కొండ పైన కమ్మవారు.. కొండ కింద కమ్మవారు..! అనే మాట మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం కదా..! ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ నడుస్తోంది..! అదేమిటంటే.. కొండ మీద వెంకన్న.. కొండ కింద జగనన్న..! ఇదీ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, నేతలు ఒక రేంజిలో హడావుడి చేస్తున్నారు. అసలు ఏంటిది ఎవరితో ఎవరిని పొలుస్తున్నామో! అర్థం అవుతోందో లేదో అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతి చేయొచ్చు కానీ దానికి ఒక సమయం, సందర్భం అనేది ఒకటి ఉంటుంది కదా.. అవసరమా ఇవన్నీ.. ఇంత రచ్చ.. చర్చ అంటూ పచ్చి బూతులు తిడుతున్న వారూ ఉన్నారు.
ఎందుకిలా..?
తిరుమల లడ్డూను వైసీపీ హయాంలో అపవిత్రం చేశారన్నది సీఎం చంద్రబాబు స్వయంగా చేసిన ఆరోపణ. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఇవాళ దేశ అత్యన్నత న్యాయస్థానం ఒకింత మొట్టికాయలు వేసింది. ఏ విధమైన ఆధారాలు లేకుండా, సిట్ రిపోర్ట్ రాకముందే భక్తులకు కోట్లాది హిందువులకు అబద్ధపు ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వ నేతలకు.. దేవుడిని రాజకీయాలకి దూరంగా ఉంచాలని చీవాట్లు పెట్టిందని వైసీపీ తెగ హడావుడి చేస్తోంది. ఐతే అసలు సిసలైన సినిమా అక్టోబరు 03న విచారణలో తేలనుంది. దీంతో సత్యమేవ జయతే అంటూ.. కొండపైన.. కొండ కింద అంటూ రెచ్చి పోతోంది వైసీపీ.
ఆపండ్రా బాబోయ్..!
రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతారా..? అసలు ఆధారం లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రకటన ఎలా చేస్తారు..? అంటూ కొందరు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబు లాంటి వారు ఐతే.. లడ్డు ప్రసాదం విషయంలో రాజకీయ ఆరోపణలు చేసి లడ్డులా దొరికిపోయిన బాబు! అంటూ ట్వీట్ చేయడం గమనార్హం. ధర్మాన్ని మనము అనుసరిస్తే.. ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది.. సత్యమేవ జయతే ఓం నమో వేంకటేశాయ అంటూ ఇంకొందరు కార్యకర్తలు రచ్చ చేస్తున్నారు. పాపం ఎంత బలమైనది అయినా అంతిమ విజయం సత్యానిదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ శ్రేణులు.
డిప్యూటీ సీఎంపై..!
తిరుమల లడ్డూ విషయంలో ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఏం చేయబోతున్నారు..? అన్నది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. దీన్నే.. ఒకింత సెటైర్లుగా రచ్చ చేస్తున్నారు జగన్ వీరాభిమానులు. ఏడు కొండల వాడా, మమల్ని క్షమించు.. నీ పేరుతో ఓట్ల రాజకీయం చేశాం.. నీ భుజాల మీద నుంచి హిందువుల నమ్మకం మీద దాడి చేశాం.. పరిపాలనా చేత కాక ప్రజల దృష్టిని మళ్లించడానికి నిన్ను వాడుకున్నం.. అంటూ చేసిన అపవిత్రానికి ప్రాయశ్చిత్తంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్ష కొనసాగించాల్సిందే! అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే చేస్తున్నారు. ఈ విషయంలో పవన్ వీరాభిమానులు సైతం గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.
చంద్రబాబు ట్రెండింగ్ లో..!
ఇదిలా ఉంటే.. సీఎం చంద్రబాబు హిందువులకు క్షమాపణ చెప్పాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. గల్లీ మొదలుకుని ఢిల్లీ వరకూ ఉన్న మీడియా ఛానెల్స్, డిజిటల్ మీడియా.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున CBN Should Apologize Hindus అంటూ ట్విట్టర్ పిట్టలో ట్రెండ్ నడుస్తోంది. మరోవైపు.. SathyamevaJayathe అనే ట్యాగ్ కూడా ట్రెండ్ చేస్తోంది వైసీపీ. చూశారుగా.. ఇవాళ మధ్యాహ్నం నుంచి అటు వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తడం.. ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను తిట్టిపోయడమే వైసీపీతో పాటు పలువురు మేధావులు, విమర్శకులు రచ్చ రచ్చే చేస్తున్నారు. ఇందుకు ఏ మాత్రం తగ్గకుండా.. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు కౌంటర్ ఇచ్చి పడేస్తున్నారు. ఇది ఇంకా ఎంతవరకు వెళ్తుందో.. ఎంత రచ్చ అవుతుందో టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.