అవును.. తిరుమల లడ్డూ విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యల అనంతరం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. ఎవరినోట విన్నా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావనే వస్తోంది. ఎందుకంటే.. వైసీపీ హయాంలో లడ్డూలో జంతు నూనె వాడారని స్వయానా ముఖ్యమంత్రి చెప్పడం, ఇక సేనాని మీడియా ముందుకు వచ్చి సనాతన ధర్మం, ప్రాయశ్చిత్త దీక్ష అంటూ మాట్లాడటంతో ఈ వ్యవహారం కాస్త హిందూ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా పరిస్థితి ఏర్పడింది. ఒకసారి కాదు రెండు సార్లు మీడియా ముందుకు వచ్చి ఈ వివాదంపై వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివరణ ఇచ్చినప్పటికీ సద్దుమణగలేదు. దీనికి తోడు తిరుమలకు వెళ్ళాలి అనుకున్న జగన్ డిక్లరేషన్ రచ్చ రేగడంతో విరమించుకున్నారు. ఈ క్రమంలోనే లడ్డూ విషయంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి ఇద్దరూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఏమిటిది..!
తిరుమల లడ్డూ ప్రసాదాల్లో నెయ్యి కల్తీ అయ్యిందని ఆధారాలు లేని వ్యాఖ్యలు చేయడం సరికాదు.. అలాంటి ప్రకటనలు చేయడం వల్ల కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది.. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి అంటూ సీఎం చంద్రబాబుతో పాటు తదితరులను దృష్టిలో పెట్టుకుని సుప్రీం కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. దీంతో కేసు గెలిచేశాం అని ఫీల్ అయిన వైసీపీ.. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసినందుకు క్షమాపణలు చెప్పు చంద్రబాబు అంటూ.. #CBNShouldApologizeHindus అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేసింది. వైసీపీ కార్యకర్తలు, నేతలు, వీరాభిమానులు ఇలా ఒకరా ఇద్దరా వేలాది మంది ట్వీట్లు చేయడం మొదలు పెట్టారు. దీంతో ట్విట్టర్ పిట్టలో ఇదొక పెద్ద ట్రెండ్ అయ్యింది. సీన్ కట్ చేస్తే.. గంటల వ్యవధిలోనే సుమారు లక్ష దాకా ట్వీట్స్ చేశారు. సోమవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకూ ఇదే ట్రెండ్ కొనసాగింది.
ఇవాళ పవన్..!
సుప్రీం వ్యాఖ్యల తర్వాత తిరుమల లడ్డూ వ్యవహారంలో సిట్ దర్యాప్తును కూడా ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలన్నీ ఒక్కసారిగా వైరల్ చేస్తూ.. #PawanShouldApologizeToHindus అంటూ మళ్ళీ మొదలు పెట్టారు. రాత్రి నుంచి ఇప్పటి వరకూ సుమారు 40 వేలకు పైగా ట్వీట్లు చేసి ట్రెండింగ్ లోకి తెచ్చారు. సనాతన ధర్మం, ప్రాయశ్చిత్త దీక్ష అంటూ హడావుడి చేసిన తమరు.. ఇప్పుడు ఏం చేస్తారు..? తిరుమలకు వెళ్లి శ్రీవారిని ఏం కోరుకుంటారు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తోంది వైసీపీ. చంద్రబాబుతో పాటు హిందువుల మనోభావాల్ని దెబ్బతీసినందుకు పవన్ కూడా క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అంటూ వైసీపీ, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఐతే.. ఈ విషయంలో మాత్రం డిఫెన్స్ చేయడానికి టీడీపీ, జనసేన కార్యకర్తలకు ఎలాంటి మార్గం దొరకక మిన్నకుండి పోయారు. ఇక సుప్రీం కోర్టు తుది తీర్పు ఎలా ఉంటుందో.. అప్పుడిక పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి.