ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దల సభ రాజ్యసభలో అడుగుపెట్టేది ఎవరు..? ఇప్పుడిదే ప్రశ్న.. అటు టీడీపీలో ఇటు జనసేన, బీజేపీ పార్టీల్లో మెదులుతోంది. ఆశావహుల జాబితా పెద్దదే ఉన్నా.. అధినేతల మనసులో ఏముంది అన్నదే ముఖ్యం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. మూడు పార్టీలు ఒక్కొకటి చొప్పున రాజ్యసభ స్థానాలు పంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు బీజేపీకి ఇచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చని.. రెండు టీడీపీ, ఒకటి జనసేన తీసుకుంటుందని అమరావతి వర్గాలు చెబుతున్నాయి.
ఖాళీలు ఇలా..!
వైసీపీ హయాంలో సీనియర్ నేతలు, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన మోపిదేవి వెంటకరమణ.. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన బీద మస్తాన్ రావు, బీసీ నేత ఆర్. కృష్ణయ్యలకు ఏరికోరి మరీ రాజ్యసభకు పంపిన సంగతి తెలిసిందే. ఐతే.. కారణాలు ఏంటో తెలియదు కానీ వైసీపీ ఓడిపోయిన రోజుల వ్యవధిలోనే రాజీనామా చేశారు. మోపిదేవి, మస్తాన్ ఇద్దరూ టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధం అవ్వగా.. కృష్ణయ్య మాత్రం బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దేశంలోని ఓ పెద్ద రాష్ట్రానికి గవర్నర్ కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అదృష్టవంతులు ఎవరో..?
ఈ ముగ్గురి స్థానంలో ఏపీ నుంచి పెద్దల సభకు వెళ్ళే అదృష్టవంతులు ఎవరు..? అనే చర్చ రాజీనామా చేసిన రోజు నుంచి నడుస్తూనే ఉంది. తాజాగా నడుస్తున్న చర్చ ప్రకారం.. టీడీపీ నుంచి సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా మహేశ్వర రావులలో ఇద్దరికి ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక.. జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు రేసులో ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి నాగబాబును ఉన్నత స్థాయిలో చూడాలని కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అధినేత భావిస్తున్నారు. ఇప్పుడు సమయం ఆసన్నమైందని.. రాజ్యసభ అంటే పెద్ద పదవే కావడంతో పెద్దల సభకు పంపడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మాకు ఒకటి కావాలి..!
ఖాళీ అయ్యింది మూడు స్థానాలు గనుక కూటమిలోని మూడు పార్టీలు మూడు పంచుకుంటే బాగుంటుందని బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి ఆశావహుల జాబితా పెద్దగానే ఉంది.. పైగా చాలా మంది సీనియర్లు తమ ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను త్యాగం చేశారు కూడా. అలాంటప్పుడు టీడీపీ ఈ ప్రతిపాదనకు ఒప్పుకుంటుందా లేదా అన్నది తెలియాలి. ఇక జనసేన నుంచి మాత్రం ప్రస్తుతానికి ఒకే ఒక్క నాగబాబు పేరు మాత్రమే వినిపిస్తోంది. బీజేపీ నుంచి సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. చివరికి ఏపీ నుంచి ఢిల్లీకి వెళ్ళే ఆ అదృష్టవంతులు ఎవరో.. ఏ పార్టీ నుంచి ఎందరు పోతారో చూడాలి మరి.