అలయ్ బలయ్.. తెలంగాణ సంస్కృతిని నలుదిశలా వ్యాపింపచేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ప్రతి ఏడాది దసరా సమయంలో నిర్వహిస్తుంటారు. తెలంగాణ వస్త్రధారణ, కళాకృతులు.. గొంగడి, ఒగ్గుడోలు కళాకారులు, గంగిరెద్దులు, చిందు గానం, తెలంగాణ వంటకాలు.. ఇలా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీల నేతలు.. ముఖ్యంగా ముఖ్యమంత్రులు, మంత్రులు విచ్చేస్తుంటారు. దత్తన్న కుమార్తె విజయలక్ష్మీ అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమానికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదిక అయ్యింది. ఐతే ఈసారి మాత్రం రాజకీయ విమర్శలు, కౌంటర్లతో అలయ్ బలయ్ జరిగింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం జరిగింది.
ఏమిటీ మాటలు..!
అలయ్ బలయ్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విమర్శించుకుందాం కానీ ప్రజలు అసహ్యించుకునేలా మాట్లాడకండని రాజకీయ నేతలకు హితవు పలికారు. నాయకుల ప్రసంగాల్లో, భాషలో మార్పు రావాలని.. ఎన్నికలప్పుడు ఘర్షణ పడొచ్చు కానీ.. ఎన్నికలయ్యాక ప్రజల శ్రేయస్సే ముఖ్యం అని కిషన్ రెడ్డి సూచించారు. పార్టీలు విమర్శించుకుంటున్న విధానాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని కాస్త ఘాటుగానే కేంద్ర మంత్రి మాట్లాడారు.
కౌంటర్..
కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు మంచివే.. పద్దతిగానే మాట్లాడారు కానీ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మాత్రం ఎందుకో రుచించలేదు. రాజకీయాల్లో భాష ముఖ్యం.. వేరేవాళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండాలన్నది నిజమన్నారు. ఇక్కడివరకూ అంతా బాగానే ఉంది కానీ తర్వాత మాట్లాడిన మాటలే ఇక్కడ వివాదానికి దారితీశాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడకుండా స్వీయ నియంత్రణ అవసరమన్నారు. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా మాట్లాడేలా దత్తాత్రేయ చొరవ చూపాలని పొన్నం ప్రభాకర్ కోరారు.
అలయ్ బలయ్ స్ఫూర్తి..
అలయ్ బలయ్ నిర్వహిస్తూ బండారు దత్తాత్రేయ తెలంగాణ కళలను భావితరాలకు అందిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ JAC ఏర్పాటుకు అలయ్ బలయ్ స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. జెండాలు, అజెండాలను పక్కనపెట్టి తెలంగాణ కోసం ఒక్కటయ్యేలా చేసిందని రేవంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణ సీఎంలు కలిసిమెలిసి ఉండాలని.. అభివృద్ధిలో ఏపీ, తెలంగాణ నెంబర్ వన్‌గా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.