జాతీయ రాజకీయాల్లో సమీకరణలు మారే అవకాశాలు ఉన్నాయా..?. ఇండియా కూటమిని మరింత బలహీనం చేయాలని ఎన్డీఏ భావిస్తోందా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇదే నిజమనిపిస్తోంది. ఎందుకంటే.. ఒకవైపు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండగా ఒక్కో రాష్ట్రం బీజేపీ బలహీన పడుతూ వస్తోంది. రానున్న రోజుల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కూడా పరిస్థితులు ఏ మాత్రం కాషాయ పార్టీకి అనుకూలంగా లేవన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. దీంతో ఇప్పుడు ఎన్డీఏలో ఉన్న మిత్రులు నారా చంద్రబాబు, నితీశ్ కుమార్ ఏ క్షణమైనా బయటికి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఇద్దరినీ మించి బలమున్న మిత్రుడైన స్టాలిన్ ఎన్డీఏలో చేరుతున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.
అయ్యే పనేనా..?
తమిళనాడు అంటే ప్రాంతీయ పార్టీలకు పెట్టింది పేరు. నాడు అమ్మ జయలలిత బతికి ఉన్నన్ని రోజులు బీజేపీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఇక అమ్మ అస్తమయం తర్వాత అధికారంలోకి వచ్చిన డీఎంకే కూడా అంతే. కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తున్న డీఎంకే.. ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న స్నేహ బంధమే. స్టాలిన్ సీఎం అయ్యాక.. పార్లమెంటు ఎన్నికలు జరగ్గా కమలం ఎక్కడా వికశించనివ్వలేదు. అలాంటిది ఇప్పుడు ఎన్డీఏలోకి స్టాలిన్ వెళ్తున్నారు అంటే అస్సలు ఎవ్వరూ నమ్మటం లేదు. గత 24 గంటలుగా ప్రాంతీయ మీడియా మొదలుకుని జాతీయ మీడియా వరకూ ఎన్డీఏలోకి కొత్త మిత్రుడు స్టాలిన్ అంటూ ప్రత్యేక కథనాలు దుమ్ము దులిపి వదులుతున్నారు.
ఎందుకు.. ఏమైంది..?
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఉన్న ఇండియా కూటమిలో ఉన్న పార్టీల్లో బలమైనది ఎన్డీఏ. ఈ బంధం ఈనాటిది కాదు.. ఎందుకంటే బీజేపీ సిద్ధాంతాలు, విధి.. విధానాలు, ఆర్ఎస్ఎస్ అంటే అస్సలు పడవు గాక పడవు. దీనికి తోడు స్టాలిన్ అస్తికుడు.. అందుకే కమలం అంటే అస్సలు పడదు. అలాంటిది ఇప్పుడు కాషాయ పార్టీలోకి వెళ్తున్నట్టు వస్తున్న వార్తలతో తమిళ ప్రజల అవాక్కవుతున్నారు. వాస్తవానికి మోదీకి రానున్న రోజుల్లో కూడా మంచి ఆప్త మిత్రుడు కావాల్సి ఉంది.. సౌత్ రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటక, తెలంగాణలో తప్ప కొన్నేళ్లుగా మిగిలిన ఆంధ్రా, తమిళనాడులో పాగా వేయలేక పోయింది. ఐతే ఇప్పుడిప్పుడే ఏపీలో కమలం వికసిస్తుండగా.. మిగిలింది ఒకే ఒక్క తమిళనాడు మాత్రమే. పైగా 39 మంది ఎంపీలు డీఎంకేకు ఉన్నారు. అందుకే డీఎంకేతో దోస్తీకి మోదీ తహ తహ లాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఐతే.. బీజేపీతో కలిసి ముందుకెళ్ళిన ఏ పార్టీ కూడా బతికి బట్ట కట్టిన దాఖలాలు లేవన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఇందుకు కారణం మహారాష్ట్ర, కర్ణాటక, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులే కారణం.
పవన్ రూటు ఎటు?
స్టాలిన్ ఓకే అంటే మాత్రం చంద్రబాబు, నితీష్ కుమార్ ఇద్దరూ బయటికి వచ్చి తీరాల్సిందే.. ఒకవేళ రాకున్నా పొమ్మనలేక పొగబెట్టే పరిస్థితులు మాత్రం కచ్చితంగా మోదీ, అమిత్ షా చేసి తీరుతారు.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే జరిగితే.. ఏపీలో కూడా ప్రభుత్వంలో నుంచి బీజేపీ బయటికి రావాల్సిందే.. రాష్ట్రంలో, కేంద్రంలో మంత్రి పదవులు హుష్ కాకి అంతే. ఇక అప్పుడే జనసేన అటు కాషాయ పార్టీ వైపు అడుగులు వేస్తుందా.. లేదా ఇటు పసుపు పార్టీ వైపు నడుస్తుందా అన్నది చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికే సనాతన ధర్మం, హిందూ పరిరక్షణ అంటూ గట్టిగా పట్టుబట్టి మరీ సభలు, సమావేశాలు పెడుతున్నారు.
తేడా కొడుతోందే..!
వాస్తవానికి.. గత కొన్ని రోజులుగా తమిళనాట గవర్నర్ అంటే సీఎంకు అస్సలు పడేది కాదు.. ఈ మధ్య స్వరం మారడం, కావాల్సిన ప్రాజెక్టులు, మెట్రో విషయాల్లో కేంద్రం సానుకూలంగా ప్రకటించడంతో కచ్చితంగా పరిస్థితుల్లో మార్పు రావొచ్చనే చర్చ మాత్రం గట్టిగానే జరుగుతోంది. దీనికి తోడు అన్నామలై కూడా డీఎంకే పార్టీపై పూర్తిగా స్వరం తగ్గించారు.. అస్సలు మాట్లాడటం లేదు. ఇందుకు ఏకైక కారణం సంధి మార్గమని టాక్. ఒకవేళ పవన్ ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఉంటే మాత్రం.. ఇప్పుడు ఉప్పు నిప్పులా ఉన్న డిప్యూటీ సీఎంలు పవన్ కళ్యాణ్ - ఉదయనిధి స్టాలిన్ కలిసి పని చేయాల్సి వస్తుందన్న మాట. ఈ మైత్రి వర్కవుట్ అవుతుందా.. అయితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు మరి.