వైఎస్ జగన్ రెడ్డి.. కాస్త మమ్మల్ని కూడా పట్టించుకోండి అంటూ పార్టీ కార్యకర్తలు, అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా అధినేత ప్రవర్తనలో పెద్దగా తేడా లేదని కార్యకర్తలు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. దీనికి తోడు.. జగన్ ఇంకా కొందరి ట్రాప్ నుంచి బయటికి రావట్లేదనే మాటలు క్యాడర్ నుంచి వినిపిస్తూ ఉండటం గమనార్హం. ఈ మధ్యనే నియోజకవర్గాలు, జిల్లాల వారీగా నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తుండటంతో మాజీ సీఎంలో మార్పు వచ్చిందని.. అందుకే ఇంచార్జీలను నియమిస్తుండటంతో మార్పులు, చేర్పులు మంచివే కదా అని క్యాడర్ అనుకున్నది కానీ తీరా చూస్తే మునుపటికి .. ఇప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదట.
ఇంకా మారలేదా..?
అలనాటి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి ట్రాప్ నుంచి జగన్ ఇంకా బయటికి రాలేదని కార్యకర్తలు చెబుతున్నారు. నాడు వలంటీర్స్ వ్యవస్థను పెట్టీ కార్యకర్తలకు అన్యాయం చేసి.. సోషల్ మీడియాను ఎంపీ విజయసాయి రెడ్డి నుంచి సజ్జల, ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డికి కట్టబెట్టి చేజేతులా పార్టీని సర్వ నాశనం చేశారని క్యాడర్ ట్విట్టర్ వేదికగా గగ్గోలు పెడుతున్నారు. అంతే కాదు.. వైన్ షాపుల విషయంలో కూడా తమరు తెచ్చిన విధి విధానాలు వరల్డ్ డిజాస్టర్ అని స్వయానా కార్యకర్తలే చెబుతున్నారు అంటే పరిస్థితి ఏంటి అనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఇదీ అసలు కథ..
అధినేతను కలవడానికి ఒక సామాన్య కార్యకర్త స్వయంగా వెళ్లి కలవడం అనేది అస్సలు అయ్యే పని కాదంటే కాదట. అధికారంలో ఉన్నప్పుడు అయనకు సెక్యూరిటీ ఉంటుందని ప్రోటోకాల్ బాగా ఎక్కువ ఉంటుంది కానీ.. గత వారం, పది రోజులుగా వేర్వేరు జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు తాడేపల్లి ప్యాలస్ పరిసర ప్రాంతాలలో.. లోపల ఉన్న పరిస్థితులు చూసి షాక్ అయ్యారట. జగన్ రెడ్డిని కలవడానికి అస్సలు వీలు కావడం లేదట. మధ్యలో ఎంతో మందిని దాటుకుని వెళ్లాలట. మునుపటికీ ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదని.. ఆయన్ను చూడాలని, సమస్యలు చెప్పుకోవాలని.. కలసి ఒక్క ఫోటో అయినా తీసుకుందామని కలలు కన్న వారంతా బాధతో వెనుతిరుగుతున్నారని ట్విట్టర్ వేదికగా కొందరు కార్యకర్తలు చెప్పుకుని తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.
తేల్చుకోక తప్పదా..?
మునుపటిలాగే కార్యకర్తలు.. జగన్ మధ్య మళ్ళీ సజ్జల అడ్డుగా ఉన్నారని కార్యకర్తలు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా.. క్యాడర్ కావాలా..? సజ్జల రామకృష్ణ రెడ్డి కావాలా..? వైఎస్ జగన్ తేల్చుకోవాలని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ సజ్జల ఉంటే చాలు అనుకుంటే మాత్రం క్యాడర్ ఉండదని ఇది 100కు 100 శాతం నిజమని కార్యకర్తలు, వీరాభిమానులు తీవ్ర మనస్థాపానికి గురవుతూ ట్వీట్స్ చేస్తున్నారు. వాస్తవానికి పార్టీకి 11 సీట్లు రావడం, కార్యకర్తలకు - నేతలకు.. ఎమ్మెల్యేలకు ఇలా అందరికీ జగన్ రెడ్డిని వేరు చేసినది సజ్జల అని స్వయంగా ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులే చెప్పిన సందర్భాలు కోకొల్లలు.
గుర్తు పెట్టుకోకుంటే ఎలా..?
వైఎస్ జగన్.. ఎంతో మంది ఎమ్మెల్సీలను చేసినా వాళ్ళు వెళ్లిపోతున్నారు.. ఎంపీలుగా పనిచేసిన వాళ్ళూ వెళ్లిపోయారు.. ఎమ్మెల్యేలుగా పని చేసిన వాళ్ళు వెళ్లిపోయారు.. జిల్లా నాయకులు వెళ్లి పోయారు.. నమ్మిన వాళ్ళంతా నమ్మక ద్రోహం చేసి నట్టేట ముంచి వెళ్ళిపోయారు.. ఆఖరికి తోడబుట్టిన వాళ్ళు వెళ్లిపోయారు.. మీరు ఇచ్చిన పదవి అనుభవించిన నాయకులు వెళ్లిపోయారు.. మీతోనే జీవితాంతం ఉంటాను అంటూ ఇప్పుడేమో వద్దని వెళ్లిపోతున్నారు.. కానీ నిన్ను వదిలి వెళ్ళిన నాయకుల కన్నా.. ప్రజలు, కార్యకర్తలే ఎక్కువని ఇప్పటికైనా నమ్మకపోతే ఎలా..?. ఇప్పటికీ, ఎప్పటికీ సైనికుల్లా ఉండేది ఒక్క కార్యకర్తలు మాత్రమే అనే విషయాన్ని గుర్తు తెచ్చుకుని వారికి కాస్త సమయం కేటాయించి, సమస్యలను పట్టించుకుంటే మంచిది. లేదంటే.. మళ్ళీ పరిస్థితులు మొదటికి వస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇకనైనా జగన్ రెడ్డిలో మార్పు వస్తుందో లేదంటే నేతలను కోల్పోయినట్లే కార్యకర్తలకు కూడా కోల్పోతారో చూడాలి మరి.