లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఐదుగురు సభ్యులతో స్వతంత్ర దర్యాప్తునకు న్యాయస్థానం ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కొత్త సిట్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొత్త సిట్‌లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు,
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు పోలీస్ అధికారులు, సీనియర్ ఫుడ్ సేఫ్టీ అధికారితో కూడిన స్వతంత్ర దర్యాప్తు ఏర్పాటు చేయాలని సుప్రీం ఆదేశించింది.
విచారణ ఇలా..!
ఈ స్వతంత్ర దర్యాప్తు అంతా సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షణలో విచారణ జరగనుంది. విచారణ పూర్తయిన తర్వాత రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేకుండా.. కేంద్రానికి మాత్రమే కొత్త సిట్ బృందం నివేదిక ఇవ్వనున్నది. ఈ అంశంపై రాజకీయ డ్రామాలు వద్దని సుప్రీం కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే రాజకీయ జోక్యం ఉండదని సుప్రీంకోర్టు భావించి.. ఇలా కొత్త సిట్ ఏర్పాటు చేయాలని జస్టిస్ గవాయి ఆదేశించారు. అంతేకాదు రాజకీయంగా లడ్డూ విషయంపై వ్యాఖ్యలు చేయొద్దని కూడా సుప్రీం ఆదేశించడం జరిగింది.
సత్యమేవ జయతే..
సుప్రీం తీర్పుపై ఏపీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని వెల్లడించారు. సీబీఐ, ఏపీ పోలీస్, ఫుడ్ సేఫ్టీ సభ్యులతో సిట్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. చివరిగా.. సత్యమేవ జయతే, ఓం నమో వేంకటేశాయ చంద్రబాబు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మరోవైపు.. సుప్రీం తీర్పుపై వైసీపీ యమా జోష్ మీద ఉంది. లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ పెద్దఎత్తున వినిపిస్తోంది. టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరూ సుప్రీం తీర్పును స్వాగతించారు.
ఎదురుదెబ్బ..
లడ్డూ వ్యవహారాన్ని సిట్‌తో చుట్టేయాలని చూసిన చంద్రబాబుకు సుప్రీంకోర్టు దిమ్మతిరిగే షాకిచ్చిందని వైసీపీ సెటైర్లు వేస్తోంది. తనకు అనుకూలమైన వారితో సిట్‌ను చంద్రబాబు నియమించగా దాన్ని రద్దు చేయడంతో కోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. మరోవైపు.. లడ్డు కల్తీలో జంతువుల కొవ్వు కలపడం అనేది అవాస్తవమని.. తప్పు తెలుసుకుని ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ వస్తుండటంతో ఇప్పుడీ విషయంలో సీఎం ఏం చేయబోతున్నారు..? కొత్త సిట్ విచారణలో ఏం తేలుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.