బిజినెన్ టైకూన్ రతన్ టాటా నింగికెగశారు..! పెద్దాయన అకాల మరణం దేశానికి తీరనిలోటు..! భారత పరిశ్రమను కొత్త స్థాయికి తీసుకెళ్లిన వ్యాపారవేత్తనే కాదు.. దేశానికి ఎనలేని సేవలందించిన మహోన్నత మానవతావాది..! కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న కోటీశ్వరుడు..! తన సృజనాత్మకత, వినయం, దాతృత్వంతో దేశానికి చేసిన సేవలు ఎప్పటికీ స్మరణీయంగా నిలిచిపోతాయి.. వ్యాపార ప్రపంచం, సమాజానికి చేసిన అపూర్వ సేవలు తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రతన్ టాటా భారతదేశానికి దొరికిన నిజమైన, అరుదైన రత్నం. టాటా గురుంచి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునేందుకు ఈ తరం ఎంతో ఆసక్తిని చూపుతోంది.. గూగుల్ తల్లిని అడిగి ఎన్నో విషయాలను తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది యువత. మరీ ముఖ్యంగా.. ఆయన పెళ్లి ఎందుకు చేసుకోలేదు..? జీవితాంతం బ్రహ్మచారిగానే ఎందుకు ఉండిపోయారు..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
టాటా లవ్ స్టొరీ..!
కొందరు మనుషులతో ప్రయాణాలు మధ్యలో ఆగిపోయినా చేసుకున్న ప్రమాణాలు జీవితాంతం ఉంటాయ్ అన్నది టాటాను చూస్తే అర్థం అవుతుంది. ఆయన చేసిన ఒకే ఒక్క ప్రమాణం తన జీవిత ప్రయాణం మొత్తం కొనసాగించారు. రతన్ టాటా భగ్న ప్రేమికుడు.. ఇచ్చిన మాట కోసం జీవితం అంతా ఒంటరిగానే సాగించారు. 1937 డిసెంబర్ 28న ముంబైలో నావల్ టాటా- సోనీ టాటా దంపతులకు జన్మించారు రతన్ టాటా. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో చిన్నతనం మొత్తం నాయనమ్మ పెంపకంలోనే పెరిగారు. పెరిగి పెద్దయ్యాక అమెరికా లో చదువుకోమని నాయనమ్మ ప్రఖ్యాత కార్నెల్ యూనివర్సిటీకి పంపారు. అక్కడ ప్రేమలో పడడంతో పాటు ఆర్కిటెక్చర్ డిగ్రీలో పట్టా కూడా పొందారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉందాం అనుకున్నారు కానీ.. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది.
ఈ ఒక్క పరిణామంతో..!
నాయనమ్మ నవాజ్ భాయ్ అనారోగ్యం బారిన పడటంతో అమెరికా నుంచి తప్పక స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ తన ప్రేయసికి మాట ఇచ్చి వస్తారు. మా నాయనమ్మకు ఆరోగ్యం కుదుట పడ్డాకా అమెరికా వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నదే ఆ మాట సారాంశం. ఐతే.. స్వదేశానికి చేరుకోగానే 1961 భారత్ - చైనా యుద్ధం వల్ల అనుకున్న సమయానికి రతన్ టాటా తిరిగి వెళ్ళలేకపోయారు. టాటా ప్రేయసికి బహుశా సహనం తక్కువ అనుకుంటా.. అందుకే ఈ గ్యాపులో మరొకరిని పెళ్లి చేసుకుంది. ఇది విన్న రతన్ టాటా ఎంతో బాధపడ్డారు.. కుమిలిపోయారు. సరిగ్గా ఈ సమయంలోనే టాటా నాయనమ్మ కూడా కాలం చేసింది.
ఇక్కడే మొదలు..!
పెంచి పెద్ద చేసిన నానమ్మ లేకపోవడం.. ప్రేమించిన అమ్మాయి జీవితంలో లేకపోవడంతో రతన్ టాటా తనకంటూ ఏమీ లేకుండా పోయిందనీ కొద్ది రోజుల పాటు కోలుకోలేకపోయారు. ఇక అప్పటి నుంచీ (1962లో టాటా గ్రూపులో చేరారు) తన ఫోకస్ అంతా వ్యాపార సామ్రాజ్యం విస్తరించడంపైనే పెట్టారు కానీ.. ప్రేమించిన ప్రేయసిని మాత్రం మర్చిపోలేదు. దీంతో జీవితంలో పెళ్లి జోలికే పోలేదు. మళ్ళీ పెళ్ళి ఆలోచన ఎందుకు చేయలేదు..? అని ఒక సందర్భంలో స్నేహితులు అడిగితే.. నిన్ను తప్ప వేరొకరిని పెళ్లి చేసుకోనని తనకి మాట ఇచ్చాను! అని సమాధానం ఇచ్చారు. ఐతే ఆమె వేరొకరిని చేసుకుని వెళ్ళిపోయింది కదా.. ఐనా ఎందుకు పెళ్లి చేసుకోలేదని మళ్ళీ ఫ్రెండ్స్ ప్రశ్నించారు. పోయింది తను మాత్రమే కదా.. ఇచ్చిన మాట ఐతే అలానే ఉంది కదా.. నవ్వుతూ బదులిచ్చి నాటి నుంచి చనిపోయే వరకూ బ్రహ్మచారిగా ఉండిపోయారు.
గ్రేట్ లవర్!
టాటా గొప్ప ప్రేమికుడు.. ఇచ్చిన మాట మీద నిలబడే నిరాడంబరుడు. అందుకే దైవం వేరే తలచిందని.. ఆయన పెళ్లి చేసుకుని ఉంటే బహుశా అమెరికాలోనే సాదా సీదా ఉద్యోగస్తుడుగా మిగిలిపోయేవారు ఏమో. అలా జరగలేదు కాబట్టే.. లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించి.. ఆ సంపద నీ భారతీయులకు తిరిగి పంచిన మహోన్నతుడిగా లేరు సమాదించుకున్నారు. కోట్ల మందికి నాణ్యమైన వస్తువులు అందించిన గొప్ప బిజినెస్ టైకూన్. 2000 సంవత్సరంలో రతన్ టాటా సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్.. 2008లో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది. చూశారుగా.. జీవితంలో అందరికీ అన్నీ దక్కవు కానీ.. ఇచ్చిన మాట, చేసిన బాసలు జీవితకాలం ఉంటాయ్ వాటిని గుర్తించిన వారు.. జీవితంలో అత్యుత్తమ ప్రమాణాలు కలవారు ఒకే ఒక్కరూ రతన్ టాటా అనే చెప్పుకోవాలి. ఆయన జీవితం, వ్యాపారవేత్తగా ఎదిగిన తీరు ఈ తరాలకు ఎంతో స్పూర్తిదాయకం. తరాల తరబడి స్ఫూర్తి నింపిన ఓ అమూల్యమైన రతనాన్ని భారతదేశం కోల్పోయిందని సామాన్యుడి నుంచి సెలెబ్రిటీల వరకూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.