దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది..! బీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగలబోతోంది. ఒకప్పటి ప్రాణ స్నేహితులు విడిపోయి.. ఇప్పుడు మళ్ళీ ఒకటి కాబోతున్నాయి. ఆ రెండు పార్టీలే.. కాంగ్రెస్, ఎంఐఎం. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండొద్దు అన్నదే తమ టార్గెట్ అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్న మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు అగ్రనేతలకు లేఖ కూడా రాసినట్టు మీడియాకు వెల్లడించారు. మోదీని ఢీ కొట్టాలన్నా.. ఓడించాలన్నా అందరితో కలవాలని సూచించారు.
వస్తే సరే..!
మా లేఖకు కాంగ్రెస్ స్పందించి ముందుకు వస్తే సరే లేదంటే.. మా దారి మేం చూసుకుంటామని అసద్ తేల్చి చెప్పేశారు. పనిలో పనిగా.. ఎంఐఎం అనేది బీజేపీకి బీ టీమ్ అంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చేసే విమర్శలను సైతం మరోసారి కొట్టిపారేశారు. హర్యానా సార్వత్రిక ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ లేకున్నప్పటికీ కమలం పార్టీ ఎలా గెలిచింది..? అని విమర్శకులు, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. బీజేపీ అడ్డ దారిలో గెలిచిందని.. అక్కడ కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది..? అని సూటి ప్రశ్న సంధించారు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నా.. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి బీజేపీని ఏమీ చేయలేదని అసదుద్దీన్ జోస్యం చెప్పారు.
దోస్తీ అంటూనే..!
ఒకవైపు కాంగ్రెస్ పార్టీతో దోస్తానా అంటూనే రేవంత్ సర్కారుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మూసీ పేరుతో పేదలకు అన్యాయం చేయొద్దని.. తోటలు, ఫామ్‌హౌస్‌ల పేరిట బడాబాబులు ఆక్రమిస్తే వారిని వదిలేసి.. పేదల వెంట పడటం ఎంతవరకూ సబబు..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు దొరలకు కాదు.. పేదవాడికి న్యాయం జరిగేలా ఉండాలని హితవు పలికారు. మూసీ నది అనంతగిరి అడవుల్లో పుట్టి.. వివిధ ప్రాంతాల్లో ప్రవహించి నల్గొండకు వస్తుందని గుర్తు చేశారు. కానీ సీఎం మాత్రం మూసీ పరీవాహక ప్రాంతం అంటూ కేవలం తమ వెంటే పడుతున్నారని హైదరాబాద్ నగరాన్ని ఉద్దేశించి అన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల జీవితాలతో ఆడుకోవద్దని ఒకింత అసదుద్దీన్ హెచ్చరించారు.
తెలంగాణలో లేదా..?
ఐతే.. ఇప్పటివరకూ హర్యానా ఎన్నికల గురుంచి మాత్రమే అసద్ మాట్లాడారు కానీ తెలంగాణలో ఎలా ముందుకు వెళతాం అన్నది మాత్రం ఆయన బయట పడలేదు. తెలంగాణలో పొత్తు ముచ్చట ఎందుకు మాట్లాడలేదు అన్నది ప్రశ్నార్థకమే.. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీతో పొత్తులో ఉంది గనుక కాంగ్రెస్ జోలికి వెళ్తుందా..? లేదా..? అన్నది తెలియట్లేదు. పైగా ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎన్నికలు కూడా లేవు గనుక పొత్తు గురుంచి మాట్లాడక పోయి ఉండొచ్చు. వాస్తవానికి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మజ్లిస్ ఎమ్మెల్యేలు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. ఎన్నో సందర్భాల్లో రేవంత్ సర్కారుకు మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. దీంతో రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కలిసి ముందుకెళ్ళినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఐతే ఇదే జరిగితే మాత్రం కారు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ. ఏం జరుగుతుందో చూడాలి మరి.