Advertisementt

ఇదేం టాలీవుడ్.. నాడు - నేడు ఎంత తేడా!?

Fri 04th Oct 2024 03:25 PM
jagan  ఇదేం టాలీవుడ్.. నాడు - నేడు ఎంత తేడా!?
This is Tollywood.. What is the difference today? ఇదేం టాలీవుడ్.. నాడు - నేడు ఎంత తేడా!?
Advertisement
Ads by CJ

బాబోయ్.. జగన్ - రేవంత్ మధ్య తేడా తెల్సిందా..?

అవును.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్య తేడా అందరికీ తెలిసొచ్చిందా..? అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. అక్కినేని ఫ్యామిలీ, సమంతల గురుంచి కొండా సురేఖ మాట్లాడిన దిక్కు మాలిన మాటలే ఇందుకు కారణం. ఒకప్పుడు ఆంధ్రాలో పరిస్థితి ఎలా ఉండేది..? ఇప్పుడు తెలంగాణాలో ఎలా ఉంది..? పరిస్థితులు, వ్యక్తులను బట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ స్పందన మారుతూ ఉంటుందా..? నాడు ఒక్కరంటే ఒక్కరూ నోరు తెరవని పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరూ పెదవి విప్పడం మంచి పరిణామమే కానీ.. ఇప్పుడిది ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకీ నాడు ఏపీలో ఏం జరిగింది..? నేడు తెలంగాణలో ఏం జరుగుతోంది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు మరెన్నో ప్రశ్నలకు సమాధానాలు చూసేద్దాం వచ్చేయండి మరి.

నాడు ఇలా..!

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పని చేసిన 2019-2024 వరకూ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవి అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సినీ పరిశ్రమ విషయంలో ఎలా ప్రవర్తించారు..? టికెట్స్ ధరలు మొదలుకుని సినీ పెద్దల భూములు, ఆస్తుల పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు..? ఇండస్ట్రీ పెద్దలను ఎలా చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు..? ఇవన్నీ సభ్య సమాజానికి.. ముఖ్యంగా సినీ పెద్దలకు బాగా తెలుసు. నాడు ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే అహా.. ఓహో అనాల్సిన పరిస్థితి. మారు మాట మాట్లాడిన మనిషే లేడు.. ఆ సాహసం ఒక్కరూ చేయలేదు ఎందుకో. ఇవన్నీ ఒక ఎత్తయితే సినిమా వాళ్ళతో జగన్ దండాలు, నమస్కారాలు పెట్టించుకున్న తీరుతో విసిగిపోయింది ఇండస్ట్రీ. ఇవన్నీ కాదు ఒక్క మాటలో చెప్పాలంటే నంది అంటే నంది.... అనే మాట ఉంది కదా అలానే నడిచింది ఐదేళ్లు..! ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షరాలా నిజమే.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని అటు ఇండస్ట్రీలో కానీ.. ఇటు రాజకీయ విశ్లేషకులను కానీ అడిగితే కచ్చితంగా చెబుతారు.

నేడు ఇలా..!

ఇక కాస్త జగన్ రెడ్డిని పక్కనెట్టి.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వద్దాం. ఆయన సీఎం అయ్యాక పెద్దలంతా వెళ్లి కలిసి శుభాకాంక్షలు చెప్పి అభినందించారు. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతి పథంలో నడవాలని కాంక్షించారు కూడా. నిన్న గాక మొన్న అటు విజయవాడలో.. ఇటు ఖమ్మం జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు చిగురుటాకులా వణికిపోతున్న ప్రజలకు మీకు మేమున్నాం అంటూ కోట్లల్లో వరద బాధితులకు సహాయం కూడా ఇండస్ట్రీ నుంచి వెళ్లింది. ఎవరికి తోచినంత వాళ్ళు ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ.. బుద్ధిలేని మహిళా మంత్రి, గాంధీ జయంతి రోజున ఆమెలో గాడ్సే దూరాడో ఏమో కానీ నోటి వెంట సమంత, అక్కినేని ఫ్యామిలీ గురుంచి పాడు మాటలు వచ్చేశాయ్. ఈ మాటలు ముమ్మాటికీ తప్పే.. సభ్య సమాజం తల దించుకునే మాటలే ఇవి. సామాన్యుడి నుంచి సెలెబ్రిటీల వరకూ ముఖ్యంగా టాలీవుడ్ గట్టిగానే స్పందించి, ఖండించి.. బుద్ధి చెప్పారు కూడా. నాగార్జున సతీమణి అమలతో పలువురు నటీ నటులు వార్నింగ్ ఇచ్చి పడేసారు. సినీ ఇండస్ట్రీ స్పందించిన తీరు భేష్.. ఎంతలా అంటే దెబ్బకు సదరు అదే నోటితో సమంతకు క్షమాపణ చెప్పేంత..!

