హెడ్డింగ్ చూడగానే.. ఇదేంటి అనుకుంటున్నారేమో కదా.. అదేనండీ వైసీపీ, కాంగ్రెస్ పార్టీల పరాజయాలు గురించే ఈ ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వై నాట్ 175 అని బరిలోకి దిగి క్రికెట్ టీమ్ 11కు పరిమితం అయిన వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలతో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీ.. కనీసం ప్రతిపక్ష హోదా రాకపోవడంతో అసలు ఏం జరిగింది..? అనేది ఇప్పటికీ అంచనాలకు అందడం లేదు. తాజాగా.. హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి నిలుస్తుంది అనుకుంటే అబ్బే ఆ ఊసే లేకుండా పోయింది. దీంతో ఏపీలో వైసీపీ, హర్యానాలో కాంగ్రెస్ ఓటమికి ఒక్కటే కారణం అంటూ కొందరు విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి.
ఇదే కారణమా..?
రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాటలను బట్టి చూస్తే.. హర్యానాలో కాంగ్రెస్ ఓటమి కేవలం కాంగ్రెస్ తలబిరుసు పోకడ ఒక్కటే కారణం అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ డీకే సురేష్ (కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్) హర్యానా ఫలితాలపై మాట్లాడుతూ.. మితిమీరిన అతి విశ్వాసం కారణంగానే కాంగ్రెస్ ఓటమి చవిచూసిందన్నారు. అతి విశ్వాసం మంచిది కాదని చెప్పడానికి ఇదే స్పష్టమైన ఉదాహరణ అని కూడా ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేసారు. వాస్తవానికి.. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి తలబిరుసు పొగరే కారణమని, అందుకే రాష్ట్ర రాజకీయాల్లో మునుపెన్నడూ ఏ ముఖ్యమంత్రికీ జరగని అవమానం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జరిగిందని.. ఇప్పటికే విశ్లేషకులు, విమర్శకులు పెద్ద ఎత్తున విశ్లేషణలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి తోడు.. కేవలం వైఎస్ జగన్ చుట్టూ ఉన్న కోటరి, సీఎంగా ఆయన తీసుకున్న కొన్ని మూర్ఖపు నిర్ణయాలే నిర్ణయాలే ఈ పరిస్థితికి కారణం అని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు స్వయంగా మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెట్టడం మనం టీవీలు, పేపర్లు, సోషల్ మీడియాలో చూసే ఉంటాం.
ఇవి కూడా పెద్ద అనుమానాలే..!
ఎట్టి పరిస్థితుల్లోనూ హర్యానాలో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని పెద్ద ఎత్తున సర్వేలు, రాష్ట్రంలో నడుస్తున్న ట్రెండ్ చెప్పకనే చెప్పింది. సీన్ కట్ చేస్తే బీజేపీ గెలిచి నిలించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొదలుకుని అగ్ర నేతల వరకూ ఎన్నో అనుమానాలు వెలిబుచ్చారు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని కొందరు అంటే.. ఇంకొందరు కౌటింగ్ జరిగిన తీరు సరిగ్గా లేదని.. జిల్లాలకు జిల్లాలే బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం ఏంటి..? కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందన్న స్థానాల్లో బీజేపీ గెలవడం అనుమానంగా ఉందని ఇలా పెద్ద పెద్ద సందేహాలే వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. 99% బ్యాటరీతో కూడిన ఈవీఎం మెషీన్లు కాంగ్రెస్ ఓడిపోయినట్లు చూపించాయని.. 60-70% బ్యాటరీ ఉన్న మెషీన్లలో తమ పార్టీ అభ్యర్థులు గెలిచారని స్వయంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు చెప్పడం గమనార్హం. మరోవైపు.. హర్యానాలోని చాలా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు ఫిర్యాదులు చేస్తున్నా.. వాటిని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఈవీఎం మెషీన్లు వద్దు.. పేపర్ బ్యాలెట్ ముద్దు అంటూ కాంగ్రెస్ గట్టిగానే హడావుడి కూడా చేసింది.
వైసీపీ కూడా ఇలానే..!
ఈవీఎం మెషీన్లు మేనేజ్ చేయడంతో టీడీపీ కూటమి గెలిచిందని వైసీపీ నేతలు ఎన్నిసార్లు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇంకొన్ని చోట్ల హర్యానాలో మాదిరిగానే ఈవీఎం ఛార్జింగ్ అనుమానాలు, కచ్చితంగా గెలుస్తామనే స్థానాల్లో కూటమి అభ్యర్థులు జనసేన, బీజేపీ అభ్యర్థులు గెలవడంతో వైసీపీ లేనిపోని అనుమానాలు వ్యక్తం చేయడం ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించడం, రీ కౌంటింగ్ పెట్టాలని సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయాలు మనం చూశాం. అప్పుడే.. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరపాలని వైసీపీ పెద్ద ఎత్తున డిమాండ్ చేసింది కూడా. చూశారుగా.. నాడు ఏపీలో వైసీపీ ఎలాంటి సందేహాలు ఐతే బయట పెట్టిందో.. ఇప్పుడు హర్యానాలో కాంగ్రెస్ కూడా అవే అనుమానాలు వెలిబుచ్చింది.
తొలిసారి ఓపెన్ అయిన జగన్..!
ఇదిలా ఉంటే.. హర్యానా ఫలితాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా స్పందించారు. జనం అభిప్రాయాలుక వ్యతిరేకంగా ఈ ఎన్నికల ఫలితాలున్నాయని వ్యాఖ్యానించారు. హర్యానా ఫలితాలు ఏపీలో ఫలితాల మాదిరిగానే ఉన్నాయన్నారు. ఇప్పటికే ఏపీ ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయని గుర్తు చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగం పోలింగ్ కోసం సమర్ధనీయం కాదన్నారు. దేశంలో పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాల్సిన సమయం వచ్చిందని.. అంతే కాదు.. ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే, డెన్మార్క్ దేశాల్లో ఇప్పటికే బ్యాలెట్ పద్ధతే ఉపయోగిస్తున్నారని చెప్పారు. దేశంలో కూడా బ్యాలెట్ పద్ధతిని ఉపయోగిస్తే ఓటర్లలో విశ్వాసం పెరుగుతుందని, అందుకు చట్టసభ సభ్యులు ముందుకు రావాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఇటు వైసీపీ నోట వచ్చిన అనుమానాలు.. అటు కాంగ్రెస్ నోట కూడా వచ్చాయి. రేప్పొద్దున రెండు పార్టీలు కలిసి ఈవీఎం వద్దు.. పేపర్ బ్యాలెట్ కావాలని పెద్ద ఎత్తున ఆందోళన అంతకు మించి ఉద్యమం మొదలు పెట్టినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు ఏమో..!