ప్రతినిధి 2 సినిమాలో తన సరసన నటించిన హీరోయిన్ సిరి లెల్లాను హీరో నారా రోహిత్ ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నట్లుగా కొన్ని రోజులుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై నారా రోహిత్ గానీ, సిరిగానీ ఎవరూ స్పందించలేదు. మరోవైపు వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించి రెండు ఫ్యామిలీలు భారీ ఏర్పాట్లలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
నారా రోహిత్, సిరి లెల్లాల నిశ్చితార్థం ఆదివారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో గ్రాండ్‌గా జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నిశ్చితార్థానికి నారా కుటుంబ సభ్యులందరూ హాజరుకానున్నారట. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ నిశ్చితార్థం కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కూడా తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంత వరకు ఎవరి నుండి రాలేదు.
నారా రోహిత్ మొదటి నుండి హీరోగా తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ.. హీరోగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. నారా రోహిత్ సినిమా వస్తుందంటే.. కచ్చితంగా అందులో మంచి కంటెంట్ ఉంటుందనేలా మొదటి నుండి ఆయన చేసిన సినిమాలు ఆయనకు గుర్తింపునిచ్చాయి. ఇక ఇప్పటికే 4 పదుల వయసులోకి వచ్చిన నారా రోహిత్ తన బ్యాచ్‌లర్ లైఫ్‌కి ఎండ్ కార్డ్ వేయబోతున్నారు.