యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః! అంటే.. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, అక్కడ దేవతలు నివసిస్తారు.. అని అర్థం. ఇదంతా సినిమాల్లో, పుస్తకాల్లో చెప్పుకోవడానికే పరిమితం అవుతోంది కానీ.. ఎక్కడైనా ఆచరణలో ఉందా అంటే అబ్బే అస్సలు లేదు.. ఎటు చూసినా ప్రశ్నార్థకమే..! తెలంగాణ రాజకీయాల్లో అసలేం జరుగుతోందో ఎవరికీ అర్థం కావట్లేదు. రెండు పార్టీల మధ్య నడిచే రాజకీయాల్లోకి సినీ నటుల కుటుంబాలను లాగడం, అది కూడా దారుణాతి దారుణంగా.. నీచాతి నీచమైన మాటలతో మాట్లాడటం ఎంత వరకూ సమంజసం.
ఏంటమ్మా ఇదీ..!
తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడి ఇన్ని రోజులు అయినా ఎవరూ టాలీవుడ్ జోలికి ఎవ్వరూ వెళ్ళకపోవడంతో ప్రశాంతంగా ఉంది. హమ్మయ్యా.. రాజకీయాల్లోకి సినీ పరిశ్రమను లాగలేదు ప్రశాంతం అనుకునే లోపే.. ఏపీలో లడ్డూ వివాదంపై సినిమా వాళ్ళు ఎంటర్ కావడంతో రచ్చ రచ్చే అయ్యింది. ఇప్పుడిప్పుడే ఇది సద్దుమణిగింది అనుకునే లోపే.. తెలంగాణ రాజకీయాల్లోకి టాలీవుడ్ నటులను లాగడంతో పెను దుమారమే అయ్యింది. యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, సమంతల విడాకులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని.. మంత్రి కొండా సురేఖ పెను దుమారం రేపే ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా ఇటు సినీ పరిశ్రమ, ఇటు రాజకీయ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.
ఇంతకీ ఏమన్నారు..?
ఎన్ కన్వెన్షన్ విషయంలో కేటీఆర్, హీరో నాగార్జున మధ్య వివాదం చెలరేగిందని.. అందుకే ఇది విడాకుల దాకా వెళ్లిందని కొండా సురేఖ చెప్పుకొచ్చారు. అంతటితో ఆగని మంత్రి.. ఎంతో మంది హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని.. హీరోయిన్లకు మత్తు మందు ఇచ్చి, రేవ్ పార్టీల్లో ఎంజాయ్ చేసేవారంటూ సంచలన ఆరోపణలే చేశారు. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు. చూశారుగా.. మంత్రి హోదాలో ఉన్న సురేఖ వ్యాఖ్యలపై ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. సమంత గురుంచి ఒక మహిళా మంత్రి ఇలా మాట్లాడటం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.
ఏంటి ఇంత చిన్న చూపా..?
ఈ ఆరోపణల్లో నిజానిజాలు దేవుడికి ఎరుక కానీ.. ఒక ఆడపడుచు జీవితాన్ని, ఇటు అక్కినేని కుటుంబాన్ని రాజకీయాల కోసం వాడుకోవడం ఎంత వరకూ సమంజసం..? వివాదం ఎక్కడ మొదలైంది.. ఎటు నుంచి ఎటు పోతోంది..? ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య రాజకీయంగా ఉంటే చూసుకోవాలి అంతే కానీ.. ఇలా ఎవరిని పడితే వాళ్ళను లాగడం.. సినిమాల్లో నటించే ఆడపడుచులు అంటే ఇంత చిన్న చూపు ఎందుకు..? రాజకీయాల కోసం గింత దిగజారాలా..? ఏమిటీ సిగ్గులేని రాజకీయాలు అంటూ సినిమా, రాజకీయ విశ్లేషకులు కన్నెర్ర చేస్తున్నారు. ఇకనైనా ఇలాంటి సినిమా ఇండస్ట్రీని రాజకీయాల్లోకి లాగకుండా ఎవరిపని వాళ్ళు చేసుకుంటే మంచిది సుమీ