తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. త్వరలోనే మాజీ మంత్రి కాబోతున్నారా..? మహిళగా ఉండి.. సాటి మహిళ పట్ల నోటికొచ్చినట్టు మాట్లాడిన తీరుపై ఇటు రాష్ట్ర, అటు కేంద్ర అధిష్టానం సీరియస్ అయ్యిందా..? మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ అగ్ర నేతలు ఆదేశించారా..? అంటే ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇది అక్షరాలా నిజమే అనిపిస్తోంది. ప్రస్తుతం మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరికొన్ని గంటల్లోనే కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని తెలుస్తోంది.
వాగుడు ఏల..?
అక్కినేని ఫ్యామిలీ, సమంతపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నీచాతి నీచమైనవి. దీంతో సామాన్యుడు నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు.. ఇలా అన్ని రంగాల వారు మంత్రిని తిట్టిపోశారు. ఇంకా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో కొండా సురేఖపై అధిష్టానం తీవ్ర ఆగ్రహంతో రగిలి పోయిందట. సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని అగ్ర నేతలు ఆదేశించినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో ఇష్టం వచ్చినట్టు వాగుడు ఎందుకు..? మంత్రి పదవిని పోగొట్టుకోవడం ఎందుకు..? ఇప్పుడు బాగా అయ్యిందా అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.
డ్యామేజ్ కంట్రోల్ ఇలా!
వాస్తవానికి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొద్దిరోజుల పాటు ప్రశాంతగానే ఉన్నా హైడ్రా దెబ్బకు లెక్కకు మించి చెడ్డ పేరు వచ్చింది. ఐతే.. ఎప్పుడైతే కొండా సురేఖ రచ్చతో అది కాస్త తెరమరుగు అయ్యింది. ఐతే హైడ్రాను మించే కొండక్క దెబ్బతో పార్టీకి డ్యామేజీ అయ్యిందని హైకమాండ్ భావిస్తోంది. దీంతో ప్రస్తుతం జరిగిన డ్యామేజ్‌ను కంట్రోల్ చేయడానికి సురేఖను తప్పించడం తప్ప.. ఇంతకు మించిన ఆప్షన్ లేదని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలతో అక్కినేని, సమంత అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.
మరో బీసికి ఛాన్స్..!
ఇవాళ రాత్రి లోపు కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించినట్టు అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. సురేఖ స్థానంలో మరొక బీసీకి అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. మరో మహిళకే ఛాన్స్ ఇవ్వాలా..? లేదంటే వేరొకరికి అవకాశం ఇవ్వాలా..? అనే దానిపై సీనియర్లు సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఐతే మంత్రివర్గ విస్తరణ త్వరలోనే ఉంది కాబట్టి అప్పుడే సురేఖ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉందట. చూశారుగా.. బూతులు మాట్లాడితే అసలుకే ఎసరు వస్తుంది. అందుకే ఏం మాట్లాడినా ఆచి తూచి మాట్లాడితే మంచిది.. లేదంటే పరిస్థితి వేరేలా ఉంటుంది మరి.