రాయలసీమ రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ రూటే సపరేటు..! ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి వయసు మీద పడటంతో కాస్త తగ్గారు కానీ.. జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం యమా యాక్టీవ్. అధికారంలో ఉన్నా.. లేకున్నా జేసీ ఫ్యామిలీ హవా నడుస్తూనే ఉంటుంది.. మరీ ముఖ్యంగా తాడిపత్రిలో రెండు, మూడు నెలలకు ఒకసారి అయినా ఫ్యాక్షన్ పడగలు విప్పుతూనే ఉంటుంది. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు పెద్దగా హడావుడి చేయని ప్రభాకర్.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఓ రేంజిలో హడావుడి చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక.. ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేసుకోవాల్సింది పోయి.. కమిషన్ డబ్బులతో అభివృద్ధికి పూనుకున్నారు.
ఇదీ అసలు సంగతి..!
జేసీ ప్రభాకర్ రెడ్డి.. ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నారు. నియోజకవర్గంలో ఇసుక వ్యాపారం, క్లబ్‌లు నడిపేవారు నియోజకవర్గం అభివృద్ధికి 15 శాతం కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు తాను కూడా నియోజకవర్గ అభివృద్ధికి 20 శాతం డబ్బులు ఖర్చు పెడతానని మాటిచ్చారు. నాకు ఒక్కపైసా కూడా వద్దు.. నియోజకవర్గ అభివృద్ధికి కఠినంగా ఉంటానన్నారు. ఇందుకు టార్గెట్ కూడా పెట్టుకున్నారు జేసీ. 3 నెలల్లో రూ.3 కోట్లు అంటే.. 2025 డిసెంబర్ నాటికి రూ.10 కోట్లతో తాడిపత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు.
నాటి నుంచి నేటి వరకూ..!
1952 నుంచి రాజకీయాల్లో ఉన్నానని ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారని.. అందుకే నియోజక అభివృద్ధికి పూనుకున్నట్టు తెలిపారు. అందుకే.. తాడిపత్రిలో వ్యాపారం చేసేవాళ్లు తాడిపత్రి అభివృద్దికి 15% కమీషన్ ఇవ్వాలని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు ఎవరు ఏం చేస్తున్నారు..? ఏం బిజినెస్ చేస్తారు..? ఎక్కడ ఎంత నొక్కుతున్నారు..? అనేది అంతా తెలుసు అన్నట్టుగా మాట్లాడారు. పనిలో పనిగా తన ప్రత్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డికి, వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పెద్దారెడ్డిని.. వైసీపీ నాయకులను ఊరిలోకి అడుగుపెట్టనివ్వను అని హెచ్చరించారు.
మౌనమేల..?
ఐతే.. బహిరంగంగా జేసీ ఇలా మాట్లాడినా సీఎం చంద్రబాబు కానీ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గానీ కనీసం జిల్లా మంత్రి కూడా స్పందించకపోవడం గమనార్హం. ఒకప్పుడు ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డి కోటను బద్దలుకొడతాం అని సవాల్ చేయడంతో పాటు.. వారి అరాచకాలను అడ్డుకుంటామని హెచ్చరించారు పవన్. ఫ్యాక్షన్ నియంతృత్వాన్ని సహించం అని కూడా వార్నింగ్ ఇచ్చి.. ఇప్పుడు అదే ప్రభాకర్ రెడ్డి టాక్స్ వసూల్ చేస్తుంటే మిన్నకుండిపోవడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో.. అసలు రాదో చూడాలి మరి.