హైడ్రా దెబ్బకు సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ హడలెత్తి పోతున్న పరిస్థితి. ఓ వైపు హైడ్రాను మెచ్చుకునే వారుంటే.. అంతకుమించి వ్యతిరేకిస్తున్న వారూ ఉన్నారు. ఈ క్రమంలో కూల్చివేతలపై యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. బాధితుల పిటిషన్‌ను ధర్మాసనం సోమవారం నాడు విచారించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు వర్చువల్ గా హాజరై వివరణ ఇచ్చుకున్నారు.
అసలేం జరుగుతోంది..?
రంగనాథ్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కన్నెర్రజేసింది. ఎమ్మార్వో చెబితే చార్మినార్ కూడా మీరు కోల్చేస్తారా..? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రాకు చట్టబద్ధత ఏంటో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. ఐతే.. ఎమ్మార్వో ఆదేశాలు మేరకే కూల్చామని కమిషనర్ రంగనాథ్ సమాధానం ఇవ్వగా.. హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐతే.. ఎమ్మార్వో చెబితే చార్మినార్‌ను కూల్చేస్తారా? కమిషనర్ ను నిలదీసింది.
ఎలా కూలుస్తారు..?
మరోవైపు.. అమీన్‌పూర్ తహసీల్దార్ వివరణపై హైకోర్టు న్యాయమూర్తి సంతృప్తి చెందలేదు. భవనాన్ని 48 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి 40 గంటల్లోపే ఎలా కూల్చుతారంటూ సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో రంగనాథ్ సమాధానం చెప్పేందుకు ప్రయత్నించగా.. నేనడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి.. జంప్ చేయకండి అంటూ హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు చురకలు అంటించింది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. అసలు ఆదివారం నాడు ఎలా కూలుస్తారు..? అని ఎమ్మార్వోపై ఆగ్రహం వ్యక్తం చేశారు.