ఎంత తేడానో..!

చూశారుగా.. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ ప్రవర్తించిన తీరు, ఇప్పుడు రేవంత్ రెడ్డి మఖ్యమంత్రిగా ఉండగా టాలీవుడ్ నడుచుకుంటున్న రీతిలో స్పష్టమైన తేడా. ఎందుకంటే.. జగన్ టికెట్స్ ధరలు తగ్గించినా, స్పెషల్ షోల విషయంలో చిత్ర విచిత్రంగా ప్రవర్తించినా సినీ నటులు కానీ సినీ విశ్లేషకులు కానీ ఒక్కరంటే ఒక్కరూ రియాక్ట్ అయ్యుంటే ఒట్టు. ఎందుకంటే జగన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తే రిపొద్దున్న ఇంకెలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న భయం కచ్చితంగా కనిపించింది. దీనికి తోడు అప్పటికే ఒకరిద్దరి సినీ పెద్దల భూములను జగన్ అండ్ కో టచ్ చేయడంతో ఇండస్ట్రీ ఏమీ చేయలేక ముక్కున వేలేసుకున్నది. ఐతే.. ఇప్పుడు కొండా సురేఖ విషయంలో మాత్రం దుమ్ము దులిపి వదులారుగా.. అప్పుడు ఇదే నోరు ఏమైంది..? ఇప్పుడు ఉన్న యూనిటీ అప్పుడు లేదు ఎందుకనీ..? అప్పుడు ఎందుకు ఖండ ఖండాలుగా ఖండించలేక చేతులు కట్టుకుని కూర్చోవాల్సి  వచ్చింది..? అనేది ఇప్పుడు అందరి నోళ్ళల్లో మెదులుతున్న ప్రశ్న. ఎక్కడైనా ఎవరున్నా ఎవరైనా సరే ఐకమత్యం అనేది ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు.. న్యాయం మనవైపు ఉంటే గెలుస్తాం అంతే కదా..!

ఓహో ఇందుకేనా..?

వైఎస్ జగన్ సొంత, ప్రాంతీయ పార్టీ వైసీపీ ద్వారా గెలిచిన వ్యక్తి.. పైగా ఇండిపెండెంట్ గా గెలిచిన పార్టీ గనుక నాడు ప్రభుత్వాన్ని సినీ పెద్దలు ఎదురించలేక మిన్నకుండిపోయారనే విషయం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన్ను కదపడం ఎందుకులే అని సైలెంట్ అయ్యారేమో. ఐతే తెలంగాణలో అధికారంలో ఉండేది జాతీయ పార్టీ కాంగ్రెస్ గనుక.. ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని ఏమన్నా అదీ పార్టీ మొత్తానికి వర్తిస్తుంది.. పైగా ఇక్కడ ఏం జరిగినా నిమిషాల్లో హైకమాండ్ చెవిన పడుతుంది. అదీ లేదంటే ఒక్క ట్వీట్ చేసినా చాలు దెబ్బకు సెట్ రైట్ అయ్యే పరిస్థితి ఉంది. అందుకే.. నాడు జగన్ విషయంలో, నేడు రేవంత్ విషయాల్లో టాలీవుడ్ భిన్న రీతిలో స్పందించింది అనే మాటలు ఎటుచూసినా వినిపిస్తున్నాయి.. సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ మించి అక్కడ జగన్ బలవంతుడు, సొంత పార్టీని గెలిపించుకుని సీఎం అయిన వ్యక్తి.. ఐతే రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీ పెద్దలు అపాయింట్ చేసిన సీఎం కావడంతో స్పందించే తీరులో మార్పు ఉంటుందని దీన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు నాడు హక్కులు, విలువలు గుర్తుకు రాలేదు కానీ.. ఇప్పుడు మాత్రం గట్టిగానే నోరు లేస్తోంది అంటే బలవంతులు, బలహీనుల విషయాల్లో తేడా అలానే ఉంటుందేమో..!. అంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమీ చేయలేరనే ధైర్యం అయ్యి ఉండొచ్చు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద నాటి ఏపీ సీఎం, నేటి ఎమ్మెల్యే జగన్ అంటే ఎంత క్రూరుడో అనేది అక్కడే అర్ధం అవుతుందనే విమర్శలు నేడు వెల్లువెత్తుతున్నాయి.

అప్పుడు ఏమైందీ ఇండస్ట్రీ..?

తప్పుడు కూతలు ఎవరు కూసినా.. ఎవరి గురుంచి మాట్లాడినా తప్పు తప్పే. సినీ ఇండస్ట్రీనా.. రాజకీయమా, ఇంకా ఇతర రంగమా అనేది పక్కనపెడితే తప్పుగా మాట్లాడితే.. ఎంతటి వాళ్ళకైనా ఇదిగో ఇప్పుడు ఇచ్చినట్టే గట్టిగా ఇచ్చి పడేయాలి అంతే. ఐతే.. ఇదే ఇండస్ట్రీ నుంచి కొన్ని కొన్ని సందర్భాల్లో కనీస స్పందన కూడా రాకపోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే.. ఎక్కడైనా ఆడవారే.. రాజకీయం, సినిమా సంబంధం లేకుండా ఎక్కడైనా విలువలు పాటించాల్సిందే. నాడు పవన్ కళ్యాణ్ గురించి, ఆయన కుటుంబంపై, చిన్న పిల్లలను కూడా వదలకుండా ఎన్నో తప్పుడు మాటలు, ఇంత కంటే హీనంగా వైసీపీ కార్యకర్తలు మొదలుకుని ఎమ్మెల్యేలు, మంత్రులు దారుణంగా మాట్లాడిన రోజులు అందరికీ గుర్తుండే ఉంటాయి కదా. మరీ ముఖ్యంగా.. సినీ ఇండస్ట్రీకి చెందిన పోసాని, రోజా, ఇంకొందరు నటీ నటుల నోటి నుంచి పచ్చి బూతులు వచ్చినప్పుడు, సోషల్ మీడియా వేదికగా నోటికొచ్చినట్టు రాయలేని మాటలు మాట్లాడినప్పుడు ఇదే ఇండస్ట్రీకి ఏమైందీ..? ఈ పెద్దలు అందరూ అప్పుడు ఏమయ్యారు..? అనేది ప్రశ్నార్థకమే. మరి ఆనాడు జగన్ రెడ్డి అంటే భయం వేసిందా.. !?

నోరు లేదా..? 

దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరిని నిండు సభలో అవమానకరంగా మాట్లాడితే మనకెందుకులే అని ఇండస్ట్రీ ఎందుకు వదిలేసింది..? పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ.. మెగా ఫ్యామిలీని తిట్టిన తిట్టు తిట్టకుండా వైసీపీ వాళ్ళు ప్రవర్తించినప్పుడు..? ఇదే ఇండస్ట్రీ అప్పుడు హైదరాబాద్ మహానగరంలో లేదా..? పోనీ సూపర్ స్టార్ రజనీకాంత్.. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో మాట్లాడిన మాటలకు వైసీపీ మంత్రులు నోటికొచ్చినట్టుగా, వ్యక్తిగతంగా, ఆరోగ్య సమస్యలు ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని మాటలు అన్నప్పుడు సినీ పరిశ్రమ ఏమైనట్టు..? ఈ మధ్య సినీ, రాజకీయ రంగానికి చెందిన రోజా గురించి.. కమెడియన్, టీడీపీ కార్యకర్తగా చెప్పుకునే ఆర్పీ మాట్లాడిన మాటలు అందరికీ తెలిసే ఉంటాయ్. రోజను పంది అని సంబోధిస్తూ పంది కొవ్వు తిరుమల లడ్డూలో వాడారు అంటూ ఇష్టానుసారం మాట్లాడినప్పుడు ఇదే సినీ, రాజకీయ సమాజం ఎటు వెళ్ళిందో.. ఏంటో..? ఇది తప్పు అని కనీసం ఒక్కరంటే ఒక్కరూ ట్వీట్ చేసిన పాపాన పోలేదేం..? ప్రతీ సారి మనల్ని కాదు.. మనం బాగానే ఉన్నాం కదా అనే ఆలోచన ధోరణి వీడితే మంచిది. అందుకే వ్యక్తి, అగ్ర నటులు, పెద్ద కుటుంబం, వేరే రంగం కదా అనే తారతమ్యాలు లేకుండా తప్పు జరిగితే తప్పు అని నిలదీయండి. అంతేకానీ పక్షపాతం చూపడం ఇప్పటికైనా మానుకుంటే అదే పదివేలు.

 

 

This is Tollywood.. What is the difference today?:

Do you know the difference between Jagan and Revanth?

Tags:   JAGAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