అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే..! సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిన రాపాక వరప్రసాదరావు మళ్ళీ సొంత గూటికి చెరిపోతున్నారు. ఇందుకు ఇవాళ జరిగిన జనసేన సమావేశమే ప్రత్యక్ష సాక్ష్యం. 2019 ఎన్నికల్లో జనసేన తరపున గెలిచిన వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే రాపాక. ఐతే పార్టీ అధికారంలోకి రాకపోవడం, అధినేత పవన్ కళ్యాణ్ కూడా గెలవకపోవడంతో గెలిచిన ఈ ఒక్కడిని జనసేన క్యాడర్ నెత్తిన పెట్టుకొని చూసుకుంది. ఐనా సరే బుద్ధి చూపించిన రాపాక.. నాటి అధికార వైసీపీలోకి చేరిపోయారు. 2024 ఎన్నికల్లో అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కూడా.
జనసేన షాక్..!
వైసీపీ ఘోరాతి ఘోరంగా ఓడిపోవడంతో పార్టీ కార్యక్రమాలతో పాటు.. కార్యకర్తలను కూడా రాపాక పట్టించుకోలేదు. ఐతే ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. వరప్రసాద్ మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో ఆదివారం నాడు జరిగిన జనసేన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ప్రత్యక్షం అయ్యారు. ఆయన స్టేజి మీదికి రావడాన్ని చూసిన జనసేన కార్యకర్తలు, నేతలు ఒకింత షాక్ అయ్యారు. ఇదే ట్విస్ట్ అంటే.. రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్‌ను రాపాక కలవడం మరో పెద్ద ట్విస్ట్ అయ్యింది. ఈ సంఘటన ఒక్క నియోజవర్గంలోనే కాదు.. రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ కాసేపు ముచ్చటించారు కూడా.
కావాల్సింది అధికారమే!
వాస్తవానికి.. అధికారంలో ఏ పార్టీలో ఉంటే అక్కడికి వచ్చి వాలిపోవడం రాపాకకు బాగా అలవాటే.. ఇందుకు వైసీపీలో చేరడమే నిదర్శనం. ఇప్పుడు వైసీపీ ఓడిపోయి.. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో తిన్నగా సైడ్ అవుతున్నారు. ఈ కూటమిలో జనసేన కూడా ఉండటంతో మళ్ళీ సొంత గూటికి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలిసింది. ఐతే.. పార్టీలోకి మళ్ళీ రావాలంటే అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒప్పుకోరు అన్నది కోనసీమలో నడుస్తున్న చర్చ. ఒకవేళ ఇదే పరిస్థితి ఎదురైతే.. వరప్రసాద్ టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి కూడా వెనుకాడరని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. అంటే ఐతే జనసేన.. లేదంటే టీడీపీ.. పార్టీ మారడం మాత్రం పక్కా అన్న మాట. వైసీపీ అధికారంలో ఉందని చేరారే తప్ప అక్కడ రాపాకకు ఏ మాత్రం గుర్తింపు లేదన్నది అందరికీ తెలిసిన విషయమే.
రాజీనామా చేస్తున్నా..
ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో వైసీపీకి రాజీనామా చేస్తానాని స్పష్టం చేశారు. రాజీనామా విషయం ఇప్పటికే వైసీపీ పెద్దలకు కూడా చెప్పినట్లు వెల్లడించారు. ఐతే పెండింగ్ పనుల విషయంలోనే స్థానిక ఎమ్మెల్యేను కలవాల్సి వచ్చిందని చెప్పిన రాపాక నిమిషాల్లోనే మాట మార్చేయడం గమనార్హం. అంతా ఓకే కానీ ఏ పార్టీలో చేరుతారు..? మళ్ళీ సొంత గూటికేనా..? లేదా టీడీపీ తీర్థం పుచ్చుకుంటారా..? అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఐతే రాజోలు ఎమ్మెల్యేతో మాత్రం రాపాక నిత్యం టచ్ లోనే ఉన్నారని వార్తలు వస్తున్నాయి.