Advertisementt

పంచాయతీ పరుగులు.. అటకెక్కిన విద్యాశాఖ!

Sun 13th Oct 2024 04:24 PM
nara lokesh,ap government  పంచాయతీ పరుగులు.. అటకెక్కిన విద్యాశాఖ!
Where is Nara Lokesh Mark in AP Government పంచాయతీ పరుగులు.. అటకెక్కిన విద్యాశాఖ!
Advertisement
Ads by CJ

బంటి నీ సబ్బు స్లో నా ఏంటి..? అని యాడ్ చూశారు కదా.. ఇప్పుడు ఇదే ప్రకటనను ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు ఆపాదించి వైసీపీ, విమర్శకులు, మేధావులు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే.. ఇప్పుడున్న మంత్రి వర్గంలో ఇంచు మించు చంద్రబాబు తర్వాత సీనియర్ మంత్రి చినబాబే.. అనుభవంలోనూ, శాఖల విషయాల్లో ఆయనే మంచి పట్టు ఉన్న మనిషి. దీనికి తోడు కీలక శాఖలు విద్య, ఐటీ యువనేత దగ్గరే ఉన్నాయ్..! అన్నీ సరే ఇప్పటివరకూ లోకేష్ సాధించినది ఏమిటి..? శాఖలకు ఎంత మాత్రం న్యాయం చేసి.. తనకంటూ ఓ గుర్తింపు, మార్క్ అన్నది ఏమైనా ఉందా అంటే.. అబ్బే అదేమీ కనుచూపు మేరలో కనిపించడం లేదే..!

పేరు గొప్ప..!!

ఒక సీఎం కుమారుడు మంత్రి పదవిలో ఉన్నారంటే.. ముఖ్యమంత్రి తర్వాత అంతా ఆయనే అనేలా పరిస్థితులు ఉంటాయ్. ఇందుకు ఇది వరకూ పనిచేసిన లోకేష్ బాబు చక్కటి ఉదాహరణే. ఇక కేటీఆర్, ఉదయనిధి స్టాలిన్ గురుంచి ఐతే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాంటిది ఈ దఫా లోకేష్ ఎందుకు ఇంత డల్ అయ్యారు..? శాఖలు, మనిషి ఎందుకు పరుగులు పెట్టడం లేదు..? పోనీ ఇప్పటి వరకూ విద్యా శాఖకు తమరు ఒరగబెట్టింది ఏంటి..? తల్లికి వందనం వేశారా..? అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు ఐనా ఎందుకు రాష్ట్రంలోని తల్లులు, విద్యార్థుల డేటాను సేకరించలేదు..? ప్రభుత్వం దగ్గర నిజంగానే తల్లులు, పిల్లలకు సంబంధించిన డేటా లేదా..? ఇదంతా తప్పించుకోవడానికి ఆడుతున్న నాటకమా..? ఐనా సచివాలయ సిబ్బంది ఉన్నప్పుడు వారిని స్కూళ్లకు పంపి తల్లులు, వారి పిల్లలకు సంబంధించిన డేటాను అడిగి తెప్పించుకోవడం పెద్ద విషయమా..? పోనీ ఒకానొక సందర్భంలో మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పినట్టు 43 లక్షల మంది తల్లులు, 84 లక్షల పిల్లలు ఇదే డేటా అన్నారు కదా.. అధికారంలో లేని ఆయన ఎలా చెప్పగలిగారు..? ఇవన్నీ ఎందుకు తెలుసుకోలేక పోతున్నారు..? సర్వే చేయాలన్నా.. ఇంకేం చేయాలన్నా లోకేష్ ఇంటింటికీ తిరుగుతూ డేటా తీసుకోరు కదా..? సచివాలయం, టీచర్లు, విద్యాశాఖకు సంబందించిన ఉన్నతాధికారులు ఇలా ఒకటా రెండా ఎన్నో మార్గాలు వాడి డేటా తెలుసుకోవచ్చు.. విద్యార్థులకు తల్లికి వందనం అందించవచ్చు.. కానీ ఎందుకు కనీసం ఈ ప్రయత్నం చేయడం లేదు..? పేరుకు మాత్రం అది చేస్తాం.. ఇది చేస్తాం అని తీరా చూస్తే ఏమీ లేదు.

