనా పట్టించుకుంటారా..? అసలే కొన్ని వివాదాలు మంత్రి పదవికే ఎసరు తెచ్చే దాకా వెళ్లాయి. అలాంటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సింది పోయి మళ్ళీ మళ్ళీ వివాదాల జోలికి వెళ్తే ఎలా ఉంటుంది..? అంటే సరిగ్గా కొండా సురేఖ లాగే ఉంటుంది మరి.

ఎందుకు.. ఏమైంది మేడం..?

అధికారం ఉందన్న అహంతో ఆది నుంచి మంత్రి కొండా సురేఖ విర్రవీగుతూ ఉన్నారనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయ్. ప్రతిపక్షం, అధికార పక్షం అని కాకుండా సురేఖపై ఎన్నెన్ని ఆరోపణలు వచ్చాయో మనం పేపర్లు, టీవీలలో చూసే ఉంటాం. సీనియర్ అని మంత్రి పదవి ఇచ్చిన పాపానికి ఆ పదవికి కళంకం తెచ్చారని సొంత పార్టీ నేతలు తిట్టి పోస్తున్న సందర్భాలు అందరికీ గుర్తుండే ఉంటుంది. అంత ఎందుకు ఇటీవలే సినిమా ఇండస్ట్రీలో పేరుగాంచిన అక్కినేని నాగార్జున కుటుంబం, సమంతలపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దేశమంతా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై అటు కేటీఆర్.. ఇటు నాగార్జున కొండా సురేఖపై క్రిమినల్ కేసులు వేయడంతో ఇప్పుడు కోర్టులో విచారణ దశలో ఉన్నాయి. ఐతే ఈ ఘటనలు మరవకముందే మరో వివాదంలో సురేఖ ఇరుక్కున్నారు.

ఇదీ అసలు సంగతి..

వరంగల్‌ కాంగ్రెస్‌ పార్టీలో మంత్రి కొండా సురేఖ వర్సెస్ రేవూరి ప్రకాష్‌ రెడ్డిగా పరిస్థితులు నెలకొన్నాయి. దసరా ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌ రెడ్డి ఫొటో లేకపోవడంతో వివాదం తలెత్తింది. ఈ విషయంలో శనివారం నాడు రేవూరి - కొండా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కొండా సురేఖ వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు. ఇంత దారుణమా అంటూ.. ధర్మారం రైల్వేగేట్ దగ్గర మంత్రి కొండా సురేఖ వర్గీయులు ధర్నాకు దిగారు. అనంతరం మంత్రి గీసుగొండ పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదంతా ఒక ఎత్తయితే.. పోలీస్ స్టేషన్ లోనే ఎస్సై కుర్చీలో కూర్చుని మరీ పోలీసులకు కొండా సురేఖ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.

ఇదేం పద్ధతి..?

ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు, నేతలు.. వీరాభిమానులు రచ్చ రచ్చే చేస్తున్నారు. ఎస్సై కుర్చీలో కూర్చుని పోలీసులకు వార్నింగ్ ఇవ్వడం ఏంటి..? పోలీస్ స్టేషన్లు అనేవి పొలిటికల్ బిల్డింగ్స్ కాదు కదా..? మంత్రి ఐతే ఇష్టానుసారం ప్రవర్తిస్తే బాగుంటుందా..? మంత్రికి కేటాయించిన సీటులోనే కూర్చోవాలి కదా..? అంటూ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐతే.. ఇంకెన్ని వివాదాల్లో ఇరుక్కుంటారు..? అని మీడియా ప్రతినిధులు మంత్రిని ప్రశ్నించగా.. ఈ వివాదంపై ఇప్పుడేం మాట్లాడను అంటూ అక్కడి నుంచి తిన్నగా జారుకున్నారు. చూశారుగా.. మొన్న కేటీఆర్ విషయంలో.. నిన్న నాగార్జున కుటుంబం.. ఇవాళ ఫ్లెక్సీ వివాదం.. రేపు ఇంకేంటో మరి.  ఇంత జరుగుతున్నా.. ఇన్ని చేస్తున్నా కనీసం ఇసుమంత కూడా గౌరవంగా సురేఖ వ్యవహరించడం లేదు.. పరిస్థితి ఇలాగే ఉంటే కచ్చితంగా మంత్రి పదవి పోయినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు ఏమో.. ఏం జరుగుతుందో చూడాలి.

Konda Surekha in One More Controversy:

Konda Surekha in SI Chair 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement