సుప్రీంకోర్టు ఎవరిని తిట్టింది.. బుక్కైంది ఎవరు!?
తిరుమల లడ్డూ వివాదం కొలిక్కి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు అయ్యింది. అతి త్వరలోనే ఈ వివాదంలో నిజా నిజాలు ఎంత..? ఒక వేళ లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి ఉంటే ఇందులో సూత్రధారులు, పాత్రధారులు ఎవరు అనేది తేలిపోనుంది. శుక్రవారం నాడు సుప్రీం తీర్పుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా.. సుప్రీంకోర్టు తీర్పు, సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై జగన్ ఘాటుగానే స్పందించారు.
ఎందుకిలా బాబు..?
సీఎం చంద్రబాబు నిజస్వరూపం సుప్రీంకోర్టుకు కూడా తెలిసింది. అందుకే.. చంద్రబాబు వేసిన సిట్‌ను కూడా కోర్టు రద్దు చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని కోర్టు చెప్పింది. రాజకీయ డ్రామాలు చేయొద్దని హెచ్చరించింది. లడ్డూలో జంతువుల కొవ్వు వాడారని అబద్ధాలు చెప్పారు. తిరుమలను చంద్రబాబు అపవిత్రం చేశారు. సుప్రీంకోర్టు చంద్రబాబుకు మొట్టికాయలు వేసింది. చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేదు. చంద్రబాబులో కనీసం పశ్చాత్తాపం కనిపించడంలేదు. అబద్ధాలు చెబుతూ చంద్రబాబు దిగజారిపోతున్నారు. చంద్రబాబు, టీటీడీ ఈవో ప్రకటనలకు వ్యత్యాసం ఉంది. టీటీడీలో గొప్ప వ్యవస్థ ఉంది. NABL సర్టిఫికెట్ లేకుంటే ట్యాంకర్లను అనుమతించరనే విషయాన్ని మరోసారి వైఎస్ జగన్ గుర్తు చేశారు.
క్షమాపణ చెప్పాల్సిందే..!
సుప్రీంకోర్టు ఎవరిని తిట్టింది..? అడ్డంగా బుక్కైంది ఎవరు..? సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించినా చంద్రబాబుకు పట్టడంలేదు. శ్రీవారి భక్తులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి.. తప్పు చేశానని తిరుమలలో స్వామివారిని వేడుకోవాలి అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. లడ్డూ వివాదంలో చంద్రబాబు తన తప్పుడు ప్రచారాన్ని సమర్థించుకునేందుకు సిట్‌ను ఏర్పాటు చేశారు కానీ.. ఆ సిట్‌ను రద్దు చేయడం ద్వారా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని జగన్ ఎద్దేవా చేశారు.
వెంకన్నే చూస్కుంటారు..!
సిట్ అవసరం లేదు.. బిట్ అవసరం లేదు.. అసలు ఏం జరగనిదానికి విచారణ ఎందుకు..? జరగనిదాన్ని జరిగిందని పదేపదే ప్రచారం చేసుకుంటున్నారు. వేంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఏ అధికారులు వచ్చి ఏం చేస్తారు..? తప్పుడు రిపోర్ట్ ఇచ్చినా.. తప్పుడు ప్రచారం చేసినా స్వామివారే చూసుకుంటారని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు మంచి వ్యక్తి అయితే ఆధారాలను చూసి సిగ్గుపడాలి. అబద్దాలు చెప్పడంలో వీళ్లు దిగజారిపోతున్నారు. చెప్పిన అబద్దాన్నే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు చేసిన పాపానికి దేవుడి కోపం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడవద్దని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నానని జగన్ వ్యాఖ్యానించారు.
ఇదేనా సనాతన ధర్మం..?
ఈ మధ్య పవన్ మాట.. జగన్ నోట రాలేదు కానీ ఈసారి మాత్రం గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. లడ్డూ విషయంలో జరిగింది అబద్ధమని తెలిసినా పవన్ కల్యాణ్ దానికి రెక్కలు కట్టారని వైఎస్ జగన్ ఆరోపించారు. అబద్ధాలతో తిరుమల విశిష్టతను దెబ్బతీయడమే సనాతన ధర్మమా..? అని డిప్యూటీ సీఎంను సూటిగా ప్రశ్నించారు. తప్పును గుడ్డిగా సమర్థిస్తూ సనాతన ధర్మమని చెప్పుకోవడం ధర్మమా. తిరుమల శ్రీవారి విశిష్టతను దెబ్బతియడంలో పవన్ కూడా భాగమయ్యారు. అసలు సనాతన ధర్మం అంటే పవన్ కు ఏం తెలుసు..? అని జగన్ గట్టిగానే మాట్లాడారు.
తిరుమలకు సీఎం..!
ఇదిలా ఉంటే.. సీఎం చంద్రబాబు తిరుమలకు బయల్దేరి వెళ్లారు. బ్రహ్మో్త్సవాల సందర్భంగా స్వామివారికి.. చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. కార్యక్రమం అనంతరం సుప్రీం తీర్పుపై, వైఎస్ జగన్ వ్యాఖ్యలపై మీడియా మీట్ నిర్వహించే ఛాన్స్ ఉంది.