విజయదశమికి అద్భుతమైన పోస్టర్‌ని వదిలిన హరి హర వీరమల్లు మేకర్స్.. అతి త్వరలో మొదటి పాటను కూడా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అలాగే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన వివరాలను కూడా తాజాగా వెల్లడించారు. ప్రజాసేవలో బిజీబిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు. హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్ర బృందం చిత్రీకరించింది. పవన్ కళ్యాణ్‌తో పాటు 400 - 500 మంది ఆర్టిస్టులు పాల్గొన్న ఈ భారీ యుద్ధ సన్నివేశానికి యాక్షన్ దర్శకుడిని ప్రత్యేకంగా నియమించారు.
ఇప్పుడీ సినిమా అప్టేడ్ ఏంటంటే.. అక్టోబరు 14 నుంచి మళ్లీ చిత్రీకరణ మొదలవుతుందని, నవంబర్ 10 నాటికి మొత్తం చిత్రీకరణ పూర్తి అవుతుందని నిర్మాతలు తెలిపారు. సామ్రాజ్యవాదులు, అణచివేతదారులకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం ఒక యోధుని అలుపెరగని పోరాటమే ఈ సినిమా అని తెలిపిన మేకర్స్.. త్వరలోనే ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేయనున్నామని ప్రకటించారు.
యువ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు.