కొలికపూడి శ్రీనివాసరావు.. తెలుగుదేశం పార్టీ తరపున తొలిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి. గెలిచింది తొలిసారే కానీ ఈయన చేస్తున్న పనులు అన్నీ ఇన్నీ కావు. ఈయన చేష్టలకు ఓట్లు వేసిన జనాలు మొదలుకుని.. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు, ద్వితీయశ్రేణి నేతలు సైతం ఇబ్బంది పడుతున్నారన్నది.. రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. రోజూ ఏదో ఒక వివాదంతో ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉన్నారు. పోనీ ఇదంతా పనికొచ్చే పనులు, జనాలకు నాలుగు మంచి పనులు ఏమైనా చేసి వార్తల్లో నిలుస్తున్నారా అంటే అబ్బే లేనే లేదు.
అవసరమా..?
ఇవన్నీ ఒక ఎత్తయితే.. అసలే మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే గనుక ఎంతో జాగ్రత్తగా, చేసే ప్రతి పని ఆచి తూచి చేయాల్సిన అవసముంది. అలాంటిది.. గెలిచిన మరుసటి రోజు నుంచే వివాదాలే ఊపిరిగా ముందుకు వెళ్తుండటం గమనార్హం. తన లేదు మన లేదు.. ప్రత్యర్థులు లేదు సొంత పార్టీ లేదు అందరి నోళ్ళల్లో నానుతున్నారు కొలికపూడి. ఆఖరికి మీడియాను కూడా వదలకుండా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం ఎంత వరకు సమంజసం..? ఇటీవలే ఆంధ్రజ్యోతి రిపోర్టర్ నా వెంట్రుక కూడా పీకలేడు..? నేను తలుచుకుంటే ఒక్కడు కూడా బయటకు తిరగలేడు..? అంటూ శ్రీనివాసరావు ఓవరాక్షన్ చేశారు. అదీ టీడీపీ అనుకూల మీడియా కావడం.. దీనికి తోడు జర్నలిస్టులు అంతా ఏకం కావడంతో కొలికపూడి చిక్కుల్లో పడినట్టు అయ్యింది.
సీఎం ఏం చేస్తారో..?
వాస్తవానికి ఎమ్మెల్యేల్లో ఎవరైనా సరే వివాదాస్పద చర్యలతో వార్తల్లో నిలిస్తే చాలు మరుక్షణమే.. అందుబాటులో ఉంటే సీఎంవోకి పీలిపించడం లేదా ఫోన్ చేసి క్లాస్ తీసుకోవడం పరిపాటే. కానీ.. తొలి నుంచి వివాదాలతో పార్టీ పరువు గంగలో కలుపుతున్నా ఇంతవరకూ సీఎం ఎందుకో సీరియస్ గా తీసుకోవట్లేదు. దీంతో.. మీడియా ప్రతినిధులు ఒక అడుగు ముందుకేసి.. కొలికపూడిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. మీడియా ప్రతినిధులపై కించపరిచేలా వ్యాఖ్యలు చేసి బెదిరిస్తున్నారని.. వెంటనే కొలికపూడిపై చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. ఆది నుంచి వివాదాల్లో నిలుస్తున్న శ్రీనివాసరావును చంద్రబాబు ఏం చేయబోతున్నారు..?.. కొలికపూడి ఓవరాక్షన్ కు చంద్రబాబు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు..? అనేదానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.