మళ్ళీ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్!
తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న వేళ.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నెయ్యి కల్తీ విషయంలో ఉన్న సమాచారాన్ని మాత్రమే సీఎం చంద్రబాబు బయట పెట్టారని చెప్పారు. ప్రాయశ్చిత్త దీక్ష పూర్తి అవ్వడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన డిప్యూటీ సీఎం జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. లడ్డూ వివాదం, సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై స్పందించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం.. విచారణలో కీలక వ్యాఖ్యలు చేసిన తరుణంలో పవన్ ఇలా స్పందించడంపై మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.
లడ్డూ వివాదం కేవలం ట్రిగ్గర్!
గత ఐదేళ్లలో అనేక తప్పిదాలు జరిగాయని పవన్ చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అన్నింటిపైనా విచారణ జరుపుతుందని మరోసారి స్పష్టం చేశారు. ప్రాయశ్చిత్త దీక్ష అనేది కేవలం లడ్డూ కోసమే కాదు అని.. లడ్డూ వివాదం కేవలం ట్రిగ్గర్ మాత్రమే అని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. ఇది కేవలం దీక్ష మాత్రమే కాదన్నారు. శాశ్వత పరిష్కారం కోరుతూ చేపట్టిన దీక్ష అని చెప్పుకొచ్చారు. సనాతన పరిరక్షణ కోసం బోర్డు ఉండాలని మరోసారి సేనాని ఒకింత డిమాండ్ చేశారు. కొన్నేళ్లుగా 219 టెంపుల్స్ ధ్వంసం చేశారని.. రామతీర్థంలో రాముడి తల నరికారన్న విషయాన్ని గుర్తు చేశారు. కాగా మూడు రోజులపాటు పవన్ తిరుమలలోనే ఉండనున్నారు.
అస్సలు తగ్గను..!
లడ్డూ విషయంలో మొదటి నుంచి ఘాటు స్వరం వినిపిస్తున్నది ఒకే ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఐతే.. కట్టర్ హిందూ అని చెప్పుకునే బీజేపీ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇక టీడీపీ మాత్రం అంతంత మాత్రమే. పవన్ మాత్రం గట్టిగానే మాట్లాడుతూ వస్తున్నారు. అందరికంటే ఎక్కువగా విమర్శలు కూడా పవన్ పైనే వచ్చాయి.. వస్తున్నాయ్ కూడా. నిన్న సుప్రీంకోర్టు విచారణ తర్వాత హిందువుల మనోభావాలను దెబ్బ తీసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ క్షమాపణలు చెప్పాల్సిందే అనే డిమాండ్ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నప్పటికీ సేనాని మాటంటే మాటే.. అంటూ తగ్గేదేలా అంటున్నట్లు ఉన్నారు. చివరికి ఏమవుతుందో.. కోర్టు తీర్పు ఎలా వస్తుందో ఏంటో.. అప్పుడు పవన్ రియాక్షన్ ఏంటో చూడాలి మరి.