అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై మరోసారి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. వెంకన్న సన్నిధిలో జరిగిన అపచారానికి గాను ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన పవన్.. తిరుమలలో పూర్తి చేశారు. అనంతరం తిరుపతిలో వారాహి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా.. లడ్డూ వివాదం, వైసీపీ నేతల కామెంట్స్, హిందూ ధర్మం గురుంచి విమర్శలు గుప్పించే వారికి గట్టిగానే చురకలు అంటించారు. కలియుగ దైవానికి అపచారం జరిగితే ఊరుకుంటామా..? అంటూ సేనాని కన్నెర్రజేశారు.
బుద్ధి రాలేదా..!
సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదని మరోసారి సభా వేదికగా పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 11 సీట్లకు భగవంతుడు కుదించినా బుద్ధిరాలేదని వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం పరోక్ష వ్యాఖలు చేశారు. హిందువుగా సనాతన ధర్మాన్ని ఆరాధిస్తానని..
ఇస్లాం, క్రిస్టియన్, సిక్కు, ఇతర మతాలను గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం అనే విషయాన్ని పవన్ మళ్ళీ గుర్తు చేశారు. ప్రసాదంలో అపచారం జరిగిందని.. ప్రాయశ్చిత దీక్ష చేపడితే దాన్ని అపహాస్యం చేసారు. నా సనాతన ధర్మాన్ని నేను పాటించడం కూడా వారికి పాపంలా కనిపిస్తోంది. సనాతన ధర్మంపై దాడి జరిగితే చూస్తూ ఊరుకోను. దానికోసం నా పదవి, నా జీవితం, రాజకీయ జీవితం పోయినా బాధపడను. నేను ఎప్పుడూ ధర్మం తప్పలేదని సేనాని తేల్చి చెప్పారు.
ఇచ్చి.. పుచ్చుకోండి!
కొందరు సూడో మేధావులు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. సనాతన ధర్మాన్ని కొందరు అంతం చేస్తామంటున్నారు. జంతు కొవ్వుతో చేసిన నైవేద్యం శ్రీవారికి పెడతారు. అవే లడ్డూలు అయోధ్య రామాలయానికి పంపుతారు. రాముడి విగ్రహావిష్కరణపై రాహుల్ విమర్శలు చేస్తారు. సనాతన ధర్మానికి రంగు, వివక్ష లేదు. సనాతన ధర్మం పాటించే వారంతా ఏకం కావాలి. సెక్యులరిజం వన్‌వే కాదు.. టూవే. గౌరవం ఇవ్వండి.. తీసుకోండని పవన్ పిలుపునిచ్చారు.
మాట్లాడొద్దా..?
కూటమి గెలిచిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి ఎలా అన్నదానిపైనే ఫోకస్ పెట్టాం. పగ, ప్రతీకార రాజకీయాలుండవని గెలవగానే చెప్పాం. దశాబ్దానికి పైగా నన్ను వ్యక్తిగతంగా తిట్టారు.. అంతకు మించి అవమానించారు. నన్ను ఎంతో పరాభవించారు.. అయినా ఎవర్నీ ఏమీ అనలేదు. వెంకన్నకు అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటాం..? అన్నీ రాజకీయాలేనా.. అన్నీ ఓట్ల కోసమే చేస్తామా..?. నా జీవితంలో ఇలాంటి రోజు రాకూడదని కోరుకున్నా. వైసీపీ నేతలే ఈ పరిస్థితిని తీసుకొచ్చారు. నాకు అన్యాయం జరిగిందని నేను బయటకు రాలేదు. కల్తీ ప్రసాదాలు పెట్టారు.. వెంకన్నకు అపచారం చేశారు. ఉపముఖ్యమంత్రిగానో, జనసేన అధ్యక్షుడిగానో నేను ఇక్కడకు రాలేదు. సనాతన ధర్మ విరోధులతో గొడవ పెట్టుకోవడానికి వచ్చానన్నారు.
మేం ఎక్కడా చెప్పలేదు!
ఇక ఇదే సభా వేదికగా వైఎస్ జగన్ రెడ్డికి కూడా పవన్ గట్టిగా ఇచ్చి పడేసారు. గత సీఎం తిరుపతి లడ్డూలు చుట్టారని, అపవిత్రం చేశారని మేం ఎక్కడా చెప్పలేదు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే ఆయన భుజాలు తడుముకుంటున్నారు ఎందుకో అని విమర్శలు గుప్పించారు. పైగా మేమే రాజకీయం చేస్తున్నామంటున్నారని.. జగన్ హయాంలో ఉన్న టీటీడీ బోర్డు వైఖరిపైనే ఆరోపణలు అని.. తిరుమల ప్రసాదంలో నిబంధనల ఉల్లంఘనపైనే మా ఆవేదన అని పవన్ చెప్పుకొచ్చారు. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి.
కోర్టులపై సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే.. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో పవన్ కోర్టులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని దూషించే వారికే అనుకూలంగా కోర్టులు వ్యవహరిస్తున్నాయి. చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మం పాటించే వారిపై నిర్దాక్షిణ్యంగా, అన్య ధర్మాలను పాటించే వారిపై మానవత్వం, దయ చూపిస్తాయి. అయిన వాళ్లకి ఆకులు.. కాని వాళ్లకు కంచాలు అన్న దుస్థితి దాపురించింది. ఇప్పుడు ఆకులు కూడా లేవు, చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు.