వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీజేపీకి పూర్తిగా దూరమై.. కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారా..? రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమిలో వైసీపీ చేరుతోందా..? ఇందుకు ఇటీవల జరిగిన రెండు పరిణామాలే కారణమా..? అంటే అవును అక్షరాలా నిజమే అనిపిస్తోంది. ఇంతకీ ఎందుకు ఈ దూరం, దగ్గర.. అసలేంటీ ఆ రెండు పరిణామాలు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం వచ్చేయండి మరి.
ఎందుకు.. ఏమైంది..!?
కేంద్రంలో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. నిన్న మొన్నటి వరకూ ఎన్డీఏ అంటే ఎనలేని అభిమానం చూపించిన ఒకే ఒక్కడు వైఎస్ జగన్ మాత్రమే..! ఎందుకంటే జగన్ రెడ్డికి కేంద్రంతో ఎన్ని అవసరాలు ఉన్నాయో.. అంతకు మించి కేంద్రానికి ఈయనతో కూడా అంతే అవసరం ఉండేది. మరీ ముఖ్యంగా ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కమలం - ఫ్యాన్ బంధం మరింత బలపడింది. రానురాను అదికాస్త ఫెవికల్ బంధంలా మారిపోయింది. కేసుల నుంచి బయట పడేందుకు బీజేపీకి వైసీపీ అవసరం వచ్చినప్పుడల్లా రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి ఎప్పటికప్పుడు మద్దతు ఇస్తూ వచ్చేది. ఐతే.. 2024 ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒకటి రెండు సందర్భాల్లో బిల్లులకు మద్దతు ఇచ్చింది కూడా. ఐతే క్రమంగా పెద్దలసభలో వైసీపీకి బలం లేకుండా పోతోంది. దీంతో పెద్దగా బీజేపీని వైసీపీ.. వైసీపీని బీజేపీ పట్టించుకోలేదు. అంటే ఒకరితో ఒకరికి అవసరాలు లేవు.. అందుకే జగన్ దూరం.. దూరం అంటున్నారు.. అవుతున్నారు అన్నది ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
వద్దు.. కావాలి!!
జగన్ సీఎంగా ఉన్నన్ని రోజులు బీజేపీని పొల్లెత్తు మాట కూడా అనలేదు.. కనీసం అలాంటి సాహసమే చేయలేదు. ఐతే.. ఎప్పుడైతే వైసీపీ అధికారం కోల్పోయిందో నాటి నుంచి అప్పటి నుంచి పరిస్థితులు ఎందుకో ఆనుకూలించడం లేదు. ముఖ్యంగా ఈ మధ్య చెలరేగిన తిరుమల లడ్డూ విషయంలో బీజేపీకి సవాల్ చేస్తున్నా.. అంటూ గట్టిగానే వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ పరిణామంతో నాటి నుంచి బీజేపీపై తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారని గట్టిగానే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత.. తాజాగా హర్యానా ఫలితాలతో వైఎస్ జగన్ ఓపెన్ అయిన విధానాన్ని చూస్తే.. ఇక బీజేపీకి పూర్తిగా దూరమై, కాంగ్రెస్ పార్టీతో కూడా ఇండియా కూటమికి దగ్గరవుతున్నరని స్పష్టంగా అర్థం అవుతోంది.
ఈ ఒక్క మాటతో..!!
హర్యానా ఫలితాలపై వైఎస్ జగన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు పెను సంచలనమే రేపుతున్నాయి. హర్యానా ఎన్నికలు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకం అని కామెంట్స్ చేశారు జగన్. హర్యానా ఫలితాలు కూడా ఏపీలో వచ్చిన ఫలితాల మాదిరిగానే ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఏపీ ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయనే విషయాన్ని సైతం జగన్ గుర్తు చేశారు. ఈవీఎంలు పోలింగ్ కోసం వాడటం సమర్ధనీయం కాదన్నారు. దేశంలో పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాల్సిన సమయం వచ్చిందని తన మనసులోని మాటను బయట పెట్టారు. అంతే కాదు అభివృద్ధి చెందిన ఎన్నో దేశాల్లో పేపర్ బ్యాలెట్ల పద్థతినే వినియోగిస్తున్న విషయాన్ని.. దేశాల పేర్లు ప్రస్తావించి మరీ గట్టిగానే జగన్ ట్వీట్ చేశారు.
కష్టాలు తప్పవేమో..!
చూశారుగా.. ఒకసారేమో బీజేపీని ఛాలెంజ్ చేయడం.. ఇంకోసారి ఏకంగా బీజేపీ గెలుపును తప్పుబట్టడం, శంకించడం ఇవన్నీ బీజేపీకి దూరమై.. కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేలాగానే సూచిస్తున్నాయి. పైగా జగన్ మాట్లాడిన మాటలు కూడా ఇదివరకే కాంగ్రెస్ నేతలు మాట్లాడినవే కావడం గమనార్హం. దీంతో జగన్ బీజేపీతో పూర్తిగా దూరమైనట్టేననే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి చూస్తే .. ఏపీలో రానున్న ఎన్నికల్లో లేదా.. త్వరలోనే రాజకీయ సమీకరణాలు మారవచ్చని మాత్రం అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు రానున్న ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ పద్ధతి కావాల్సిందే అని పెద్ద ఎత్తున ఉద్యమం మొదలై ఉవ్వెత్తున లేచినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ జగన్.. ఇండియా కూటమికి దగ్గరైతే మాత్రం కచ్చితంగా బీజేపీ బంతాట ఆడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఏపీలో ఏం జరుగుతుందో..? జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో..? బీజేపీ రివెంజ్ ఎలా ఉంటుందో చూడాలి మరి.