ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నడుస్తున్న పేరు సమంత. మంత్రి కొండా సురేఖ రీసెంట్‌గా సమంత విడాకులకు సంబంధించి చేసిన కామెంట్స్ ఏ రేంజ్‌లో ఇండస్ట్రీలో హీట్ పుట్టించాయో తెలిసిందే. అదలా ఉంటే.. జిగ్రా మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో మరోసారి సమంత హాట్ టాపిక్‌గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సమంతను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. సమంతను ఉద్దేశిస్తూ ఆయన చేసిన కామెంట్స్, అందుకు సమంత చేసిన సైగలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. నెటిజన్లకు పని కల్పిస్తున్నాయి.
త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడు సినిమాలు చేసింది సమంత. వారి స్నేహంపై ఇండస్ట్రీలో ఎటువంటి గాసిప్స్ నడుస్తుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు ఛాన్స్ దొరికితే చాలు పూనమ్ కౌర్.. గురూజీని సోషల్ మీడియాలో పెట్టేస్తుంది. మరి ఇలాంటి సమయంలో త్రివిక్రమ్ ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ త్రివిక్రమ్‌లో అదేం కనిపించలేదు. ఆమెను సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పోలుస్తూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు సమంతపై ఆయన ప్రేమని తెలియజేస్తున్నాయంటూ నెటిజన్లు తెగ హడావుడి చేస్తున్నారు. అయితే తన స్పీచ్‌కి ఎవరేం అనుకుంటారో అని, తను ఏదీ ప్రిపేరై మాట్లాడను.. ఏది అనిపిస్తే అది మాట్లాడతాను అంటూ ముందుగానే తన స్పీచ్‌పై ఓ క్లారిటీ ఇచ్చేశాడు గురూజీ. ఇంతకీ గురూజీ ఏమన్నారంటే..
నేను స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కానీ, ఎవరితో అయినా సంభాషించేటప్పుడు గానీ ఏదీ ప్రిపేర్ అయి మాట్లాడను. నాకు ఏది అనిపిస్తే అది మాట్లాడతాను. ఎందుకంటే, నేను ప్రయత్నపూర్వకంగా జరిగే దేనిని నమ్మను. దానంతట అది జరగాలని కోరుకుంటాను. ఏదైనా మనం పుష్ చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అది ఎంత వరకు రైటో నాకు తెలియదు కానీ, ఏది జరిగినా సహజంగా జరగాలి. అది మనల్ని ఎంతదూరం తీసుకువెళుతుందో.. అదే తీసుకెళుతుంది. నది గురించి చెబుతారు కదా.. ఏ నదిలో ఏ క్షణం ఒకే నీరు ప్రవహించదు అంటారు. అంటే ఇప్పుడున్న నది.. నెక్ట్స్ సెకండ్‌లో లేదు. ఆ వాటర్ దూసుకుని ముందుకు వెళ్లిపోతుంటుంది. అలాగే నేను కూడా ఎట్లా ఉండాలనుకుంటాను అంటే.. ఈ క్షణం ఉన్నట్టు నెక్ట్స్ క్షణం ఉండకుండా ఉండే ప్రయత్నమే చేస్తాను. ఒక్కోసారి అందులో గెలుస్తుంటాం. ఒక్కోసారి ఓడిపోతూ ఉంటాం. బట్ అందరూ కూడా అంత సహజంగా ప్రవహిస్తూ పోవాలని అనుకుంటాను. ఈ వేడుకకు వచ్చే వరకు నాకు తెలియదు.. ఈ గంట ఇక్కడ ఇంత ఆనందంగా గడుపుతానని. అంత సహజంగా జీవితంలో అన్ని జరగాలని నేను కోరుకుంటాను. ఈ విషయంలో మీ అంచనాలను అందుకోకపోతే మనస్ఫూర్తిగా క్షమించండి.. అంటూ గురూజీ చెప్పుకొచ్చారు. అయితే ఈ మాటల వెనుక చాలా నిగూడార్థం ఉందని నెటిజన్లలో మేధావి వర్గం మాట్లాడుకుంటుండటం గమనార్హం.
ఏ మాయ చేసావే సినిమా నుండి సమంత హీరోనే. బన్నీ ఫోన్ చేసి మరీ సమంత అని కొత్తగా ఓ హీరోయిన్ వచ్చింది. ఆ సినిమా చూడండి అని ఫోన్ చేశాడు. అప్పటి నుండి సమంతకు ఆయన పెద్ద ఫ్యాన్. ఎందుకంటే, మా అమ్మలు లేకుండా మేము లేము. మీరు (సమంతను, ఆలియాను ఉద్దేశించి మాట్లాడుతూ..) లేకుండా మీ తర్వాత తరం లేదు. మీరు ఎప్పటికీ హీరోలే. మీకు ఎవరో పవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవరో ఎంపవర్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకుంటే మీరు ఆల్రెడీ పవర్‌ఫుల్. శక్తి అంటేనే స్త్రీ కదా. ఒక మగాడు సంతోషంగా ఉంటే వాడు డబ్బు వల్ల సంతోషంగా ఉంటాడు.. కానీ ఒక స్త్రీ సంతోషంగా ఉందంటే ఒక కుటుంబం వల్ల సంతోషంగా ఉంటుంది. అందుకుని ఒక స్త్రీ బాగుంటే కనుక ఒక యూనిట్ అంతా బాగుంటుంది. ఆమె ఆనందంతోనే వసుదైక కుటుంబం నెలకొంటుందని చెప్పుకొచ్చిన గురూజీ.. సమంతను మిస్ అవుతున్నట్లుగా డైరెక్ట్‌గా చెప్పేశాడు. సమంత గురించి మాట్లాడుతూ..
తెలుగు, తమిళం, మలయాళం అన్ని చోట్ల కూడా ఒకే రకమైన ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్స్ రజనీకాంత్‌గారు.. ఆ తర్వాత సమంతగారు. ఆమె లైవ్ డైనమెట్, లైవ్ వైర్. సమంతగారు మీరు అప్పుడప్పుడు ముంబైలోనే కాకుండా హైదరాబాద్‌లో జరిగే వాటికి కూడా రండి. మేం మీకోసం కథలు రాస్తాం.. మేము రాస్తే మీరు చేస్తారా. మీరు చేయరేమో అనే భయంతో మేము రాయడం లేదు. అత్తారింటికి దారేది అని చెప్పాము.. మీరంతా సమంతగారు హైదరాబాద్ రావడానికి దారి ఏదో చెప్పమని చెప్పండి ఆవిడకి. ఆమెని హైదరాబాద్ రమ్మని చెప్పడానికి తెలుగు వాళ్లంతా సోషల్ మీడియాలో ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ చేద్దాం అని పిలుపునివ్వడం వెనుక.. సమంత అంటే గురూజీకి ఇంత ప్రేముందా? బయటేం జరుగుతుందో అసలు పట్టించుకోరా? ఆ నిమిషం ఏదనిపిస్తే అది మాట్లాడతానని చెప్పిన గురూజీ.. తనలాంటి వాళ్ల నోటి నుంచి వచ్చే మాటకు పదునెక్కువ ఉంటుందని ఎప్పుడు తెలుసుకుంటారో..