అవును.. నిన్న, మొన్నటి వరకూ తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవ్వగా.. ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురుంచి చర్చ, అంతకు మించి రచ్చే జరుగుతోంది. సురేఖ వ్యవహారం సద్దుమణగక ముందే.. పొంగులేటి పేరు మారు మారుమోగుతోంది. దీంతో.. ఇప్పటికే హైడ్రా, రుణమాఫీ, మూసీ విషయాల్లో ప్రభుత్వానికి కావాల్సినంత నెగిటివ్ టాక్ వచ్చేసింది. దీన్నే అదనుగా చేసుకున్న బీఆర్ఎస్, ఉద్యమకారులు, మేధావులు.. రేవంత్ సర్కారుపై దుమ్మెత్తి పోస్తున్నారు.
ఏంటి ఇది..?
పాడి రైతులు నుండి పారిశ్రామిక వేత్తలు దాకా.. స్కూల్ పిల్లల నుండి సూది వేసే వైద్యులు దాకా.. చేనేత కార్మికుల నుండి చిత్ర పరిశ్రమ దాకా.. పేద కుటుంబం నుండి పెద్ద కుటుంబాల దాకా , ఇలా అందరితో కేవలం 10 నెలలోనే ఈ రేంజిలో చెడ్డపేరు తెచ్చుకోవడం కాంగ్రెస్ పార్టీకి సాధ్యం అయ్యిందనే విమర్శలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి వెల్లువెత్తుతున్నాయి. గులాబి పార్టీ రెండు సార్లు అధికారంలోకి అంటే పదేళ్లు పాలించినా ఇంత చెడ్డ పేరు రాలేదు కానీ.. కేవలం 10 నెలలోనే హస్తం పార్టీ కావాల్సినంత నెగిటివ్ మూటగట్టుకున్నదని ప్రజలు చెబుతుండటం గమనార్హం. దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో క్లాస్ తీసుకోవాల్సి వస్తోందని వార్తలు వస్తూనే ఉన్నాయి.
పొంగులేటి కథ ఇదీ..!
ఇటీవలే పొంగులేటి ఇళ్లు, ఆఫీసులపై ఏకకాలంలో 16 చోట్ల ఈడీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. కోట్లల్లో నగదు, కీలక నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ సోదాల సమయంలో ఆయన పేరు ఎటు చూసినా వినిపించింది.. కనిపించింది. ఐతే.. ఇది ఇప్పుడు తెరమరుగు అవుతోంది అనుకుంటున్న సమయంలో.. హైదరాబాద్ మహానగరంలో పేరున్న ఐటీసీ కోహినూర్ హోటల్ లో పొంగులేటితో బిలియనీర్, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఎందుకు భేటీ అయ్యారు..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. భేటీ అయ్యి వారం పైనే అవుతున్నా ఎందుకు భేటీ..? భేటీలో ఏం జరిగింది..? అంత రహస్యంగా ఎందుకు..? ఇవన్నీ ఒక ఎత్తయితే ఇదే సమావేశంలో కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఎందుకు పాల్గొన్నట్లు..? ఉప్పు నిప్పులా ఉండే కాంగ్రెస్ - అదానీ ఒక్కటయ్యారా..? ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
భేటీ వెనుక..?
వాస్తవానికి.. సీఎం రేవంత్ రెడ్డి తర్వాత సీఎం స్థాయి వ్యక్తి పొంగులేటి. అలాంటిది.. సీఎంను కాదని పొంగులేటితో అదానీ భేటీ కావాల్సిన అవసరం ఏంటి..? అనేది ఎవరికీ అర్థం కాని విషయం. పైగా మంత్రివర్గంలో రెవిన్యూ మంత్రిగా ఉండటంతో భేటీలో ఏం జరిగి ఉంటుందా..? అని తెలుసుకోవడానికి జనాలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. హైదరాబాద్ నగరంలోని రాయదుర్గంలో ఉన్న 84 ఎకరాల విలువైన భూమి విషయం భేటీ జరిగిందని బయట పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. మరోవైపు.. ముంబై ధారావి ప్రాజెక్ట్ అదానికి ఇచ్చినట్లుగానే.. లక్షా యాభై వేల కోట్ల రూపాయల మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ సైతం అదానికి రేవంత్ సర్కార్ కట్టబెట్టనున్నట్లుగా చర్చ జరుగుతోంది.
ఖండిచలేదేం..?
ఐతే గత వారం రోజులుగా అదానీ - పొంగులేటి భేటీపై మీడియా, సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున కథనాలు, వార్తలు వస్తున్నా ఒక్కరంటే ఒక్కరూ కాంగ్రెస్ నుంచి స్పందించిన దాఖలాలు లేవు. దీనికి తోడు.. ఈ ప్రాజెక్ట్ అదానికి ఇవ్వడం వల్ల జరగబోయే డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి సునీల్ కనుగోలుతో ప్రత్యేకంగా చర్చలు కూడా జరిగాయట. ఇందుకుగాను కనుగొలుకు 500 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి టీమ్ డీల్ సెట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై ఇంతవరకూ కాంగ్రెస్ స్పందించలేదు అంటే మౌనానికి అర్థం అంగీకారమేనా..? అనే మాట కూడా వినిపిస్తోంది. అప్పట్లో అదానీ - ప్రధాని మోదీ దోస్తీ మీద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా ఏమేం మాట్లాడారో అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో అదానీ కలిసిపోతోంది అంటే దీని వెనుకు మతలబు ఏమిటో కాంగ్రెస్ మరీ ముఖ్యంగా పొంగులేటి చెప్పాల్సిందే.