ఇంత దారుణమా..?

అమ్మఒడి ఎత్తేయడం వలన ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పనులకు పంపుతున్న పరిస్థితి. ఇంకొందరు బడులకు పిల్లలు రావడమే మానేస్తున్నారు. ఐనా.. ప్రభుత్వం వచ్చి 4 నెలలు దాటినప్పటికీ.. పిల్లల ఆధార్ కార్డు లింక్ కాలేదు..? ఫోన్ నెంబర్ తప్పు ఉంది..? అని సాకులు చెప్పడం ఎంత వరకూ సమంజసం..?. రాష్ట్రం మొత్తం మీద 24 శాతం మంది విద్యార్థులు ఎందుకు స్కూళ్లకు రాకుండా ఆబ్సెంట్ అవుతున్నారు..?. గతంలో పిల్లలు వరసగా 3 రోజులు మానేస్తే ఇంటికి వలంటీర్ వెళ్ళేవారు.. అంతేకాదు స్కూల్ టీచర్ కూడా వెళ్లి విద్యార్థి సమస్య ఏమిటని తెలుకునే వారు. పోనీ.. గతంలో గోరుముద్ద అని పిల్లలకు రుచి కరమైన భోజనం పెట్టేవారు.. ఇప్పుడు లేదు.. ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్ అని విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులను రోజూ పేపర్లు, టీవీలలో చూస్తున్నాం. ఇంకోవైపు.. పాఠశాల కమిటీల పేరుతో రాజకీయ జోక్యాలు పెరుగుతున్నట్టు ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ విషయాల్లో మార్పులు, చేర్పులు గట్టిగానే రావాల్సి ఉంది.

ఐటీని ఉద్దరించారా..?

పోనీ.. విద్యాశాఖకు నిర్లక్షం చేసి ఐటీ శాఖను ఏమైనా ఉద్దరించారా..? రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ పురోగతికి చర్యలు ఏమైనా తీసుకున్నారా..? అంటే అదీ లేదు కదా. ఇప్పటి వరకూ రాష్ట్రానికి వచ్చిన ఐటీ కంపెనీలు ఎన్ని..? అంటే ఒక్కటంటే ఒకటీ కనిపించడం లేదు. అదేదో లులు ఒక్కటీ మాత్రమే కనిపిస్తోంది.. అదికూడా షాపింగ్ మాల్. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో లులూ మల్టీప్లెక్స్ నిర్మాణాలు జరిగే ఛాన్స్ ఉంది. వాస్తవానికి గతంలో లోకేష్ చేతిలో ఐటీ శాఖ ఉన్నప్పుడు యమా యాక్టీవ్, సీరియస్ అనేది ఉండేది. విదేశాలకు వెళ్ళడం ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న సౌకర్యాలు ఏంటి అనేది చర్చించి తన వంతు ప్రయత్నాలు చేశారు.. ఫలించాయి కూడా. కానీ ఈసారి ఎందుకో మునుపు ఉన్నంత ఉత్సాహం, ఉరుకులు, పరుగులు ఏ మాత్రం కనిపించడం లేదు. అక్టోబర్ 29,30 తేదీలలో అమెరికాలోని లాస్ వేగాస్ నగరంలో జరగనున్న ఐటీ సర్వ్ సినర్జీ సదస్సుకు లోకేష్ వెళ్తున్నారు. ఇక్కడ ఏ మాత్రం ఇన్వెస్టర్లును మెప్పించి ఒప్పించి ఇండియాకు ఎంత మాత్రం కంపెనీలు తీసుకొస్తారో చూడాలి. ఐతే.. మూడు నెలలు మాత్రమే పూర్తయ్యింది కదా.. ఈ మాత్రానికే ఇంత హడావుడి చేయడం అవసరమా అంటే మరి పక్కనున్న రాష్ట్రాలు ఎలా ఉన్నాయ్..? 2014 నుంచి 2019 వరకూ లోకేష్ ఎలా ఉన్నారు..? అని తెలుసుకుంటే మంచిది.

వచ్చింది ఒక్కటి.. అది కూడా!

