తెలంగాణలో ఇప్పుడు ఏం నడుస్తోంది రా అంటే.. మూసీ, మూవీ ఇవి రెండే నడుస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ హైడ్రా విషయంలో రేవంత్ ప్రభుత్వానికి కావాల్సినంత నెగిటివ్ వచ్చేసింది. ఈ మాటలు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సీనియర్లు, ఢిల్లీలోని హైకమాండ్ చెబుతున్న మాటలే. అసలు ఈ హైడ్రా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోందనేది సర్కారుకే అర్థం కావట్లేదు. ఒకవైపు కోర్టులు కన్నెర్రజేసి.. మొట్టికాయలు వస్తున్నప్పటికీ అబ్బే కూల్చుడు కూల్చుడే అని ముందుకు కదలుతున్నాయ్ బుల్డోజర్లు. ఐతే.. ఇప్పుడు హైడ్రా కాస్త బ్రేక్ ఇవ్వడంతో మూసీ, మూవీల గురించే ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది.
ఏమిటీ హడావుడి..?
మూసీ సుందరీకరణ పనులు జోరు అందుకున్నాయి. ఐతే.. ఆపరేషన్ మూసీకి వ్యతిరేకంగా అదే రేంజ్‌లో నిరసన గళం తీవ్రమవుతోంది. మూసీ రివర్‌బెడ్‌లో జీహెచ్‌ఎంసీ చేస్తున్న మార్కింగ్స్‌పై ఆందోళన వెల్లువెత్తుతోంది. పరివాహక ప్రాంత వాసుల్లో గూడుకట్టుకున్న ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. నది పరీవాహక ప్రాంతాల్లో ఉన్న నివాసాలను కూల్చివేయాలని నిర్ణయించడం, ఆ ఇళ్లకు మార్కింగ్ చేస్తుండటంతో బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఇది కాస్త బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పెద్ద యుద్ధంగానే మారింది. ఈ వ్యవహారం హైకమాండ్ దగ్గరికి వెళ్ళింది.
మూవీ గోల ఇదీ..!
టాలీవుడ్ నటులు నాగ చైతన్య - సమంత విడాకులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ బాంబ్ పేల్చారు. ఈ ఒక్క మాట ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పాకింది. అసలు రాజకీయాల్లోకి సినిమా వాళ్ళను లాగడం ఏంటి..? సినిమా వాళ్ళు అంటే అంత చిన్న చూపా..? అంటూ రాజకీయ, సినీ విశ్లేషకులు కన్నెర్ర చేస్తున్నారు. ఆఖరికి మమల్ని ఎందుకు బద్నాం చేస్తున్నారు అంటూ అక్కినేని నాగార్జున స్పందించాల్సి వచ్చింది. నిన్నటి వరకూ హైడ్రా, మూసీ వ్యవహారంపై ప్రజలు తీవ్రంగా స్పందించడంతో, పెద్ద ఎత్తునే వ్యతిరేకత వస్తుండటంతో ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
కొండాపై కన్నెర్ర..!
ఇటు మూసీ.. అటు మూవీ వివాదంతో ఎవరినోట చూసినా ఈ రెండు మాటలే విన్పిస్తున్నాయి.. వార్తల్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర, కేంద్ర హైకమాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు కాంగ్రెస్ పార్టీని ఏం చేయాలని అనుకుంటున్నారో చెప్పాలని కన్నెర్రజేసిందట. మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ పెద్దలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. సినీ ప్రముఖుల పట్ల కొండా సురేఖ వ్యాఖ్యలను ఢిల్లీ పెద్దలు తీవ్రంగా తప్పుబట్టినట్లు తెలిసింది. తెలంగాణలో అసలేం జరుగుతోంది అని ఢిల్లీ నుంచి సీనియర్లకు అగ్రనేతలు ఫోన్లు చేసి అసంతృప్తి వ్యక్తం చేసారట. అక్కినేని నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ వ్యాఖ్యలపై అధిష్టానం వివరణ కోరినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అసలుకే ఎసరు..!
కొండా సురేఖకు మంత్రివర్గంలో ఉండే అర్హత లేదనే డిమాండ్ సామాన్యుడి నుంచి సొంత పార్టీ నేతల వరకూ గట్టిగానే వినిపిస్తోంది. మంత్రి వ్యాఖ్యలపై లీగల్‌గా ముందుకు వెళ్తామని బీఆర్ఎస్ చెబుతోంది. ఈ కామెంట్స్ కాంగ్రెస్ నీచ సంస్కృతికి నిదర్శనం అని విశ్లేషకులు సైతం మండిపడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు సురేఖ ఏం చేయబోతున్నారు..? ఏమని వివరణ ఇస్తారు..? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఐతే.. ఈ వివాదంలో కొండ సురేఖ మంత్రి పదవికి ఎసరు వచ్చినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ఏం జరుగుతుందో.. హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.