కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకువస్తారట.. అదెలాగో తెలియాలంటే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నుంచి వచ్చే సిద్ధు జొన్నల గడ్డ సినిమా కోసం వేచి చూడాల్సిందే. విజయదశమిని పురస్కరించుకుని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ సినిమాను ప్రకటించింది. సిద్ధు జొన్నలగడ్డతో సితార చేస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాల తర్వాత వారి కాంబినేషన్‌లో రాబోతోన్న ఈ మూవీ కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం అనే కథాంశంతో ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ ఎత్తున నిర్మించనున్న ఈ సినిమాకు క్షణం వంటి కల్ట్ థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందించిన రవికాంత్ పేరెపు దర్శకుడు. సిద్ధూ-రవికాంత్ కలిసి సరికొత్త కథాంశంతో సోషియో-ఫాంటసీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
భద్రకాళి మాత మహిమగా నిలిచిన ఐకానిక్ కోహినూర్ వజ్రం సామ్రాజ్యవాదుల చేతికి చిక్కింది. కోహినూర్ వజ్రాన్ని తిరిగి మూలాల్లోకి తీసుకురావడానికి యువకుడు సాగించే చారిత్రాత్మక ప్రయాణంగా ఈ చిత్రం రూపొందనుందని ఈ చిత్ర ప్రకటన సందర్భంగా మేకర్స్ తెలిపారు. కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం అంత తేలికైన పని కాదు. కథాంశమే కాదు, కథాకథనాలు కూడా ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉండబోతున్నాయి. న్యాయంగా మనకు చెందాల్సిన వజ్రాన్ని తిరిగి తీసుకొచ్చి, శతాబ్దాల నిరీక్షణకు ముగింపు పలికి, చరిత్ర సృష్టించడానికి మన స్టార్ బాయ్ సిద్ధంగా ఉన్నాడని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సినిమా 2026 జనవరిలో థియేటర్లలో అడుగుపెట్టనుందని, ఈ చిత్రంతో మరో ఐకానిక్ థ్రిల్లింగ్ బ్లాక్‌బస్టర్‌ను అందిస్తామని నిర్మాతలు వాగ్దానం చేస్తున్నారు. ఈ సినిమాని అత్యంత భారీస్థాయిలో, ప్రపంచస్థాయి సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నామని, మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాతలు వెల్లడించారు.