అవును.. వైసీపీ నేతలతో జనసేన హౌస్ ఫుల్ అవుతోంది. ఎన్నికల ముందు.. ఆ తర్వాత కూడా నేతల రాకతో పార్టీలో ఫుల్ జోష్ నెలకొంది. ఈ చేరికలతో జనసేనకు లాభమా..? నష్టమా..? నేతలు కోరుకుంటున్నది ఏమిటీ..? చేరికలు సరే ఇప్పటి వరకూ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, నేతల సంగతేంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..
ఏం జరుగుతుందో..?
2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాక పరిస్థితులు ఏ మాత్రం అనుకూలించడం లేదు అన్నది జగమెరిగిన సత్యమే. వైసీపీ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో అని తెలియక భవిష్యత్ చూసుకుంటున్నారు. సాదా సీదా నేతలు మొదలుకుని బిగ్ షాట్ల వరకూ.. అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారు.. ఇంకా కొందరు కండువాలు కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు కూడా. చేరుతున్నారు సరే.. చేర్చుకుంటున్నారు సరే..? నెక్స్ట్ ఏంటి..? అన్నదే ఇప్పుడు పార్టీ కార్యకర్తల్లో మెదులుతున్న ప్రశ్నలు.
ఇలా ఫుల్..!
ఒకరా ఇద్దరా వైసీపీ నుంచి చోటా మోటా నేతలు మొదలుకుని బడా నేతల వరకూ చేరిపోతున్నారు. ఎన్నికల ముందు వైసీపీ నుంచి వచ్చిన వారు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా కూడా ఉన్నారు. ఆ తర్వాత చేరిన వాళ్ళు అంతా మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు. బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య ఈ ముగ్గురు వైసీపీ ముఖ్యనేతలే. త్వరలోనే గోదావరి జిల్లాలకు చెందిన మాజీ మంత్రి ఆళ్ల నాని కూడా జనసేన వైపు చూస్తున్నారని తెలిసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే దసరా పండుగకు జనసేనలో చేరబోతున్నారని సమాచారం. అప్పట్లో కాంగ్రెస్ నేతలు అంతా వైసీపీలోకి రావడంతో పిల్ల కాంగ్రెస్ అని ఎలా అన్నారో.. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా జనసేనలో చేరుతూ ఉండటంతో పిల్ల వైసీపీ అనే విమర్శలు సైతం గట్టిగానే వినిపిస్తున్నాయి.
వాళ్ళ సంగతేంటి..?
ఒకటి కాదు రెండు కాదు కొన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, నేతలు.. ఎమ్మెల్యేగా పోటీ చేసే రేంజి ఉన్నోళ్లు కూడా ఉన్నారు. గ్రామ స్థాయి మొదలుకుని రాష్ట్ర స్థాయి వరకూ జనసేనకు 2019 ఎన్నికలతో పోలిస్తే.. 2024 ఎన్నికల తర్వాత బాగానే బలపడింది. దీంతో.. కొత్తగా వచ్చిన నేతలతోనే జనసేన హౌస్ ఫుల్ అవుతుంటే.. పాత వాళ్ల సంగతి ఏంటి..? వాళ్లకు మాత్రం కార్యకర్త స్టాయి నుంచి నేతగా.. నేతలుగా ఉన్నోళ్ళు ఎమ్మెల్యే, మంత్రులు కావాలని ఉండదా..? వీళ్ళకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు..? చేరికలను ఎవరూ కాదనట్లేదు కానీ వీరికి ఎలాంటి హామీ ఇస్తున్నారు..? అన్నదే ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లోని కార్యకర్తలు, నేతల్లో మెదులుతున్న ప్రశ్నలు.. మరి వీటన్నిటీకి పవన్ ఎప్పుడు సమాధానం చెబుతారా.. అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అసలు ఈ చేరికలు.. ఉన్నోళ్ళకు న్యాయం చేయకపోతే జనసేనకు నష్టమో.. లాభమో సేనానికే తెలియాలి మరి.