ఈ మధ్యనే ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ విశాఖపట్నంలో సంస్థను నెలకొల్పడానికి ముందుకొచ్చింది. ఇది లోకేష్ ఆధ్వర్యంలో జరగ్గా కర్త, కర్మ, క్రియ మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. వైసీపీ హయాంలోనే విశాఖలో టీసీఎస్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. కానీ మావల్లే వచ్చింది అంటూ టీడీపీ ప్రచారం చేసుకోవడం గమనార్హం. అదేదో అంటారే కష్టం ఒకరిది ఐతే.. ఫలితం ఇంకొకరిది అంటారు కదా అదే ఇది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా.. గతంలో జగన్ రెడ్డిని టాటా సన్స్ ఛైర్మెన్ చంద్రశేఖరన్ కలిసిన ఫోటోలను సీఎంవో ట్విట్టర్ పేజీ నుంచి తీసేసారు. ఇవన్నీ కాదు ఏపీకి వచ్చింది.. గత ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి చర్చలు జరపడంతో మా ప్రభుత్వం ఇంకో అడుగు వేసి కంపెనీ తీసుకొస్తున్నట్టు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఎలా అర్థం చేసుకోవాలో ఏంటో మరి. అంటే ఏపీకి రాబోతున్న ఈ ఒక్క కంపెనీ విషయంలో లోకేష్ చేసింది ఏమీ లేదన్న మాట. మరోవైపు.. లోకేష్ ఎంతసేపూ ప్రత్యర్థులు, వైసీపీ మీద.. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా మీద దృష్టి తగ్గించి శాఖలపై ఫుల్ ఫోకస్ పెడితే ఎంతో మంచిది సుమీ.

పవన్ ఎంతో బెటర్..!

తొలిసారి ఎమ్మెల్యే, తొలిసారి మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ అతి కొద్ది రోజులకే తన శాఖలపై పట్టు సాధించి.. తన మార్క్ పాలన సాగిస్తున్నారు. ఎందుకంటే పంచాయతీ రాజ్ శాఖతో పల్లె స్వరూపం మారుస్తున్నారు. గ్రామ సభలు నిర్వహణ, రిపబ్లిక్ డేకి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం, వరదల సమయంలో బాధితులకు సహాయం కోసం 2 కోట్లు, 400 పంచాయతీలకు ఒక్కో దానికి లక్ష చొప్పున మొత్తం 4 కోట్లు కేటాయించడం.. గ్రామాల్లో రోడ్లు, వాటర్ స్కీమ్స్, వాటర్ ట్యాంకుల నిర్మాణాలు ఇలా గ్రామాల రూపు రేఖలు మార్చడానికి కంకణం కట్టుకున్నారు పవన్. మరీ ముఖ్యంగా.. ఏపీలో ఏం జరిగినా శరవేగంగా స్పందించేది కూడా పవన్ కళ్యాణ్ మాత్రమే. ఇందుకు తిరుమల లడ్డూ వ్యవహారమే చక్కటి ఉదాహరణ. పవన్ ఇంత ఓవర్ స్పీడుతో వెళ్తుంటే లోకేష్ ఇంత స్లోగా ఉన్నారేందుకు..? పంచాయతీ శాఖ పరుగులు.. అటకెక్కిన విద్యాశాఖ అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. ఇక ఐటీ అడ్రెస్స్ లేదు.. విద్యాశాఖలో మార్పు చేర్పు అనే ఉసే లేదు. పోనీ జగన్ లాగా నాడు నేడు లాంటి కార్యక్రమాలు చేసింది ఏమైనా ఉందా..? పోనీ చేయాలని ఉందా..? చేసే ప్లాన్ ఏమైనా ఉందా..? అంటే అబ్బే లేనే లేదు. పవన్ తనతో పాటు శాఖలను పరుగులు పెట్టిస్తుంటే.. సీనియారిటీ ఉన్న లోకేష్ ఏం చేస్తున్నట్టు..? అనేది చినబాబు, చంద్రబాబుకే తెలియాలి మరి.

Where is Nara Lokesh Mark in AP Government:

Criticism On AP IT And Educational Minister Nara Lokesh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