బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. మౌన వ్రతం ఎప్పుడు పూర్తి అవుతుందో..? బాస్ బయటికి ఎప్పుడు వస్తారో..? అని రాష్ట్ర ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు వీరాభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి. తెలంగాణ పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత ఎక్కడా కనిపించట్లేదు. కనుచూపుమేరలో గులాబీ బాస్ లేకపోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఏదో తెలియని లోటు ఐతే స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ తరఫున హరీష్ రావు, కేటీఆర్ ఇంకా చాలా మంది ఉన్నప్పటికీ సారు.. సారే..! ఆయన అధికారంలో ఉన్నా.. లేకున్నా అలా కనిపిస్తూ ఉంటే చాలు కారు పార్టీలో, ప్రజల్లో అదొక కిక్కు ఉంటుంది. ఇక మీడియాకు అంటారా కావాల్సినన్ని వార్తలు ఇచ్చేస్తారు.
ఇన్ని రోజులా..?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సుమారు 10 నెలలు కావొస్తోంది. కారు షెడ్ కి వెళ్లి కూడా పది నెలలే అయ్యింది. ఈ వ్యవధిలో ఒకటా రెండా లెక్కలేనన్ని సంఘటనలు జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయి. కుమార్తె కవిత అరెస్ట్, ఏడాది తర్వాత విడుదల.. ఎమ్మెల్యేల పార్టీ మార్పు, గొడవలు, కొట్లాటలు.. హైడ్రా, మూసీ బాధితుల ఆర్తనాదాలు, కేటీఆర్ విషయంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలతో రాష్ట్ర రాజకీయాలు అట్టుడుకుతున్న పరిస్థితి. అంతే కాదు పదవీ కాంక్షతో నాన్నను కేటీఆర్ ఏదైనా చేసి ఉంటారు అని కూడా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఇన్ని మాటలు, ఇన్ని సంఘటనలు జరుగుతున్నా సరే కనీసం కేసీఆర్ ఉలకట్లేదు.. పలకట్లేదు.
ఇద్దరికేనా..?
కేసీఆర్ యాక్టివ్ గా లేకపోవడంతో ప్రస్తుతం పార్టీ వ్యవహారాలన్నీ ఒకవైపు కేటీఆర్.. మరోవైపు హరీష్ రావు చూసుకుంటున్నారు. ఎక్కడ ఏం జరిగినా.. ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటూ హడావుడి ఐతే చేస్తున్నారు కానీ.. కేసీఆర్ ఉంటే ఆ లెక్కే వేరు అన్నది నేతలు, కార్యకర్తల మాట. ఎందుకంటే.. ఎంతైనా బాస్.. బాస్ అంతే కదా. మరోవైపు.. ప్రస్తుతానికి కేటీఆర్, హరీష్ రావులే పార్టీని చూసుకుంటారని, సమయం.. సందర్భం వచ్చినప్పుడు కచ్చితంగా కేసీఆర్ బయటికి వస్తారంటూ చెబుతున్నారు గులాబీ నేతలు. ఐతే.. ఇన్ని జరిగినా రాని ఆ సందర్భం ఇంకెప్పుడు వస్తుందో అని.. ఒకింత ఆందోళన, ఎదురుచూపుల్లో ఉంది క్యాడర్.
అన్నీ తెలిసి కూడా..!
వాస్తవానికి కేసీఆర్ కాస్త సైలెంట్ ఐతే లేనిపోని పుకార్లు, గొడవలు అంతకు మించి గాసిప్స్ పుట్టుకొస్తుంటాయి. ఇప్పటికే ఎన్నెన్ని వార్తలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఐతే.. ఫామ్ హౌసులో ఉన్నా కేసీఆర్ సలహాలు, సూచనలు మేరకే ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయని అన్నది కొందరు పార్టీ నేతలు చెబుతున్న మాట. అతి త్వరలోనే కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారట. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లాలన్నిటినీ కవర్ చేసేలా ఓ వినూత్న కార్యక్రమంతో బయటికి వస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్ అంటే ఏంటో అధికార పక్షానికి చూపిస్తారట. ఎందుకంటే.. కేసీఆర్ పనైపోయిందని అనుకున్న ప్రతిసారీ మళ్లీ ఫీనిక్స్ లాగా పుట్టుకొచ్చిన సందర్భాలు కోకొల్లలు. సో.. కేసీఆర్ ఇక మౌన వ్రతం వీడే రోజులు దగ్గరలోనే ఉన్నాయ్ అన్న మాట.