బీజేపీలో జనసేన విలీనం..? అంటూ గత 24 గంటలుగా మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడుస్తున్న చర్చ. ఈ వార్త ప్రాంతీయ మీడియాలో వచ్చి ఉంటే ఎవరూ అంతగా నమ్మే వాళ్ళు కారేమో కానీ.. జాతీయ మీడియా అందులోనే పేరున్న The News Minute లో ఈ సంచలన కథనం రావడంతో అసలు ఏం జరుగుతోంది..? ఇందులో నిజానిజాలు ఎంత..? నిజంగానే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విలీనం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారా..? అని కార్యకర్తలు, వీరాభిమానులు, నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ అసలు సంగతి..
బీజేపీలో జనసేన విలీనం..? త్వరలో ఢిల్లీలోని అగ్రనేతలతో పవన్ కళ్యాణ్ చర్చలు..? 2026లో వచ్చే జమిలి ఎన్నికలు, 2029లో వచ్చే సార్వత్రిక ఎన్నికలు అయినా ఏ పార్టీతో పొత్తు లేకుండా పవన్ కళ్యాణ్ బీజేపీ సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయన్నదే.. ఆ సంచనల కథనం సారాంశం. ఈ ఒక్క వార్తతో అసలు జనసేనలో ఏం జరుగుతోంది..? అని నేతలు ఆందోళన చెందుతున్న పరిస్థితి. తెలుగు రాష్ట్రాలతో పాటు.. జాతీయ మీడియాలో ఈ విలీనంకు సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు వస్తుండటం, నేతలు మొదలుకుని అధినేత వరకూ ఒక్కరంటే ఒక్కరూ స్పందించక పోవడంతో మౌనం అనేది అంగీకారమని ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్టవుతోంది.
ఏం జరుగుతోంది..?
పార్టీ పెట్టినప్పటి నుంచీ పెద్దగా కులాలు, మతాలు, వర్గాలు గురుంచి మాట్లాడని పవన్ కళ్యాణ్.. ఈ మధ్య నోరు తెరిస్తే చాలు హిందూ.. సనాతన ధర్మం అంటూ గట్టిగానే హడావుడి చేస్తూనే ఉన్నారు. ఇదంతా బీజేపీకి మరింత దగ్గరవడానికి చేస్తున్నారని కొందరు విశ్లేషకులు చేతుంటే.. అబ్బే డిప్యూటీతోనే బీజేపీ పెద్దలు ఆటలు ఆదిస్తున్నారని మరికొందరు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. హిందువులను ఏకం చేయడానికే.. లడ్డూ వివాదాన్ని భుజానికి ఎత్తుకొని కొన్ని రోజులపాటు మోసినట్టు సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటూ ఉన్నారు.
ఆ భేటీ తర్వాతే..!
వాస్తవానికి.. ఈ లడ్డూ వివాదానికి ముందు ఎబీవీపీకి చెందిన ఒక కీలక వ్యక్తి.. ఆర్ఎస్ఎస్ సోషల్ మీడియా వింగ్ తాలూకా ఒక పెద్ద తలకాయ ఇటీవలే ప్రత్యేకంగా డిప్యూటీ సీఎంతో మాట్లాడారని తెలుస్తోంది. ఆ తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోవడం, డిప్యూటీ సీఎం టోన్ కూడా మారిపోవడం అన్నీ చక చకా జరిగిపోతున్నాయట. కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతోనే లడ్డూ గురుంచి ఈయన ఒక్కరే మాట్లాడటం, ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేశారని.. ఆ తర్వాత సనాతన ధర్మం అంటూ జనాల్లోకి గట్టిగా వెళ్ళడానికి ఇదొక పాయింట్ పట్టుకొని సేనాని వెళ్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. అనవసరంగా తమిళనాడు రాజకీయాల్లో ఎక్కువగా వేలు పెట్టడం చేస్తున్నారని.. త్వరలోనే సౌత్ ఇండియాకు సంబంధించి బీజేపీలో పవన్ కళ్యాణ్ కు పెద్ద పదవి కూడా దక్కబోతోందని తెలియవచ్చింది.
బీజేపీ ప్లాన్ ఇదే..?
వాస్తవానికి.. ఏపీలో సొంతంగా పోటీ చేసినప్పుడు బీజేపీకి ఒక్కటంటే ఒక్క సీటూ వచ్చిన దాఖలాలు లేవు. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేయగా కాస్తో కూస్తో అసెంబ్లీ స్థానాలు దక్కాయి. ఇక 2019లో మాత్రం ఒంటరిగా బీజేపీ పోటీ చేస్తే డిపాజిట్లు గల్లంతు కావడం గమనార్హం. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయగా.. కాషాయ పార్టీకి గట్టిగానే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు దక్కాయి. అంటే ఒంటరి కాకుండా ఏదో ఒక పార్టీతో వెళ్తే మాత్రమే సీట్లు వస్తున్నాయి. ఇక ఇదే కంటిన్యూ చేయాలని.. పవన్ కళ్యాణ్ వైపు బీజేపీ చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు పవన్ వెంట కాపులు ఉన్నారు. ఈ సామాజిక వర్గమే రాష్ట్రంలో గెలుపు ఓటములను నిర్ణయిస్తుంది. అందుకే జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసుకుంటే ఏపీలో తిన్నగా ఓటు బ్యాంక్ పెంచుకోవడంతో పాటు ఇప్పటికిప్పుడు కాకపోయినా ఒకటి రెండు ఎన్నికల్లో ఏపీని ఏలొచ్చు అని కమలనాథులు భావిస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. బీజేపీ సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను ప్రకటించి 2029 ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని సమాచారం.
స్పందించరేం సారూ..!
తనపై ఎవరు ఎలాంటి ఆరోపణలు చేసినా.. పార్టీ గురుంచి ఇష్టానుసారం మాట్లాడినా తాట తీసే పవన్ అండ్ కో విలీనం అంటూ పెద్ద పెద్ద ఎత్తున రాద్దాంతం నడుస్తూ ఉంటే ఒక్కరంటే ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం. దీంతో డిప్యూటీపై ఎవరికీ టోచినట్టుగా వారు కామెంట్స్ చేయడం, ఇష్టానుసారం రాసేయడం లాంటివి చేస్తున్నారు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు.. పవన్ కాస్త టైం తీసుకుని జర ఈ విలీనం సంగతి ఏంటో..? చూసి క్లారిటీ ఇస్తే మహా మంచిది మరి. ఎందుకంటే ఇప్పటికే.. అన్న మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యంను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్టు.. ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారని గుచ్చి గుచ్చి మరీ ప్రతేక కథనాలతో మీడియాలో వార్తలు, సోషల్ మీడియాలో అంటారా అబ్బో మాటల్లో చెప్పలేం.. రాతల్లో రాయలేం అంతలా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై పవన్ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇస్తారో.. ఏంటో చూడాలి మరి.