దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మెన్ రతన్ టాటా కన్నుమూశారు. 86 ఏళ్ల రతన్ గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బిజినెస్ టైకూన్.. బ్రీచ్ క్యాండి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ పెద్దాయన పేరు ఈ తరానికి ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. ఎందుకంటే.. యువతరాలకు అత్యంత స్ఫూర్తిదాయకం. పేరుగాంచిన వ్యాపార దిగ్గజమే కాదు పరోపకారి.. ఆయనో మానవతావాది కూడా..! భరత ముని అస్తమించారన్న వార్త విని సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీల వరకూ ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. టాటా పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
రియల్ స్టార్..!
రతన్ టాటా అంటే నమ్మకం.. నిజాయితీ.. నిలువెత్తు భారతం.. మహనీయతకు మారుపేరు.. మంచితనంలో ఆయన్ను మించినోడు లేడు.. వ్యాపార సంస్థలోనే ఆయనొక శిఖరం.. భారతీయ పారిశ్రామిక ముఖచిత్రం మాత్రమే కాదు కరోనా సమయంలో పేదల పక్షాన నిలబడి కొన్ని కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చిన పద్మవిభూషణుడు. అందుకే ఆయన్ను భారతదేశ దాన కర్ణుడు అని అంటారు. అంబానీలు, ఆదానీలు బోలెడు మంది ఉన్నా.. అచ్చమైన భారత రతన్ టాటా ఒక్కడే. సాల్ట్ టు సాఫ్ట్‌వేర్ వరకూ.. గుండుసూది నుంచి విమానాలా వరకూ ఎదిగిన బ్రాండ్ ప్రపంచంలో ఏదైనా ఉందంటే వన్ అండ్ ఓన్లీ టాటా అనే చెప్పుకోవచ్చు.
ఈ తరానికి..!
ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది రతన్ టాటా నుంచి ఈ తరం నేర్చుకోవాల్సిన మొదటి విషయం. భారతీయులు అందరికీ ఆయన సాదా సీదా జీవితం ఎంతో స్పూర్తిదాయకం. విసిరే ప్రతి రాయిని పునాది చేసుకుని ఎదగాలని చెప్పిన గొప్ప వ్యక్తి.. ఆ విధంగానే ఎదిగి చూపిన మంచి మనసున్న వ్యక్తి! ఆయన.. సేవలు మరువలేనిది.. జీవనం ఆదర్శమైనది.. వ్యక్తిత్వం అనుసరణీయమైనది.. ఆయన ఎదుగుదల జీవిత పాఠాన్ని చూసి ఈ యువతరం ఎంతో నేర్చుకోవాలి. ఈ రోజుల్లో ఒక మనిషికి సహాయం చేయడమే గొప్ప, అలాంటిది ఏ స్వార్థం లేకుండా టాటా గ్రూప్స్ వాటా నుంచి 60-65% స్వచ్చంద సంస్థలకి ఇవ్వడం ఎంత మందికి సాధ్యం..?. అందుకే భారతదేశం ఒక గొప్ప మహాభావుడ్ని కోల్పోయిందని.. పెద్దాయన ఎక్కడున్నా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. టాటా దాతృత్వం, సేవ.. ఆయన అందించిన క్వాలిటి ప్రొడెక్ట్స్ ఈ దేశం ఉన్నంత వరుకూ కనబడుతూనే ఉంటుంది.. మీరు ఎప్పటికి మన దేశపు లివింగ్ లెజెండ్ సార్ అని ఆయన సేవలను ప్రజలు కొనియాడుతున్నారు.
వారసుడు ఎవరు..?
1961 లో టాటా స్టీల్ కంపెనీలో ఒక సాధారణ ఉద్యోగిగా చేరిన రతన్ టాటా.. అంచలంచెలుగా ఎదిగి కేవలం 30 ఏళ్లకే అదే కంపెనీకి చైర్మన్ అయ్యారు. 1991లో చైర్మన్ పదవి నుంచి జేఆర్డీ టాటా తప్పుకున్న తర్వాత రతన్ టాటా బాధ్యతలు చేపట్టారు.. ఈయన బాధ్యతలు తీసుకున్న తర్వాత టాటా సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ సామ్రాజ్యాల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు 156 సంవత్సరాలు చరిత్ర కలిగిన టాటా గ్రూప్ రతన్ చేతిలోకి వచ్చాక ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లోనూ దూసుకెళ్లింది. రతన్ టాటా తర్వాత ఆయన వారసుడు ఎవరు..? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతోంది. ఎందుకంటే రతన్ టాటా బ్రహ్మచారి.. దీంతో ఆయనకు వారసులు లేరు. టాటా వారసులైన లియా టాటా, మాయ టాటా, నెవిల్లే టాటా గురించే అందరూ చర్చించుకుంటున్నారు. వీరితో పాటు టాటాలతో బంధుత్వం ఉన్న షాపూర్జీ పల్లోంజీ వారసులు సైతం టాటా గ్రూపులో వాటాదారులుగా ఉన్నారు. ఆయన వారసత్వం ఎవరికి వస్తుంది..? రతన్ టాటా పేరిట ఉన్న షేర్లను ఎవరికి బదలాయించాలి..? అనేది వీలునామాను బట్టి నిర్ణయం తీసుకుంటారు. ఎవరు వారసత్వం తీసుకున్న టాటా పేరు చెరపకుండా ఉంటే మంచిది.