జమిలి.. జమిలి.. జమిలి ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. 2029 ఎన్నికలకు ముందే.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయన్నదే ఆ జమిలికి అర్థం. అది కూడా 2026 చివరిలో లేదా 2027 ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరుగుతాయని గల్లీ నుంచి ఢిల్లీ వరకూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక్కడి వరకూ అంతా ఓకే కానీ.. ఎన్నికలు జరిగితే ఏపీలో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..? అసలు గెలిచే అవకాశాలు ఏ పార్టీకి ఎక్కువగా ఉన్నాయ్..? రాజకీయ విశ్లేషకులు, ఎన్నికల వ్యూహకర్తలు ఏమంటున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం రండి..
ఏం జరుగుతుందో..?
భారత దేశంలో జమిలి ఎన్నికలకు కసరత్తు గట్టిగానే జరుగుతోంది. దేశం మొత్తం జమిలిపై చర్చ నడుస్తుండగా ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరగాలని, అప్పుడే రాష్ట్ర అభివృద్ధి అనేది సాధ్యం అవుతుందని కూడా తేల్చి చెప్పారు. అంటే జమిలికి రెఢీ అని పరోక్షంగా బాబు చెప్పేశారు. ఇక వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే ఎన్నికల మోడ్‌లోకి వెళ్ళిపోయారు. తాడేపల్లి ప్యాలస్ వేదికగా మండలాలు, నియోజకవర్గ నేతలు, పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్య కార్యకర్తలను కలుసుకుంటున్నారు. నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటరీ అధ్యక్షులు, పలు విభాగాలకు ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శులను నియమిస్తూ.. వారికి భరోసా కలిపిస్తూ ముందుకు కదులుతున్నారు జగన్.
ఇద్దరూ రె..ఢీ..!
అటు చంద్రబాబు.. ఇటు వైఎస్ జగన్ రెడ్డి ఇద్దరూ ఎన్నికలకు సిద్ధంగానే ఉన్నారని చెప్పకనే చెప్పేశారు. ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని వైసీపీ మాత్రం ఎన్నో ఆశలు పెట్టుకుంది. కచ్చితంగా ఈసారి అధికారంలోకి వచ్చేది వైసీపీనే అన్నట్టుగా ధీమాగా ఉంది. అలాగనీ చంద్రబాబును కూడా అంత తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే.. ఆయనకున్న ప్లాన్స్, వ్యూహరచన అన్నీ పకడ్బందీగా లేనిదే జమిలికి జై కొడతారా..? విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలు, పోలవరం ప్రాజెక్టుకు కేటాయింపులు, ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటన, విపత్తుల సమయంలో ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ పరిహారం వీటితో పాటు పలు కీలక ప్రాజెక్టులు కేంద్రం కేటాయించడం జమిలి ఎన్నికలలో భాగంగానే అనే చర్చ సైతం మొదలయ్యింది. ఎలాగో తన విజనరీ.. ఈలోపు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేసేస్తారని.. ముఖ్యంగా అమరావతి నిర్మాణాలు కూడా తక్కువలో తక్కువ 40 శాతం అయినా పూర్తి చేయాలని ఇప్పటికే పనులు సైతం మొదలు పెట్టారు. ఎన్నికలకు వెళ్తే ఇదిగో ఉన్న కాస్త సమయంలో మేము చేసింది.. సమయం లేదు గనుక ఇది మాత్రమే చేయగలిగాము.. మళ్ళీ అధికారం ఇస్తే మరిన్ని అద్భుతాలు చేస్తామని చంద్రబాబు చెప్పినా చెప్పొచ్చు.
వైసీపీ పరిస్థితి ఏంటి..?
జమిలి ఎన్నికలు కచ్చితంగా వస్తాయి కాబట్టే జగన్ ఇప్పటి నుంచే క్యాడర్, నేతలను సమాయత్తం చేస్తున్నారని.. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు మీడియా, సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చే చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో జరిగిన తప్పు మళ్ళీ రిపీట్ కాకూడదని జగన్ గట్టిగానే వ్యూహరచన చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే టీడీపీ కూటమికి సూపర్ సిక్స్ అనేవి అతి పెద్ద మైనస్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇక ఎలాగో నేతలు పార్టీలు మారినా 40 శాతం ఓటు బ్యాంక్ మాత్రం అలానే బ్యాంకులో దాచినట్టిగానే ఉంది. జూన్ 04 తారీఖు ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రంలో జరిగిన అణువణువు ప్రజలకు తెలియజేయాలని డాక్యుమెంటరీ రూపంలోనే అన్నీ సర్వం సిద్ధం చేసిందట వైసీపీ. ఇక సూపర్ సిక్స్ అమలు కావడంలేదని ఇప్పటికే రాష్ట్ర ప్రజల్లో కాస్తో.. కూస్తో వ్యతిరేకత ఐతే మొదలైంది. ఇవన్నీ క్యాష్ చేసుకోవడానికి వైసీపీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూపుల్లో ఉంది. ఇక కేకే సర్వే సంస్థ నాడు టీడీపీకి ఎంత ధీమాగా ఐతే అధికారంలోకి వచ్చిందని చెప్పిందో.. ఇప్పుడు కూడా వైసీపీకి ఇంచు మించు పరిస్థితులు అలాగే ఉంటాయని కిరణ్ కొండేటి పలు ఇంటర్వ్యూలో సంకేతాలు ఇస్తున్నారు.
పెంపు కూడా..!
2026 మొదట్లోనే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు.. జమిలి ఎన్నికలు జరగాలంటే కీలక రాజ్యాంగ సవరణలతో పాటు రాష్ట్రాల సమ్మతి కూడా తప్పనిసరి. 14 రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదిస్తూ తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎన్డీఏకి ఎలాంటి ఇబ్బందులూ రావు.. ఎందుకంటే దేశంలోని 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ మిత్రపక్షాలు.. అందులో 13 రాష్ట్రాల్ని బీజేపీ సొంతంగా ఏలుతోంది గనుక ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవు. ఇక ఏపీ విషయానికొస్తే.. టీడీపీతో కలిసి బీజేపీ పయనం ఉంటుందా లేదా..? ఉంటే జనసేన సంగతేంటి..? టీడీపీని ఒంటరి చేసి.. బీజేపీ, జనసేన కలిసిపోయి పోటీ చేస్తుందా..? అనేది తేలాల్సి ఉంది. దీనికి తోడు ఇప్పుడు ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లు కావాల్సిందే అని ఇప్పటికే అటు కాంగ్రెస్, ఇటు వైసీపీ గట్టిగానే డిమాండ్ చేయడం, రేపు పొద్దున్న ఇది కాస్త ఒక ఉద్యమంలా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏం జరుగుతుందో..? ఎన్నికల్లో జగన్ ఏం చేయబోతున్నారు..? చంద్రబాబు దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి..? అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.