ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఈ రోజు హైద్రాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలతో వరదలు సంభవించి ప్రజలు అనేక ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ తమ వంతుగా ప్రభుత్వానికి మద్దతుని ప్రకటిస్తూ విరాళాలను ప్రకటించింది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న ప్రతీసారి సినీ పరిశ్రమ నుంచి తన వంతు మద్దతుని చిరంజీవి అండ్ ఫ్యామిలీ తెలియజేస్తుందనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నోసార్లు మెగా ఫ్యామిలీ హీరోలు తమ గొప్ప మనసును చాటుకున్నారు.
ఇక ఇటీవల ఏపీ, తెలంగాణలలో వచ్చిన వరదల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి తెలుగు రాష్ట్రాలకు తలో కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. అందులో భాగంగా చంద్రబాబు నాయుడుని కలిసిన చిరంజీవి తను ఏపీకి ప్రకటించిన 50 లక్షల రూపాయల చెక్‌తో పాటు, తనయుడు రామ్ చరణ్ ప్రకటించిన యాభై లక్షల రూపాయల చెక్‌ను.. మొత్తం కోటి రూపాయల చెక్‌లను సీఎం చంద్రబాబుకు అందజేశారు.
మెగాస్టార్ చిరంజీవి తన ఇంటికి వస్తున్నాడని తెలిసిన సీఎం చంద్రబాబు ఆయనకు సాదర స్వాగతం పలికారు. చిరంజీవి నుండి చెక్కులు తీసుకున్న అనంతరం చిరు, రామ్ చరణ్‌లను ఆయన అభినందించారు. రాష్ట్రం ఇబ్బందులలో ఉన్న ప్రతిసారి ఇలా అండగా నిలబడుతున్నందుకు చిరంజీవికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.