నారా చంద్రబాబు నాయుడు.. అంటే టక్కున గుర్తుకొచ్చేది విజనరీ.. గుడ్ అడ్మినిస్ట్రేటర్..! 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఆయన చేయని అద్భుతాలు లేవు..! చంద్రబాబు అంటే ఓర్పు.. విజన్.. మిషన్.. భవిష్యత్తు.. నీతి, నిజాయితీ. బాబు అంటే రాజకీయ దురంధరుడు.. అభివృద్ధి, సంక్షేమం.. ఒక నిత్య విద్యార్థి.. తెలుగు ప్రజల కీర్తి. చంద్రబాబు అంటే ముందుచూపు.. టెక్నాలజీ.. ఆయనొక బ్రాండ్.. లీడర్, లెజెండ్..! మరీ ముఖ్యంగా.. అభివృద్ధికి అచ్చులు నేర్పి.. హైటెక్ టెక్నాలజికి హల్లులు నేర్పి, నాగరికతకు నేర్పు నేర్పి.. సమర్థతతకు ఓనమాలు నేర్పిన నాయకుడు అని ప్రజల్లో మంచి పేరు, ప్రతిష్టలు ఉన్నాయి. ఐతే ఇవన్నీ ఒకప్పుడు.. కానీ 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎందుకో బాబులో పైన చెప్పుకున్నవి ఒక్కటంటే ఒక్కటీ కనిపించలేదు.. అస్సలు ఏదీ జరగట్లేదు.
ఏదో అనుకుంటే..?
2019 ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కాలేదు కాబట్టి రాష్ట్రం అంతా అస్థవ్యస్థం అయ్యిందని తెలుగు తమ్ముళ్లు, పసుపు దళం చెప్పుకునేది. వైసీపీకి ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వడంతో 2019-2024 వరకూ ఉన్న కాస్త రాష్ట్రాన్ని వైఎస్ జగన్ ఊడ్చేశారని ఎన్నికలకు వెళ్లింది కూటమి. దీనికి తోడు చంద్రబాబు ఉంటే రాష్ట్ర రాజధాని అమరావతి, ఏపీ ప్రజల చిరకాల స్వప్నం పోలవరం ఆగేదా..? అన్నా కాంటీన్లు మూత పడేవా..? బాబు ఉంటే ఉన్న పరిశ్రమలు తరలి పోయేవా.. ఇసుక కొరత వచ్చేదా..? రియల్ ఎస్టేట్ పడిపోయేదా..? కాపు రిజర్వేషన్స్ ఆగేవా..? ఉద్యోగాలు పోయేవా..? ఇవన్నీ కాదు.. ఆయన ఉంటే రౌడీ రాజ్యం ఉండేదా..? కరెంటు కోతలు వుండేవా..? చంద్రబాబు ఉంటే రేషన్ డీలర్లు రోడ్డున పడేవారా..? విభజన ఆస్తులు వదులుకునేవారా.? ఆయనే ఉంటే ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేదా...? ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, మూడు రాజధానులు ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని మాటలు, అంతకు మించి హామీలు ఇచ్చి మరీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఐతే ప్రభుత్వం ఏర్పాటు అయ్యి నాలుగు నెలలు కాలం పూర్తి కావొచ్చింది. ఇప్పటి వరకూ చంద్రబాబు పైన చెప్పిన వాటిలో ఒక్కటైనా.. అన్నా క్యాటిన్ తప్ప మిగిలినవి ఏమైనా అయ్యాయా..? అంటే అబ్బే అదేమీ జరగలేదు. పోనీ సూపర్ సిక్స్ లో.. ఒకటి అర తప్ప ఒక్కటీ నెరవేర్చలేదు.. ఎప్పుడు అవుతాయో కూడా తెలియట్లేదు.
ఏదో అనుకుంటే..?
అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు చేస్తున్న తప్పులను కవర్ చేయలేక నానా మాటలు పడుతూ, లేస్తూ ఉంటున్నామని టీడీపీ వీరాభిమానులు, కార్యకర్తలు కొందరు బహిరంగంగానే సోషల్ మీడియాలో అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. ఇదిగో ఓ డై హార్డ్ ఫ్యాన్ ట్విట్టర్ పిట్టలో ఏం రాసుకొచ్చారో చూడండి. మీరు చేస్తున్న తప్పులను కవర్ చెయ్యలేక పోతున్నాము..! అడ్మినిస్ట్రేషన్ లో తోపు తురుము అని ఇప్పటిదాకా మీకు బిల్డప్ ఇచ్చాము .. మీరు అడ్మినిస్ట్రేషన్ లో ఫెయిల్ అవుతున్నారు. హార్డ్ ఫాక్ట్ ఏంటంటే .. జగన్ హయాంలోనే చాలా చోట్ల ఇసుక చవకగా దొరికేది అనేదని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. ఒక సంవత్సరం పాటు మీ నాయకులను ఇసుక మీద దోచెయ్యమని లైసెన్స్ ఇచ్చేసారా?. రోజూ రివ్యూలతో గడిపే మీరు .. ఇసుక రేట్లు మీద రివ్యూ చేసే టైం దొరకట్లేదా..? ఇంకా కొన్ని రోజులు ఇలాగే కొనసాగితే.. మీకు మీ అబ్బాయికి ఈ స్కాములో హ్యాండ్ వుంది అనుకోవాల్సి వస్తుంది.. ఉక్రోషం తెచ్చుకోకుండా.. వీలైతే సరి చేసుకోండి.. లేకపోతే మా ఖర్మ అనుకుని వదిలేస్తాం.. అయినా ఓట్లేసి మోసపోవడం మాకు కొత్త కాదని కొందరు కార్యకర్తలు, నేతలు నేరుగా మీడియా, సోషల్ మీడియా వేదికగా రాస్తుండటం గమనార్హం.
ఏదో తేడా కొడుతోంది..!
ఇదిగో ఇంకొందరు తెలుగు తమ్ముళ్లు ఏమంటున్నారో ఒక లుక్కేయండి. చంద్రబాబు ఇప్పటిదాకా అటు ఇటుగా 5200 రోజులు ముఖ్యమంత్రిగా పని చేశారు.. చెప్పటానికి బాధగా ఉన్నా చెప్పక తప్పట్లేదు అని కొందరు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వెలిబుచ్చుతున్నారు. బాబు సీఎంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన 5200 రోజులలో.. దరిద్రంగా 100 రోజుల పరిపాలన చూశాం. ఇలా ఎందుకు జరుగుతుందో.. చంద్రబాబు, లోకేష్ కూర్చుని ఒక రివ్యూ చేసుకోవాలి. మొత్తానికి ఎక్కడో ఏదో తేడా కొడుతోంది.. చంద్రబాబు ఇదివరకు రాజకీయంగా తప్పులు చేసేవారు.. ఈ సారి అడ్మినిస్ట్రేషన్ లో కూడా తప్పులు చేస్తున్నారు. ప్రశాంతంగా రివ్యూ చేసి తప్పు ఒప్పులు ఎక్కడ జరుగుతున్నాయి..? మార్పులు చేర్పులు చేసుకోండని కొందరు నేతలు, కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు.. ఇకనైనా బాబు మార్క్ చూపిస్తారేమో చూడాలి మరి.